(ఇఫ్టూ ప్రసాద్ పిపి)
ఢిల్లీ రైతాంగ ప్రతిఘటన నానాటికీ కొత్త పుంతలు తొక్కుతోంది. హైవేలపై ముట్టడి వంటి సందర్భాల్ని సహజంగా రాజ్యం తేలిగ్గా తీసుకోదు. ప్రదర్శకుల పట్ల సీరియస్ గా స్పందిస్తుంది. తీవ్ర అణచివేతతో వారిని చెదరగొడుతుంది. ఒకవేళ వ్యూహాత్మక దృష్టితో అరుదుగా రాజ్యం వారిని వారిమానాన వదిలివేసిందని అనుకుందాం.
ప్రదర్శకులు ఎక్కువకాలం నిలబడలేరు. ఆలస్యమయ్యే కొద్దీ, అవి క్రమంగా నీరుగారిపోతాయి. అట్టి పోరాట రూపాలు సహజ మరణం చెందేస్థితి కూడా తలెత్తుతుంది. ఈ సహజ ప్రక్రియకు భిన్నంగా నిత్య నూతనంగా, నిరంతర వృద్ధి క్రమంతో తాజా ఢిల్లీ రైతాంగ ప్రతిఘటన నేడు పురోగమిస్తోంది. దీనికి అండగా దేశంలోని విభిన్న రాష్ట్రాలు, ప్రాంతాల నుండే కాకుండా, దేశదేశాల నుండి కూడా ప్రగాఢ సంఘీభావం వెల్లువెత్తుతోంది. అందులో భాగంగా కొత్తపుంతలో తలపెట్టిన ఓ సంఘీభావ యాత్ర గూర్చి ఓ మాట…
తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ల నుండి ఇప్పటికే ఎన్నో బృందాలు సంఘీభావంగా ఢిల్లీ వెళ్లి వచ్చాయి. ఇంకా వెళ్తున్నాయి. అవి నిత్య నూతన ఉత్తేజం, ఉద్యమ స్ఫూర్తి పొందుతున్నాయ్. ఐతే ఇలా ఒక్కొక్క రాష్ట్రం, ఒక్కొక్క ప్రాంతం, ఒక్కొక్క పార్టీ, సంస్థ, సంఘం నుండి కాకుండా ఏకంగా దక్షిణ భారత దేశం నుండి ఓ పెద్ద సంఘీభావ బృందం ఇప్పుడు ఢిల్లీకి కదిలి వెళ్తబోతోంది. పోరాడే ఢిల్లీ రైతాంగానికి దక్షిణ భారత్ ప్రజల పక్షాన సంఘీభావం తెలపడానికే కాకుండా, అక్కడ నుండి దక్షిణ భారతదేశ ప్రజలకి పంచిపెట్టాల్సిన ఉద్యమ స్పూర్తిని ఢిల్లీ నుండి మూటగట్టుకొని, తేవడానికి కూడా అది వెళ్తోంది. అదీ దీని ప్రత్యేకత!
కర్ణాటక మిత్రుల చొరవతో 8-2-2021న బెంగుళూరు లో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వివిధ సంస్థల సమావేశం జరిగింది. అది ఉమ్మడిగా తీసుకున్న ఓ నిర్ణయం ప్రకారం ఈ పెద్ద సంఘీభావ యాత్ర జరగ బోతోంది.
కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వివిధ సంస్థల ప్రతినిధులతో ఈ బృందం ఉంటుంది. ఇది 23-2-2021 నుండి 27-2-2021వరకూ ఢిల్లీ పరిసరాలలో వివిధ రైతాంగ ప్రతిఘటనగా ప్రాంతాల్ని సందర్శిస్తుంది. ఈ బృందం లో మొత్తం వందమంది పైగా భాగస్వాములవుతారు.
(IFTU) జిల్లా అధ్యక్షులు, బి ,సురేష్, యేసు రత్నం,చిన్నా, శ్రీరాములు
ప్రాధమిక సమాచారం ప్రకారం తెలంగాణ, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాల నుండి వివిధ ప్రజా సంఘాలకు చెందిన యాబై మందికి పైగా ఢిల్లీ వెళ్లనున్నారు. వీరిలో రైతు, కూలి, కార్మిక, మహిళా, విద్యార్థి, యువజన, సాంస్కృతిక రంగాలలో పని చేసే ఉద్యమకారులు, కార్యకర్తలు, ఆర్గనైజర్లు వుంటారు. వీరి సంఘీభావ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం.