(డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి)
ప్రసిద్ధ కథకులు, విమర్శకులు, భాషాభిమాని, సంపాదకులు, ఉపన్యాసకులు
అన్నింటికీ మించి తాను నమ్మిన ఆలోచన విధానం కోసం తుది శ్వాస దాకా నిబద్దతగా నిలిచిన సింగమనేని నారాయణ మరణించారు. ఆయన వయసులు 77 సంవత్సరాలు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
గొప్ప తెలుగు రచయిత,సాహిత్య విమర్శకుడు,సింగమనేని నారాయణ గారు(77) 25.2.2021 న మరణించారని తెలుపుటకు విచారిస్తున్నానని వారి కుమారుడు శ్రీకాంత్ ప్రకటన చేశారు. సాహిత్య కారుడు గానే కాకుండా ఎన్నో ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలిచిన వ్యక్తి. హంద్రీ నీవా జల సాధన సమితి జిల్లా కన్వీనర్ గా దరూరు పుల్లయ్యతో పాటు ఎన్నో సమావేశాల్లో పాల్గొన్నారు. వారికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఈ రోజు మధ్యాహ్నం నుంచి అనంతపురం రామచంద్ర నగర్ లోని వారి నివాసం వద్ద బంధు, మిత్రుల సందర్శనం కోసం ఉంచుతారు. రేపు ఉదయం 10 గంటల తర్వాత 26.2.2021 శుక్రవారం అనంత పురం నగరానికి 40.కి.మీ.దూరం లో ఉన్న కనగానీపల్లి గ్రామం వద్ద వారి తోటలో అంత్యక్రియలు నిర్వహిస్తారని శ్రీకాంత్ తెలిపారు.
ఆధునిక, ప్రగతిశీల భావాజాల వ్యాప్తికి తన రచనల ద్వారా, కార్యాచరణ ద్వారా, జీవన విధానం ద్వారా మార్గదర్శిగా నిలిచారు. ఎంతో మంది యువతరానికి తోడ్పాటు అందించారు.రాయలసీమ ప్రాంత భాష, జీవితానికి సాహిత్యం లో స్థానం కల్పించి జవజీవాలు కల్పించారు.సీమ కథలు.. పుస్తకం తన సంపాదకత్వంలో వెలువరించి, బయటి ప్రపంచానికి సీమ జీవన సంఘర్షణను చాటారు. సీమ నీళ్ళ కోసం తన వంతు పోరాటం చేశారు.
అరుదైన వ్యక్తిత్వం, ముక్కుసూటి స్వభావం, అపారమైన ప్రేమాభిమానాలు చూపే స్వచ్చమైన మనసున్న శ్రీ సింగమనేని సార్ ని కోల్పోవడం అత్యంత బాధకలిగించే విషయం.సాహిత్య లోకానికి, ప్రధానంగా సీమ సాహిత్యానికి ఇది తీరనిలోటు. వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియచేస్తున్నాం.
సింగమనేని గారి ఆశయాల సాధనకు నిలబడతాం.
సింగమనేని నారాయణ అనంతపురం పట్టణానికి దగ్గరలో వున్న బండమీద పల్లె గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జూన్ 232, 1943లో జన్మించాడురు. అనంతపురం ఉన్నత పాఠశాల లో విద్యపూర్తి చేసుకునితిరుపతిలోని ప్రాచ్యకళాశాలలో విద్వాన్ చదివారు. అనంతపురం జిల్లా గ్రామీణప్రాంతాల హైస్కూళ్లలో తెలుగు పండిట్‌గా పనిచేసి 2001లో పదవీవిరమణ చేశాడు. ఇప్పటివరకు 43కు పైగా కథలు వ్రాశాడు. మొట్టమొదటి కథ “న్యాయమెక్కడ? “1960లో కృష్ణాపత్రికలో అచ్చయ్యింది. ఈయన కథలు జూదం (1988), సింగమనేని నారాయణకథలు (1999), అనంతం (2007), సింగమనేని కథలు(2012) అనే నాలుగు కథా సంపుటాలుగా వెలువడ్డాయి. సీమకథలు, ఇనుపగజ్జెలతల్లి, తెలుగు కథలు – కథన రీతులు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి ‘తెలుగుకథ’ మొదలైన పుస్తకాల సంపాదకత్వం వహించాడు. సంభాషణ పేరుతో ఒక వ్యాస సంపుటిని కూడా వెలువరించాడు. అప్పా జోష్యల విష్ణుబొట్ల-కందాళం ఫౌండేషన్ ఈయనకు సాహిత్య సేవామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని 2013లో అందజేసింది. ఆదర్శాలు – అనుబంధాలు, అనురాగానికి హద్దులు, ఎడారి గులాబీలు అనే నవలలు వ్రాశాడు.
1997లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం , 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం పొందారు.
రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రగాడ సంతాపం
ప్రముఖ సాహితీవేత్త శ్రీ సింగమనేని నారాయణ గారి మృతికి రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రగాడ సంతాపం వ్యక్తంచేస్తున్నది.వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనో ధైర్యం కలుగచేయాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు బొజ్జా దశరథ రామి రెడ్డి
అధ్యక్షులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి ఒక ప్రకటనలో తెలిపారు.
టి లక్ష్మినారాయణ సంతాపం
ఉత్తమ కథా రచయిత, సాహితీ విమర్శకులు సింగమనేని నారాయణ(77) గారి మృతి దిగ్భ్రాంతి కలిగించింది. సింగమనేని గారు కొంత కాలంగా ఆనారోగ్యంగా ఉన్నారు. సింగమనేని గారి మరణంతో ఒక ఉత్తమ రచయితను సమాజం, ప్రత్యేకించి కరవుపీడిత రాయలసీమ ప్రాంతం కోల్పోయింది. వామపక్ష ఉద్యమం ఒక ప్రగతిశీల అభ్యుదయ రచయితను కోల్పోయింది. నేనొక శ్రేయోభిలాషిని కోల్పోయాను. సింగమనేని గారు ఎప్పుడు మాట్లాడినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. ఆయన ఆనారోగ్యంతో హైదరాబాదులో ఉన్నప్పుడు ఫోన్ చేసి మాట్లాడాను. దాంతో నాకు కొద్దిపాటి సంతృప్తి కలిగింది. సింగమనేని నారాయణ గారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నా.