‘మహాప్రస్థానం’పై మాట్లాడే సత్తా ఉన్న వారిలో సింగమనేని ఒకరు

సింగమనేని మరణం ప్రజా సాహిత్యోద్యమానికి తీరని లోటు: జనసాహితి సంతాపం

ప్రఖ్యాత ప్రగతిశీల రచయిత, సాహిత్య విమర్శకుడు ప్రజా రంజక ఉపన్యాసకుడు సింగమనేని నారాయణ గారు ఈరోజు అనగా 25 ఫిబ్రవరి 2021న కన్నుమూశారు.

వారి మరణం ప్రజా సాహిత్యోద్యమానికి తీరని లోటు!
సాహిత్యకారుడిగా అనునిత్యం సాహితీ సృజన కావిస్తూ కూడా ఒక ఉపాధ్యాయునిగా , సింగరాజు రామకృష్ణయ్య గారి అనుచరునిగా, ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ ఉద్యమంలో కూడా సింగమనేని చురుకైన పాత్ర పోషించారు.

అంతేకాక కరువు పీడిత అనంతపురం జిల్లా రైతాంగ ఆందోళనలతో సింగమనేని ప్రత్యక్షంగా మమేకమయ్యారు . సాహిత్య వేదికలపై నుండే కాక అనేక ప్రజాతంత్ర ఉద్యమ వేదికల నుండి కూడా ప్రజావాణిని సింగమనేని వినిపించేవారు.

తన 78 ఏళ్ల జీవితంలో సాహిత్య, ఉపాధ్యాయ, ప్రజాతంత్ర ఉద్యమాలతో మమేకమై సాగిన సింగమనేని సాహిత్య ఉద్యమంలో కథా రచయితగా, సాహిత్య విమర్శకునిగా, సాహిత్యకారుల ‘మున్నుడి’ మాటల పెద్దగా ప్రశంసనీయమైన కృషి చేశారు.

తెలుగునాట మహాకవి శ్రీశ్రీ గురించి ప్రత్యేకించి మహాప్రస్థానం పై సాధికారంగా మాట్లాడగలిగిన చాలా కొద్దిమందిలో సింగమనేని ఒకరు.

అంతేకాక , చాలామంది రచయితలు తెలుగు భాష భవిష్యత్తుకు రానున్న ప్రమాదాన్ని పసిగట్టలేని స్థితిలో ప్రజల మాతృభాషలోనే విద్యాబోధన తప్పనిసరి అంటూ జనసాహితితో గొంతు కలిపి అనేక వ్యాసాలను, మహోపన్యాసాలను ఆయన చేశారు.

కరువు సీమపై సింగమనేని మొదటి కథ జూదం ‘ప్రజాసాహితిలో’ 43 సంవత్సరాల క్రితం (1977 నవంబర్) వెలువడింది.

ఆయన మొదటి సాహిత్య విమర్శనాత్మక సమీక్షా వ్యాసం దాశరధి రంగాచార్య నవల ‘పావని” పై రాసినది కూడా ప్రజాసాహితి లోనే (1978 ఆగస్టు) వెలువడింది.

ప్రముఖ సాహిత్య విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య అన్నట్లు “సింగమనేని శిల్పం అనితర సాధ్యం. కథాశిల్ప మర్మజ్ఞుడాయన. “దిద్దుబాటు” కథతో గురజాడ తెలుగు కథకు ప్రాణం పోస్తే, “జూదం’ కథతో అనంత కథను స్వీకరించిన ఘనత సింగమనేని నారాయణ గారికే చెందుతుంది.

*అందుకేనేమో తన అడుగుజాడల్లో నడిచి వచ్చి కలం పట్టి కథలు రాసిన రచయితల వస్తు శిల్పాలను ప్రభావితం చేసిన గొప్ప కథకుడు సింగమనేని”*1978 నాటి జనసాహితి మొదటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులలో సింగమనేని ఒకరు.

2007లో జనసాహితి పదవ రాష్ట్ర మహాసభలో సింగమనేని ప్రారంభోపన్యాసం చేశారు.

“కరువుసీమ ఆంధ్రజాతికి తరిమెల నాగిరెడ్డి అనే మచ్చలేని మహానాయకుడుని అందించింది” అంటుండేవారు సింగమనేని.

గడచిన ఆరు నెలలుగా అనారోగ్య సమస్యలలో కోలుకోలేని విధంగా చిక్కుకుని ఆయన నేటితో శాశ్వతంగా ప్రజా జీవితాన్ని వీడి వెళ్లిపోయారు.

సింగమనేని నారాయణ మరణంతో తెలుగు సాహిత్య ప్రపంచo ఒక సాహిత్య దిగ్గజాన్ని , ప్రజా ఉద్యమాలు ఒక గట్టి మద్దతుదారుని కోల్పోయినట్లయింది. ఆ విధంగా వారి మరణం ప్రజా సాహిత్యోద్యమానికి తీరని లోటు!
వారి మరణానికి జనసాహితి ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతోంది.

డాక్టర్ సూర్య సాగర్ ,
కొత్తపల్లి రవిబాబు,
దివికుమార్,
డాక్టర్ అరుణ,
ప్రజాసాహితి నాగరాజు
డాక్టర్ భట్టు లక్ష్మీనారాయణ
జనసాహితి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *