(జింకా నాగరాజు)
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్నటి నుంచి కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ రోజు రేపు కూడా ఆయన నియోజకవర్గంలో తిరుగుతారు. కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. ఆవేశంగా మాట్లాడుతున్నారు.కేసులకు భయపడవద్దు, దాడులకు వెరవవద్దు, మీకేమీ కాదు, నేనున్నా అంటున్నారు. నిజానికి అక్కడ ఆయన హంగామా చూస్తే భయపడుతున్నది కార్యకర్తులు కాదు, చంద్రబాబే అనిపిస్తుంది.
పంచాయతీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆయన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎన్నికలపుడు కూడా రాని నాయకుడు ఎన్నికలయి పోయాయో లేదో అపుడే వచ్చాడనే విషయం కుప్పంలో బాగా చర్చ నీయాంశమయింది. ఏడుసార్లు చంద్రబాబు ను గెలిపించిన కుప్పంలో టిడిపి పునాదులు కదులుతున్నాయనే చర్చ మొదలయింది నిజానికి ఈ చర్చ 2014లోనే మొదలయింది. 2019 నాటికి ఉపందుకుంది. 2021 పంచాయతీ ఎన్నికల తర్వా తీవ్రమయింది.
చంద్రబాబు నాయుడు కుప్పం సందర్శనకు వచ్చే వారు కాదు, నాకేమి కాదనేది ఆయన ధైర్యం. తన బంట్లు తనని కాపాడతారనే విశ్వాసం ఆయనది. నామినేషన్ వేసేందుకు కూడా వచే వారు కాదు. ఎన్నికలయి పోయి గెలిచాక కుప్పం సందర్శన అసలే ఉండదు. కుప్పాన్ని పరిపాలించేందుకు ఆయన ముగ్గురు నలుగురు వ్యక్తులను ఎంచుకున్నారు. అందులో ఆయన కార్యదర్శి మునిరత్నం ఒకరు. ఈ నలుగురు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దర్జా వెలగబెట్టారు.
వీళ్లంతా అధికారం ఉన్న వాళ్లే తప్ప ప్రజల్లో ఆదరణ ఉన్న వాళ్లు కాదు. వీళ్లే కొంప ముంచుతున్నారని ఎవరిని అడిగినా చెబుతారు. నిజంగా ఓటర్లలో పట్టు ఉన్నవాళ్లను చంద్రబాబు పక్కన పెట్టేశారనే విమర్శ బాగా ఉంది. ఈ విమర్శ సర్వత్రా వినబడుతుంది. టిడిపి వాళ్లంతా ముక్తకంఠంతో చెబుతారు. నియోజకవర్గంలో చంద్రబాబు సందర్శించకపోవడం, ఆయన కుమారుడు లోకేశ్ అసలూ అటువైపు చూడకపోవడం, తాబేదార్లకు నియోజకవర్గాన్ని అప్పగించడంతోనే కుప్పం నుంచి చంద్రబాబును తరిమేయవచ్చనే ధైర్యం వైసిపిలో బాగా పెరిగింది.
జగన్ ఈ బాధ్యతను అన్ని విధాల బలాఢ్యుడయిన పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అప్పగించారు. పెద్దిరెడ్డి కుప్పంలోనే మకాం వేశారు. పెద్దిరెడ్డి బాగా కష్టపడుతున్నారని అందరికి తెలుసు. చంద్రబాబు ఎవ్వరికీ అందుబాటులో లేకుండా పోతే, పెద్దిరెడి అందరికి అందుబాటులోకి వచ్చారు.
2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు కుప్పం రానేలేదు.2020లో కరోనా పాండెమిక్ వల్ల రాలేదు. అయితే, ఈ అవకాశాన్ని వైసిపి బాగా ఉపయోగించుకుంది. పెద్దిరెడ్డి కుప్పంలో బిసిలను టిడిపి నుంచి దూరం చేసే వ్యూహం అమలుచేశారు. కరోనా కాలం సాయం అంటూ, ఆ పథకం ఈ పధకం అంటూ వైసిపి నియోజకవర్గం మూలమూలలని అక్రమించుకుంది.
చంద్రబాబు బలగమంతా బిసిలే నని ఎన్నికల ముందే జగన్ గ్రహించారు. బిసిలో వన్నికుల క్షత్రియులు బాగా ఎక్కువ. వారిని టిడిపి నుంచి పక్కకు లాగేశారు. ఇపుడు పెద్దిరెడ్డి మిగతా పని చేస్తున్నారు. ఆయన ఈ పనిలో బాగా విజయవంతమవుతున్నారు.
పంచాయతీ ఎన్నికల తర్వాత తిరుపతి లో ఒక ప్రకటన చేస్తూ 2024లో కుప్పాన్ని వైసిపి లాగేసుకుంటుందని పెదిరెడ్డి ప్రకటించారు. అందుకే బెదిరిపోయి చంద్రబాబు నాయుడు కుప్పం వచ్చారని చాలా మంది చెబుతున్నారు. చంద్రబాబును ఓడించేందుకు ఎందుకు అంత శ్రద్ధ పెద్ది రెడ్డి చూపుతున్నారు?
దీనికి చాలా సుదీర్ఘమయిన రాజకీయ చరిత్ర ఉంది. అది తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీలో మొదలయింది. ఇంకా కొనసాగుతూ ఉంది. ఇపుడు కుప్పంలో కనిపిస్తున్న టిడిపి-వైసిపి వైరం, యూనివర్శిటీ కాలం నాటి చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి వైరమే నని చాలా మంది చెబుతారు. అంతా అంగీకరిస్తారు. ఆ రోజులో చంద్రబాబుది పై చేయి అయింది. పెద్దిరెడ్ది కంటే ముందే మంత్రిఅయిన చంద్రబాబు మీద ఇపుడు పెద్దిరెడ్డి కసి తీర్చుకుంటున్నారని వారి గొడవను కళ్లారా చూసిన వారు చెబుతున్నారు.
చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య వున్న వైరం నలబై ఏండ్ల నాటిది. వాళ్లిద్దరు ఎస్వీ యూనివర్శిటీలో ప్రత్యర్థి వర్గాలకు నాయకత్వంలో వహించారు. నిజానికి పెద్దిరెడ్డి డిగ్రీ చదువుకునే రోజుల్లో చాలా మితభాషి, రాజకీయవాసనేం లేదు. యూనివర్శిటీ వెళ్లాకే ఆయన విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారని డిగ్రీ చదివేరోజులో ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ లో ఆయన రూం (106) పక్కరూమ్ (రూంనెంబర్ 107) లో ఉన్న మిత్రుడొకరు చెప్పారు.
వీళ్లిద్దరి మధ్య వైరం మొదట రెడ్డి వర్సెస్ నాన్ రెడ్డిగా ఉండింది. ఇది బాగా ముదిరి రెడ్డి వెర్సెస్ కమ్మ అయింది. ఈ వైరం ముదిరినందునే ఇద్దరు మొదట రాజకీయనేతల అండ కోరారు, ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత ఇద్దరు రాజకీయనాయకులయ్యారు.
1975 నాటి మాట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోషియాలజీ లో ఎమ్మే చదువుతున్నారు. చంద్రబాబు ఎకనమిక్స్ లోఉన్నారు. ఆ మరుసటి సంవత్సరంలో యూనివర్శిటిలో ఎలెక్షన్లు జరిగాయి. పెద్దిరెడ్డి చెర్మన్ గా పోటీ చేశారు. చంద్రబాబు పోటీ చేయలేదుగాని, పెద్దిరెడ్డిని ఓడించేందుకు పూనుకున్నారు. ఆపుడాయనకు రెడ్డి వ్యతిరేక కులాలన్నీ మద్దతునిచ్చాయి.అయినా పెద్దిరెడ్డి గెలిచారు.
ఆయన విద్యార్థి యూనియన్ ఛెయిర్మన్ గా ఉన్నపుడు రెడ్లి, కమ్మ కుల సమీకరణ బాగా జరిగింది. ఈ వర్గానికి రాజకీయ మద్దతు అవసరమయింది. రాజకీయనాయకులు కూడా రాయలసీమలోని ఒకే ఒక్క విశ్వవిద్యాలయంలో పట్టుకోసం ఆరాటపడ్డారు. అపుడు రామచంద్రారెడ్డికి నీలం సంజీవరెడ్డి ఆశీస్సులు లభించాయి. ఆయన సంజీవరెడ్డిని యూనివర్శిటీకి పిలిపించి దీనిని ప్రదర్శించారు.
ఇదే సమయంలో చంద్రబాబు అప్పటి ఎమ్మెల్సీ గల్లా రాజగోపాల్ నాయుడు మద్దతు సంపాదించారు. ఆయన చంద్రబాబుని ప్రొఫెసర్ ఎన్ జి రంగాకు పరిచయం చేశారు. ఆ రోజు రాష్ట్ర రాజకీయాల్లో రంగా, సంజీవరెడ్డిల మధ్య వైరం ఉండేది. అది అందరికి తెలిసిందే
అలా వీళ్లిద్దరు రాజకీయాల బాటపట్టారు. వీళ్లిద్దరి రాజకీయ నేతల అండ దొరక్కపోయి ఉంటే, లెక్చరర్లో ప్రొఫెసర్లో అయిఉండేవారని వారిద్దరికి సన్నిహితుడయిన ఒక చిత్తూరు జిల్లా నాయకుడొకరు చెప్పారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు సివిల్స్ వైపు వెళ్లే ఆలోచనకూడా చేశారని ఆయన చెప్పారు. ఒకరు రంగా వల్ల, మరొక నీలం సంజీవరెడ్డి వల్ల ఉత్తేజితులయి రాజకీయాల్లోకి వచ్చారు.
చంద్రబాబు మెల్లిగా కాంగ్రెస్ లోకి వస్తే, పెద్దిరెడ్డి జనతా పార్టీ వైపు మళ్లారు. ఆయన నీలం సంజీవ రెడ్డి ప్రభావం వల్ల అపుడు కాంగ్రెస్ వ్యతిరేకిగా ఉన్నారు. ఎమర్జన్సీ తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో పీలేరు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి సైఫుల్లా బేగ్ చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆయన సమితి ప్రెశిడెంటుగా కూడా పోటీ చేశారు. ఓడిపోయారు.
తర్వాత ఆయన కాంగ్రెస్ లో కి వచ్చారు. మళ్లీ పీలేరు నుంచి ఫోటీ చేశారు. ఈ సారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చల్లా ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అలా అపుడు రాజకీయాల్లో వరస పరాజయాలు ఎదురయ్యాయి. ’విద్యార్థి దశలో లాగానే రాజకీయాల్లో కూడా రామచంద్రారెడ్డి పట్టుదలతో ఉన్నాడు. నిరాశ చెందలేదు. ఇద్దరిలో ఈ పట్టుదల ఉంది. అనుకున్నది సాధించాలనుకునే తత్వం వారిది కాకపోతే, చంద్రబాబు సాఫ్ట్ గా ఎత్తులు పైఎత్తులు వేస్తారు. పెద్దిరెడ్డి అగ్రెసివ్,’ అని వారి సమకాలీన వ్యక్తి ఒకరు చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 1989లో మాత్రమే అసెంబ్లీలో కాలు మోపగలిగారు.
ఇక అటు వైపు చంద్రబాబునాయుడు పోటీ చేసిన తొలి ఎన్నిక (1978) ల్లొనే గెలిచారు. ఎమర్జన్సీ తర్వాత జరిగిన ఈ ఎన్నికలో ఆయన కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రగిరి నుంచి పోటీ చేశారు. జనత పార్టీ నుంచి బాగా పేరున్న కొంగర పట్టాభిరామ చౌదరినే పెట్టారు. ఆయనకు గాంధియన్ అని పేరుంది. అయినా సరే, చంద్రబాబే గెలిచారు. మెజారిటీ మాత్రం 2494 ఓట్లు మాత్రమే.
తర్వాత 1983లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి మేడసాని వెంకట రామానాయుడి చేతిలో 17,500 తేడా ఓట్లతో ఓడిపోయారు.
తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. 1989లో ఆయన చంద్రగిరిని వదిలేసి కుప్పం వెళ్లారు.
దీనికి కారణం కూడా నేరుగా రాచంద్రారెడ్డి కాకపోయినా కమ్మ, రెడ్డి రాజకీయాలేనని చెబుతారు. చంద్రగిరిలో రెడ్లు, కమ్మలు ఇద్దరు బలమయిన వర్గమే. అందువల్ల పోటీ ఎపుడూ హోరా హోరీగా ఉంటుంది. ఇలా ప్రమాదం అంచున ఉండటం కంటే సురక్షితమయిన నియోజవర్గం అవసరమని చంద్రబాబు నాయుడు భావించారు. కమ్మలు, రెడ్లు ఇద్దరు పెద్దగా లేని కుప్పం ఎంచుకున్నారని చంద్రబాబు యూనివర్శిటీ నాటి మిత్రులొకరు చెప్పారు.
కుప్పంలో బిసిలు ఎక్కువ, అందునా గాండ్ల, వన్నికుల క్షత్రియులు ఎక్కువ. తెలుగుదేశం పార్టీ కి బిసిలలో ప్రాబల్యం ఉండటంతో కుప్పం ఎంచుకున్నారని అందరికి తెలిసిందే. అందుకే బిసిల అండతో ఆయన ఇప్పటిదాకా గెలుస్తూ వస్తున్నారు.
కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదం
చంద్రబాబును ఓడించేందుకు కుప్పంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిదమే చేస్తూ వచ్చింది. అక్కడ బిసి అభ్యర్థికి బదులు రెడ్డినే నిలబెడుతూ వచ్చింది. నాన్ రెడ్డిని నిలబెట్టినా ఆందులో కమిట్ మెంటు కనిపించేది కాదు. ఒకసారి ఓడితే రెండో దఫా సీటివ్వలేదు. ఫలితంగా రాజకీయ చతురుడయిన చంద్రబాబు బిసిల వోటు పోలరైజేషన్ తో తిరుగులేని శక్తిగా వుంటూ వచ్చారు.
అయితే, ఈ రహస్యాన్ని వైసిపి నేత జగన్ కనిపెట్టారు. 2014 ఎన్నికల్లో ఆయన వన్నికల క్షత్రియ కులానికి చెందిన చంద్రమౌళి అనే ఐఎఎస్ అధికారిని ఎంపిక చేశారు. ఈ వ్యూహం బాగా పనిచేసింది. ఓడిపోయినా చంద్రబాబు మెజారిటీని చంద్రమౌళి బాగా తగ్గించారు.
అందుకే 2019 లో మళ్లీ చంద్రమౌళినే నిలబెట్టారు. ఈ సారి చంద్ర బాబు మెజారిటీ ఇంకా తగ్గింది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటుచేశారు. తెలుగుదేశంవారిలో ముచ్చెమటలు మొదలయ్యాయి.
