ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల కోసం ప్రభుత్వం జగనన్న కానుకలోకి ఇపుడ డిక్షనరీని చేర్చారు. విద్యార్థులకు ఒక ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ అవసరాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించడం విశేషం. దేశంలో విద్యార్థులకు డిక్షనరీ ఇవ్వడం, డిక్షనరీని ఎలా చదవాలో చెప్పాలనుకోవడం బహుశా ఇదే ప్రథమం కావచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియా ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇంగ్లీష్ బోధన మెరుగుపర్చడంతో పాటు, విద్యార్థులు కూడా ఇంగ్లీష్ నేర్చుకునేందుకు వీలయిన వాతావరణ కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది.ఇందులో భాగంగానే విద్యార్థులందరికీ డిక్షనరీలు పంచాలనుకోవడం.
ఈ ఏడాది నుంచి విద్యాకానుకలో ఇంగ్లీషు–తెలుగు డిక్షనరీని చేర్చాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
మన బడి, నాడు – నేడు కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాద్ దాస్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్ ఎస్పిడి వెట్రిసెల్వి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సమావేశంలో ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ ఆవశ్యకత గురించి చెబుతూ
‘విద్యాకానుక’ కిట్లో ఈసారి తప్పనిసరిగా డిక్షనరీ ఉండాలని సీఎం ఆదేశించారు. అంతేకాదు, డిక్షనరీ ఉపయోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని క్వాలిటీ కూడా బాగుండాలని ఆయన స్పష్టంగా చెప్పారు.
టీచర్లకు కూడా డిక్షనరీ అందించండని ఆయన ఆదేశించారు.
అలాగే పాఠ్యపుస్తకాలు కూడా క్వాలిటీగా ఉండాలని, ప్రైవేటు స్కూళ్లలో ఇస్తున్న పుస్తకాల నాణ్యతతో పోటీ పడేలా ఉండాలని కూడా ముఖ్యమంత్రి చెప్పారు.
‘విద్యాకానుకలో ఏది చూసినా క్వాలిటీతో ఉండాలి. ఈ విషయంలో ఎక్కడా కూడా రాజీపడొద్దు. టీచర్లకూ డిక్షనరీలు ఇవ్వాలి. అమ్మ ఒడి కింద ఆప్షన్ తీసుకున్న విద్యార్ధులకు ఇచ్చే ల్యాప్టాప్లు క్వాలిటీ, సర్వీస్ ముఖ్యం,’ ముఖ్యమంత్రి చెప్పారు.