హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ ఊపందుకుంది. కోవిడ్ వల్ల పడిపోయిన ఈ రంగం మళ్లీ 2020 మార్చ్ నెలకి ముందున్న స్థాయికి చేరుకుంటున్నది. దీనికి సాక్ష్యం హైదరాబాద్ లో నమోదయిన భూములు ధరయే.
ఈ మధ్య జూబ్లీ హిల్స్ లో ఒక ప్లాట్ అత్యధిక ధరకు అమ్ముడు పోయి రికార్డు సృష్టించింది. 1837 చదరపుఅడుగుల స్థలం రు41.39 కోట్లకు అమ్ముడు పోయింది.దీనిని కొనుగోలు చేసిన వ్యక్తి ఒక ఫార్మా కంపెనీ యజమాని. ఈ వ్యక్తి ప్రభుత్వానికి రు. 2.27 కోట్ల స్టాంపు డ్యూటీ చెల్లించాడు. రు. 20లక్షలను రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాడు. ఈ రిజిస్ట్రేషన్ జనవరి 28న జరిగింది. ఇటీవల జరిగిన భూముల క్రయవిక్రయాలలో ఇదే రికార్డు. జూబ్లీహిల్స్ ప్రాంతంల చదరపు అడుగు ధర రు. 1.50 లక్షల నుంచి రు. 2 లక్షల దాకా పలకడం విశేషం కాదు. అయితే, ఈ ట్రాన్సాక్షన్ లో ధరకు రెక్కలొచ్చాయి. ఏకంగా చదరపు అడుగు ధర రు.2.20లక్షలకు చేరింది.
దీనితో ప్రభుత్వం ఈ రియల్ బూమ్ ని సొమ్ము చేసుకోవాలనుకుంటున్నది. నగరంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను విక్రయించి రు. 15 వేల కోట్లను సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం పథకం వేస్తున్నది. రెండేళ్లుగా ప్రభుత్వం ఈ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తూ ఉంది. అయితే, ఆర్థిక వాతావరణ బాగా లేకపోవడం వల్ల 2019లో ఈ ప్రయత్నం విజయవంతం కాలేదు. ఇదే విధంగా 2020లో కూడా కరోనా పాండెమిక్ వల్ల భూముల విక్రయం సాగలేదు. ఇపుడు జూబ్లీ హిల్స్ ధర చూశాక ప్రభుత్వంలో ఆశలు చిగురించాయి. రికార్డు స్థాయిలో అమ్ముడు పోకపోయినా కనీసం ఒక పదివేల కోట్ల దాకా సమీకరించవచ్చని అధికారులు ఆశిస్తున్నారు.భూముల అమ్మకం ద్వారా రు. 10 వేల కోట్ల సమీకరించాలని బడ్జెట్ లో లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఇది సాధ్యం కాలేదు.
గత రెండుమూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు విపరీతంగా సాగుతున్నాయి. అందువల్ల ఆ లక్ష్యం ఈ సారి నెరవేరుతుందని అధికారులు ఆశిస్తున్నారు.