కారణమేమిటోగాని, ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి వైషమ్యం తీవ్రమయింది. వ్యక్తిగత స్థాయికి పెరిగింది. ఇలాంటి వైషమ్యం దేశంలో ఏ ఇద్దరు ప్రత్యర్థి నేతల మధ్య ఎక్కడా కనిపించదు. చంద్రబాబుని కుప్పం నుంచి తరిమేయాలని, టిడిపి అసలు అసెంబ్లీలో కనిపించకుండా పోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లున్నారు. ఆయన ఉపన్యాసాలు దీనిని స్పష్టంగా వెల్లడిస్తాయి.
ఈ కార్యక్రమం పూర్తి చేసేందుకు ఆయన చంద్రబాబు బాబు పాత ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎంచుకున్నారు. పెద్దిరెడ్డి ఏకంగా కుప్పంలో మకాం వేశారు. చంద్రబాబు నాయుడికి, నియోజక వర్గానికి దూరం పెరిగితే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాగా శ్రమించి, ఓటర్లు కు బాగా దగ్గిరయ్యారని కొంతమంది చంద్రబాబు హితులు కూడా అంగీకరించారు. దానికి తోడు పెద్దిరెడ్డి ‘రెడ్డి’ ముఖ్యమంత్రుల హయాంలో కాంట్రాక్టర్ గా విజయ వంతమయ్యారు. ఆర్థికంగా బలపడ్డారు. అన్నివిధాల చంద్రబాబుతో ఢీ కొనగల సత్తా సంపాదించుకున్నారు.
పెద్దిరెడ్డిది పై చేయి ఎలా అయింది?
తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు శైలిలో మార్పు వచ్చింది. నిజానికి చంద్రబాబు బాగ డిసిప్లిన్ ఉన్ననాయకుడుని పేరు. ఈ విషయంలో ఆయనను అభిమానులే కాదు, రెడ్లు కూడా ప్రశంసిస్తారు. అధికారంతో పాటు వచ్చే సమస్యల వల్ల చంద్రబాబుకి పాత స్నేహితులంతా దూరమయ్యారు. యూనివర్శిటీలో ఆయనతో ఉండి, ఆయన కోసం దెబ్బలు తిన్న నాయకులు కూడా దూరమయ్యారు. కొత్త వాళ్లు ముఖ్యంగా వ్యాపారస్థులు ఆయన చుట్టూ చేరారని చెబుతారు. అధికారంలో వున్నంత వరకు ఇది చాలా మంచి ఆకర్షణ లాగా కనిపించింది.
2019లో అధికారం పోయాక అసలు విషయం బయటపడింది. చంద్రబాబు చుట్టూర వున్న విఐపిల ఎన్నికల యుద్ధానికి పనికిరారని తేలిపోయింది. వాళ్లను వెంటేసుకుని చంద్రబాబు ఎన్నికల్లో తలపడ్డారని అందుకే ఘోర పరాజయం ఎదురయిందని చాలా మంది విమర్శిస్తారు .
అధికారం పోయాక వైసిపి చేస్తున్న ఉధృత ప్రచారం నుంచి కార్యకర్తలను కాపాడుకోవడం కష్టమయిందని తెలుగుదేశం నేత ఒకరు చెప్పారు. కుప్పంలో ఈ మేరకు చంద్రబాబుకు ఒక నివేదిక సమర్పిస్తానని కూడా ఆయన చెప్పారు. కుప్పంలో పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున ప్రచారమే జరగలేదు. అటు వైపు వైసిపి యుద్ధానికి తలపడ్డట్లు పనిచేసింది. దీనితో టిడిపి క్యాడర్ హడలెత్తిపోయింది.
కుప్పం ఫలితాలు స్థానిక టిడిపిలో బెదురు పుట్టించాయి. చంద్రబాబు నిన్న కుప్పానికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఈ పరిణామం వల్లే.
కుప్పంలో చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి
జగన్మోహన్ రెడ్డి కుప్పం బాధ్యతను అప్పగించాక పెద్దిరెడ్డి ఎక్కువ సమయం కుప్పానికే కేటాయించారు. దానికి తోడు చిత్తూరు ఎంపి రెడ్డప్ప కూడా ఇక్కడే మకాం వేశారు. దీనితో యూనివర్శిటీ నాటి చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి గొడవ కుప్పంలో పునరావృతమయింది. అయితే, ఇపుడు ఫీల్డ్ లో చంద్రబాబు పేరు తప్ప మనిషి లేడు. ఎక్కడ చూసినా పెద్దిరెడ్డియే కనిపించారు. యూనివవర్శిటీలో వారిద్దరు ముఖాముఖి కొట్టుకున్న సందర్భాలున్నాయని చెబుతారు. ఈ గొడవల్లో పెద్దిరెడ్డికి బాగానే గాయలయ్యాయని, పెద్దగా గాయాలు కాకుండా చంద్రబాబు తప్పించుకున్నాడని నాటి ఒక విద్యార్ధి నాయకుడు చెప్పారు.
‘ఆ గొడవల్లో కత్తి పోట్లు కూడా జరిగాయి. ఒక సారి ఇరువర్గాలు భీకరంగా దాడి చేసుకున్నాయి. కత్తులు ఝళిపించుకున్నాయి. చంద్రబాబు మీద కత్తి వేటు పడబోయింది. అపుడు ఆయన మిత్రుడొకరు అడ్డుకున్నారు. కత్తి దెబ్బ ఆయనకు తగిలింది. రాజకీయాల్లోకి వచ్చాక ఆ సాయానికి గుర్తింపుగా ఆయనకు చంద్రబాబు ఒక దఫా తిరుపతి ఎమ్మెుల్యే చాన్స్ కూడా ఇచ్చారు.’ అని పేరు రాసేందుకు ఇష్టపడిన వారి మిత్రుడొకరు తెలిపారు.
ఈ రెండు ముఠాల గొడవ వల్ల యూనివర్శిటిలో హింసాత్మక సంఘటనలు తరచూ జరిగేవి. ఎపుడూ క్యాంపస్ ఉద్రిక్తంగా ఉండేది. అపుడు చంద్రబాబు మీద జరిగిన దాడుల్లో పాల్గొన్నామని చెప్పుకునే కొందరు వైఎస్ కాలంలో ప్రొఫెర్లు వైస్ చాన్స్ లర్ అయ్యారని కూడా చెబుతారు. మొత్తానికి ఎస్ వి యూనివర్శిటి కమ్మ వర్సెస్ రెడ్డి పాలిటిక్స్ కి కేంద్రంగా ఉండింది.
ఆ రోజుల్లో చంద్రబాబు వర్గాన్ని ఓడించి పెద్దిరెడ్డి యూనివర్శిటి స్టూడెంట్ బాడీ చెయిర్మన్ అయ్యారు. తర్వాత గీతా నాథ్ అనే బిసి అభ్యర్థిని పోటీ పెట్టి చంద్రబాబు పెద్దిరెడ్డిని ఓడించారు. ఇపుడు ఇద్దరు నేతల నాటి తగాదా కుప్పానికి వచ్చింది. చంద్రబాబుని ఓడించేందుకు పెద్దిరెడ్డి కదన కుతూహలంతో ఉన్నారు. సురక్షితమని చంద్రబాబు చంద్రగిరికి 250 కిమీ దూరాన ఉన్న కుప్పానికి వచ్చారు. అయితే, పెద్దిరెడ్డి ఆయన వెంటబడ్డారు. కుప్పాన్ని చంద్రబాబు కాపాడుకోగలరా?
ఈ రాజకీయ తగాదా తత్తర పాటు చంద్రబాబు ఇపుడు సాగిస్తున్న కుప్పం యాత్రలో, ఆయన ఉద్రేక ప్రసంగాలలో కనిపిస్తుంది. 2024లో ఏమవుతుందో వూహించడం కష్టం. మొత్తానికి చంద్రబాబు పరిస్థితి అంత బాగాలేదని చెప్పవచ్చు.
good analysis