(సంజయ్ యాదవ్)
తెలంగాణ, నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్న నోముల నర్సింహ్మయ్య యాదవ్ మరణానంతరం అక్కడ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో యాదవుల ప్రాభల్యం ఎక్కువగా ఉన్న జిల్లా నల్లగొండ.
ఈ సీటులో యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని టిఆర్ఎస్ మళ్లీ బరిలోకి దింపనుందా? ఇంకా తేలలేదు. అలాగే బిజెపి నుంచి కూడా యాదవ అభ్యర్థిని పోటీ పెట్టే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అయినా ఈ రెండు పార్టీలు ఇంకా క్లారిటీ ఇవ్వడంలేదు.
కాంగ్రెస్ మాత్రం రెడ్డినే బరిలోకి దింపనుంది. కానీ టిఆర్ఎస్, బిజెపిలు యాదవులను పోటీలో ఉంచుతాయా లేదా అన్నది తేల్చకుండా దాగుడుమూతలు ఆడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వీలైతే ఆ రెండు పార్టీలు యాదవులకే టికెట్ ఇస్తే ఆ పార్టీలకు భవిష్యత్తు ఉంటుందని బలంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే…? అనుకుంటున్నారా? పూర్తి స్టోరీ చదవండి.
ఉమ్మడి రాష్ట్రంలో అయినా తెలంగాణలో అయినా సరే నల్లగొండ రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి. నల్లగొండ అంటేనే రెడ్డీల అడ్డా అనే పేరుంది. ఎన్నికలు ఏవైనా… పార్టీలు ఏవైనా… ఏ జిల్లాలో గెలవనంత మంది రెడ్లు నల్లగొండలో గెలుస్తూ ఉంటారు.
అయితే ఇంతటి ప్రభావం ఉన్న జిల్లాలో వారిని ఎదుర్కోవడంలో గతం నుంచీ యాదవులు క్రియాశీలక పాత్ర పోశిస్తూనే ఉన్నారు. సమయం వచ్చినప్పుడల్లా యాదవ నేతలు తమ సత్తా చాటుతున్నారు. జిల్లా రాజకీయాల్లో స్టాల్ వార్ట్ గా నిలిచిన వారిలో నర్రా రాఘవ రెడ్డి ఒకరైతే, కుందూరు జానారెడ్డి ఒకరు. వీరిద్దరూ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే. కానీ వీరిద్దరూ జీవితంలో ఓడిపోయారంటే అది యాదవుల చేతిలోనే అంటే ఆశ్చర్యం కలగక మానదు.
నర్రా రాఘవ రెడ్డి విషయం చూద్దాం. ఆయన కమ్యూనిస్టు యోధుడు. నకిరేకల్ నియోజకవర్గం నుంచి7 సార్లు పోటీ చేయగా 6సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ ఆ ఒక్కసారి మాత్రం ఓడిపోయింది ఒక యాదవ మహిళా నేత చేతిలో. ఆమెనే మూసాపేట కమలమ్మ. ఆమె చేతిలో నర్రా రాఘవరెడ్డి 1972లో ఓటమిపాలయ్యారు. ఆమె కాంగ్రెస్ తరుపున పోటీ చేశారు. మిగతా అన్ని ఎన్నికల్లో నర్రా గెలిచారు.
ఇక జానారెడ్డి జీవితంలో అసెంబ్లీకి పోటీ చేసిన రెండు సందర్భాల్లో ఓటమిపాలయ్యారు. ఉమ్మడిరాష్ట్రంలో ఒకసారి, తెలంగాణలో మరోసారి ఓడిపోతే రెండు సందర్భాల్లోనూ జానారెడ్డిని ఓడగొట్టిన వారు యాదవులే.
1994 లో చలకుర్తి నియోజకవర్గంలో డాక్టర్ జి రామమూర్తి యాదవ్ జానారెడ్డిని 2621 ఓట్ల తేడాతో ఓడగొట్టారు. ఆ తర్వాత తెలంగాణ స్వరాష్ట్రంలో 2018లో నోముల నర్సింహ్మయ్య యాదవ్ టిఆర్ఎస్ తరుపున పోటీ చేసి 7771 ఓట్ల తేడాతో జానాను ఓడించారు.
నల్లగొండ జిల్లాలో ఏ నియోజకవర్గంలో అయినా సరే అన్ని పార్టీలు రెడ్డి సామాజికవర్గం వారినే బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా నల్లగొండకు పేరుండేది. అప్పుడు సైతం సిపిఐ, సిపిఎం పార్టీలు రెడ్డీలకే టికెట్లు కేటాయించేవి.
తర్వాత నర్రా వారసత్వంగా నోముల నర్సింహ్మయ్య యాదవ్ నకిరేకల్ నుంచి సిపిఎం పార్టీ తరుపున 2సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత నకిరేకల్ ఎస్సీ రిజర్వు సీటు గా మారిపోవడంతో నర్సింహ్మయ్య నాగార్జున సాగర్ వలస వెళ్లాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో రెడ్డీ అయితేనే గెలుస్తారు అన్న పాత చింతకాయ పచ్చడి నానుడిని టిఆర్ఎస్, బిజెపిలు పక్కనపెట్టి యాదవులకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం కాంగ్రెస్ తరుపున మళ్లీ జానారెడ్డే నిలబడతారు. ఆ ముచ్చట తేలిపోయింది. కానీ టిఆర్ఎస్, బిజెపి మాత్రం ఇంకా యాదవులతో దోబూచులాడుతూనే ఉన్నాయి. టిఆర్ఎస్ తరుపున యాదవులకే ఇవ్వాలనుకుంటే నోముల తనయుడు నోముల భగత్ యాదవ్ కు ఇవ్వొచ్చు.
ఒకవేళ సర్వేల్లో ఆయనకు ఆదరణ లేదని భావిస్తే నోముల కుటుంబానికే చెందిన దూదిమెట్ల బాలరాజు యాదవ్ కు ఇవ్వొచ్చు.
దూదిమెట్ల బాలరాజు యాదవ్ విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో ఉన్నారు. ఎన్జీ కాలేజీకి ఎస్.ఎఫ్.ఐ అధ్యక్షుడిగా పనిచేశారు. నకిరేకల్ డివిజన్ సెక్రెటరీగా పనిచేశారు. ఆ తర్వాత ఉస్మానియా జెఎసి నేతగా అనేక ఉద్యమాలు, పాదయాత్రలు చేపట్టారు. జైలు జీవితం గడిపారు. హైదరాబాద్ లో జరిగిన ఎపి ఎన్జీఓల సభలో జై తెలంగాణ నినాదాలు చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వం విషయంలో టిఆర్ఎస్ ముందడుగు వేయవచ్చు.
ఇక బిజెపి సైతం యాదవ ఓటు బ్యాంకును కొల్లగొట్టి గెలవాలన్న ఉత్సుకతతో ఉంది. అందుకోసమే టిడిపి నుంచి బిజెపిలో చేరిన కడారి అంజయ్య యాదవ్ కు టికెట్ ఇస్తున్నట్లు లీకులు ఇచ్చారు. తర్వాత మళ్లీ ఏమైందో ఏమో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మునుగోడులో రాజీనామా చేయించి ఉప ఎన్నికలో పోటీ చేయిస్తామని ఒక లీక్ ఇచ్చారు.ఆ తర్వాత ఆయన ఆ లీక్ ను ఖండించారు.
ఇప్పుడు తాజాగా బలమైన రెడ్డిని బరిలోకి దింపే ఆలోచనలో బిజెపి వాళ్లు ఉన్నట్లు ప్రచారం సాగుతున్నది. కడారి అంజయ్య యాదవ్ సౌమ్యుడిగా, జిల్లాలో మంచి నేతగా ముద్రపడి ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పక్కనపెట్టడమంటే బిజెపి తన గోతిని తానే తొవ్వుకున్నట్లే అవుతుంది.
ఎందుకంటే దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచి, జిహెచ్ఎంసి ఎన్నికల్లో మంచి సీట్లు గెలుపొంది ఆ పార్టీ ఊపుమీదున్నది. కానీ ఇక్కడ అంజయ్య యాదవ్ ను పక్కనపెడితే ఆ పార్టీ గెలుపు అంత ఈజీ కాదన్నది గుర్తించాలి.
ఒకవేళ అంజయ్య యాదవ్ ను కాదనుకున్నా ఒకప్పటి ఉస్మానియా యూనివర్శిటీ ఎబివిపి నేత, ప్రస్తుతం ఎన్నారై అయిన కొంపల్లి శ్రీనివాస్ ను బరిలోకి దింపవచ్చు. కొంపల్లి విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్నారు. అద్వానీ చేపట్టిన రథయాత్రలో పాల్గొన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఉస్మానియా నుంచి వెళ్లిన విద్యార్థుల్లో కొంపల్లి ఒకరు. వీరిద్దరిలో ఎవరో ఒకరిని బరిలోకి దింపితే బిజెపికి భవిష్యత్ ఉంటుంది.
ఇక 2018 ఎన్నికల సందర్భాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. కోదాడలో యాదవ సామాజికవర్గానికి చెందిన బొల్లం మల్లయ్య యాదవ్ బలమైన టిడిపి నేతగా ఉన్నారు. ఆయనను కాదని మహా కూటమి తరుపున కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి నాయకురాలికి టికెట్ కేటాయించారు. దీంతో బొల్లం మల్లయ్య యాదవ్ చేసేది లేక టిఆర్ఎస్ లో చేరిపోయారు. ఆ పార్టీ వెనువెంటనే టికెట్ ఇచ్చింది. సంచలన విజయం నమోదు చేసుకున్నారు బొల్లం. టిఆర్ఎస్ పార్టీ నుంచి 2018 ఎన్నికల్లో ఐదుగురు యాదవులు అసెంబ్లీకి ఎన్నికైతే నోముల, బొల్లం మల్లయ్య యాదవ్ ఇద్దరూ నల్లగొండ ఉమ్మడి జిల్లా నుంచే ఉండడం గమనార్హం. అలాగే ఉమ్మడి పాలమూరు నుంచి కూడా ఇద్దరు ఉన్నారు.
ఈసారి జరిగే ఉప ఎన్నికల్లో ఇటు టిఆర్ఎస్ అయినా, బిజేపి అయినా యాదవులను బరిలోకి దింపితే విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఒకవేళ ఉప ఎన్నికల్లో జానా మీద సింపతీ ఉందనుకున్నా… రానున్న ఎన్నికల్లో మాత్రం గెలుపు ఖాయమే అవుతుందని గుర్తుంచుకుంటే మంచిది. యాదవుల ఆరాధ్య దైవం దురాజ్ పల్లి లింగమంతుల జాతర మరికొద్ది గంటల్లో షురూ కానుంది. ఈ శుభ సందర్భాన్ని అందిపుచ్చుకుని యాదవులను ఆదరించే పార్టీలకు కచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది… అలాగే ఆ లింగమంతుల స్వామి దీవెనలూ కచ్చితంగా ఉంటాయి.
( ఈ వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.టిటిఎన్ కు వాటితో ఏకీభవించనవసరం లేదు.)