(అనగాని సత్యప్రసాద్, రేపల్లె, శాసనసభ్యుడు, టిడిపి)
వాహనదారులపై విధించిన భారీ జరిమానాలను వెంటనే రద్దు చేయాలి-డీజిల్, టోల్ ట్యాక్స్ తగ్గించాలి-జరిమానాలపై చూపుతున్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై చూపండి.
కరోనా ప్రభావంతో నెలకొన్న గడ్డు పరిస్థితులకు తోడు పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుతో మా పరిస్థితి మరింత దయనీయంగా మారిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను.
రెక్కాడితే కానీ డొక్కాడని మాపై పెట్రోల్, డీజీల్ ధరలు కారు మబ్బులా కమ్మి మా బ్రతుకులను చీకటి మయం చేస్తుంటే మీరెందుకు మౌనంగా ఉన్నారు?
కరోనా ప్రభావం ప్రజా రవాణాతో పాటు సరుకు రవాణా రంగంపైనా పడింది. ఈ రంగంలో ప్రధాన వాటా కలిగి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న లారీ ట్రాన్స్ పోర్టు బాగా దెబ్బతింది. ఓవైపు వాయిదాలు చెల్లించమని బ్యాంకులు, మరోవైపు పన్నులు చెల్లించమని ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి.
ఢిల్లీలో ఏడాది, తెలంగాణలో 6 నెలల పాటు వాహన పన్నును రద్దు చేశారు. రాష్ట్రంలో మాత్రం ఆ దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం.
లాక్ డౌన్ సమయంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఆ కాలంలో నిత్యావసర వస్తువుల రవాణా కోసం లారీలు అడపాదడపా తిరిగాయే కానీ పూర్తిస్థాయిలో రోడ్డెక్కలేదు.
లాక్ డౌన్ కు దశలవారీగా సడలింపులు ఇచ్చిన తర్వాత కూడా ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో గాడిన పడలేదు. రాష్ట్రంలోని లారీలకు కరోనాకు ముందు సాధారణ పరిస్థితుల్లో ఉన్న గిరాకీతో పోలిస్తే ప్రస్తుతం 40 శాతం దాకా వ్యాపారం పడిపోయింది.
వాహనదారులపై భారం పడేలా పెంచిన జరిమానాల పెంపు విధానాన్ని వెంటనే నిలిపి వేయాలి. రవాణా రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి లారీ డ్రైవర్లు, క్లీనర్లకు ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించి ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.
టీడీపీ హయాంలో చంద్రన్న బీమా పథకం కింద లారీ డ్రైవర్లకు బీమా సౌకర్యం కల్పించాం. 20 నెలలుగా ఆ పథకం సక్రమంగా అమలు కావడంలేదు.
ఇక అభివృద్ధికి సూచికలైన రహదారులు వైసీపీ పాలనలో నరకానికి నకలుగా మారాయి. వాహనం రోడ్డెక్కితే పన్నులు, చలానాలతో ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం రోడ్ల మరమ్మతులపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ప్రభుత్వ నిర్లక్ష్యానికి రోడ్డు ప్రమాదాల్లో వందలాదిమంది బలవుతున్నారు.
రోడ్డు మీద గుంతలు, గతుకుల కారణంగా వాహనాలు త్వరగా పాడవుతున్నాయి. ప్రతి క్షణం ప్రమాదపుటంచున వాహనాలు నడుపుతూ లారీ డ్రైవర్లు అష్టకష్టాలు పడుతున్నారు.
అధ్వానమైన రోడ్ల కారణంగా సరుకు సమయానికి చేరడం లేదు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రహదారుల మరమ్మతులు చేపట్టాలి. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలోనే లేబర్ సెస్ వసూలు చేస్తున్నారు.
వెంటనే ఆ సెస్ ను ఎత్తి వేయాలి. సెస్ కింద వసూలు చేస్తున్న రూ. 4, రోడ్డు సెస్ కింద వసూలు చేస్తున్న రూపాయిని తీసేయాలి. టోల్ ట్యాక్స్ ధరలు తగ్గించి , ఇ-వే బిల్ సమయం పెంచి లారీ యజమానులను ఆదుకోవాలి.
అలాగే వాహన మిత్ర పథకం కింద ఆటో, క్యాబ్ డ్రైవర్ కు అందించినట్టే లారీ డ్రైవర్లకు కూడా ఆర్థిక అందించాలి. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన లారీ డ్రైవర్లు, క్లీనర్లకు నెలకు రూ. 10 వేల చొప్పున లాక్ డౌన్ సమయానికి ఆర్థిక సాయం అందించాలి.
మానవతా దృక్పథంతో ప్రభుత్వం లారీ యజమానులను ఆదుకోవడం ద్వారా నిర్వహణ ఖర్చు తగ్గి ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయి. లారీ డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించాలి.
(అనగాని సత్యప్రసాద్, టీడీపీ శాసనసభ్యులు,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ)