ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కె నారాయణ స్వామి ప్రాతినిథ్యంలోని జీడీ నెల్లూరు నియోజకవర్గం అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారిందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపించారు.
తమిళనాడు సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం నుంచి ప్రతిరోజు లారీల కొద్దీ ఎర్రచందనం, ఇసుక, గ్రానైట్ చెన్నైకి తరలిస్తున్నారని చెప్పారు.
స్మగ్లర్లు కొందరు చంద్రగిరి నియోజకవర్గంలోని శేషాచల అడవుల నుంచి తస్కరించిన ఎర్రచందనం పెనుమూరు, కొత్తపల్లి మిట్ట, పచ్చికాపల్లం, కార్వేటినగరం ఇతర మార్గాలద్వారా చెన్నైకి చేరవేస్తున్నారన్నారు.
అలాగే ఎర్రమిట్ట పల్లె, గుడ్యానం పల్లె, ఎగువ కన్నికాపురం నుంచి రోజు గ్రానైట్ లారీలతో పంపుతున్నారని తెలిపారు.
కల్వకుంట, జీడీనెల్లూరు నుంచి ఇసుకను లారీలు, ట్రాక్టర్లు, ట్రిప్పర్లతో యథేచ్ఛగా తరలిస్తున్నారన్నారు.ఈ అక్రమ వ్యాపారాల వెనుక జీడీ నెల్లూరుకు చెందిన అధికార పార్టీ నాయకుల హస్తం ఉందని ప్రజలు బహిరంగంగా చెపుతున్నారని అన్నారు.
వారికి నారాయణస్వామి ఆశీస్సులు ఉన్నాయని, అధికారులు కుడా పాలకులకు తలవొగ్గి సహకారం అందిస్తున్నారని సర్వత్రా వినిపిస్తోందన్నారు.
నారాయణ స్వామి తన చుట్టూ ఉన్న కోటరీ మొత్తం అక్రమ వ్యాపారులే అన్న విషయం గ్రహిస్తే మంచిదన్నారు. ఇకనైనా తప్పుడు దారిలో నడిపిస్తున్నవారిని అయన కట్టడి చేస్తే కొంతవరకైనా నియోజకవర్గం బాగుపడుతుందని అశాభావం వ్యక్తం చేసారు.
ఈ ఆరోపణలు తప్పయితే ప్రభుత్వం విచారణ కమిటీ వేసి నిరూపించ గలదా? అంటూ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమాలను అరికట్టాలని కోరారు.