జగన్ పాలనపై ప్రతిపక్ష పార్టీలకున్న వ్యతిరేకత ప్రజల్లో లేకపోవడమే పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం.
(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)
రాష్ట్ర వ్యాపితంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా 70 – 80 శాతం పంచాయతీలలో అధికార పార్టీ మద్దతు దారులు విజయం సాధించారు. ప్రతిపక్ష తెలుగుదేశం 20 శాతం లోపు ఫలితాలు సాధించగా మిగిలిన పార్టీలు పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఎన్నికల కమిషన్ – ప్రభుత్వం , అధికార దుర్వినియోగం బలవంతపు ఏకగ్రీవాలు లాంటి ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో కీలకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవడం కూడా ముఖ్యం.
అధికార పార్టీకి సానుకూల అంశాలు
అధికార పార్టీ మంచి ఫలితాలను నమోదు చేసుకుంది. మొత్తం అధికార దుర్వినియోగం అన్న రీతిలో జరిగిన ప్రచారం నిరాధారమైనది. 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ విజయాన్ని సాధించింది. తెలుగుదేశం తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. నేడు జరిగిన ఎన్నికల సమయానికి అధికార పార్టీ వయస్సు 20 నెలలు అందులో 10 నెలలు కరోనా సమస్య. ఇంత స్వల్ప కాలంలో అధికార పార్టీని ఓడించాలన్న రాజకీయ వ్యతిరేకత రాలేదు అన్నది కాదనలేని సత్యం. అలాగని కీలక నిర్ణయాలు జరగ లేదా అంటే జరిగాయి. రాజధాని , ఇసుక ,మద్యం పాలసి , సంక్షేమ పథకాలు అమలు , దేవాలయాలపై దాడులు ఇలా చాలా అంశాలపై చర్చ జరుగుతోంది.
ఇసుక లభ్యతపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయినది. అదే సమయంలో సంక్షేమ పథకాల పట్ల లబ్దిదారులలో సంతృప్తి ఉంది. కరోనా సమయంలో ఈ పధకాల వలన నగదు పేదలకు నేరుగా అందడం వలన ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో పెద్ద ఉపశమనం కలిగింది. రాజధాని అంశంలో మీడియా చర్చ తప్ప ప్రజలలో పెద్ద చర్చ జరగడం లేదు.
రాజధాని అన్నది భావోద్వేగాలతో కూడిన అంశం తప్ప రోజువారి ప్రజాజీవితాన్ని ప్రభావితం చేసేది కాదు. సచివాలయం అంటే రాష్ట్ర రాజధాని కన్నా గ్రామ , వార్డు సచివాలయం ద్వారా తమ రోజు వారి సమస్యలు పరిష్కారం అవుతుంది అన్న భరోసా గ్రామ , వార్డు సచివాలయాలు , వాలంటీర్ నియామకం వల్ల వచ్చింది. మద్యం పాలసీ అమలు విషయంలో మద్యం సేవించే వారిలో అసంతృప్తి ఉన్నా ప్రజలలో సంతృప్తి ఉంది. కోర్టులు , ఎన్నికల కమిషన్ తో విభేదాలు బుద్ధిజీవులు మధ్య చేర్చే తప్ప సాదారణ ప్రజలను పెద్దగా ప్రభావితం చేయలేదు.
అదే సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం ఇంకా కొలుకోలేదు. ఈ పరిణామాలు అధికార పార్టీ భారీ విజయానికి దోహదం చేసింది.
కోలుకోని తెలుగుదేశం
20 నెలల ముందు జరిగిన సాదారణ ఎన్నికల్లో తెలుగుదేశం భారీ ఓటమిని చవిచూసింది. భారీ విజయాన్ని నమోదు చేసుకున్న వైసీపీని ఓడించి తీవ్ర ఆగ్రహన్ని చవిచూసిన తెలుగుదేశాన్ని గెలిపించాలన్న పరిస్థితులు నేడు రాష్ట్రంలో నెలకొన లేదు అన్నది నిరాకరించలేని సత్యం. తెలుగుదేశం పార్టీ అధికార పార్టీపై చేస్తున్న రాజకీయ పోరాటం రోజువారి ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అంశాలను కాకుండా మీడియా చర్చల పరిధి దాటి ఉండటం లేదు. ఓడిపోయిన నిరాశ , అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్రజాస్వామిక పద్ధతులు నేడు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. సహజంగానే ఈ పరిణామాలు అధికార పార్టీకి అదనపు బలాన్ని చేకూరుస్తున్నాయి.
ఎన్నికల నిర్వహణలో అభ్యంతరాలున్నా అన్నీ అక్రమాలు అనడం సరికాదు
ఎన్నికల్లో నిబంధనలకు భిన్నంగా కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ పేరుతో మొత్తం అక్రమంగా జరిగాయి అనడం తప్పించుకోవడానికి మాత్రమే. ఈ దపా ఏకగ్రీవాలు 2100 కు పైగా జరిగాయి. మొత్తంలో 17 శాతం లోపే.
2014 సాధారణ ఎన్నికల ముందు జరిగిన ఎన్నికల్లో 1834 ఏకగ్రీవాలు జరిగాయి. దాదాపు 14 శాతం. ఏకగ్రీవాలలో అక్రమాలును వ్యతిరేకించాలి కానీ కొన్ని ఘటనలు చూపి మొత్తం అక్రమం అని మాట్లాడం రాజకీయా విమర్శగా ఉంటుంది.
స్థూలంగా వైసిపి ఘనవిజయం సాధించినది. అధికార పార్టీకి అన్నివిధాల సానుకూల పరిస్థితులు ఉన్నా ఏకగ్రీవాలపట్ల మోజు , నిబంధనలకు భిన్నంగా వ్యవహరించిన తీరు , ముక్యంగా స్థానిక నేతల దుందుడుకు వ్యవహారాలు అధికార పార్టీపై విమర్శలకు ఆస్కారం కల్పించింది.
ఏది ఏమైనా వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి 20 నెలలు కావడం , విపక్ష తెలుగుదేశం కోలుకోలేని పరిస్థితుల్లో ఉండటం. సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు అందుబాటులో ఉండటం. కొన్ని అంశాల్లో వ్యతిరేకత ఉన్నా అవి వైసీపీని ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే పరిస్థితులు నెలకొనలేని వాతావరణంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఘనవిజయం సాధించిండము సహజపరిణామమే. ఈ వాస్తవాన్ని ప్రతిపక్ష పార్టీ గుర్తించాలి. ఎన్నికల కమిషన్ విఫలం , అధికార పార్టీపై రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం అయితే అది కాలం గడవడానికి తప్ప ప్రయోజనం శూన్యం.
(మాకిరెడ్డి రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్)