ప్రజాస్వామ్యంలో ఒక కొత్త పార్టీ ఆవిర్భావం ఆహ్వానించదగ్గ పరిణామం. కొత్త పార్టీ అంటే ఒక కొత్త ఆలోచన విధానం. అందువల్ల ఒక నాటి ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల తెలంగాణలో పార్టీపెట్టాలను కోవడం హర్షణీయమే. అయితే, ఒక పార్టీ పుట్టినపుడు రకరకాల ప్రశ్నలూ తలెత్తుతాయి. రకరకాల తలనొప్పులు ఎదురవుతాయి, కొందరికి మోదం, కొందరికి ఖేదం తప్పదు. వాటిని ఎలా అధిగమిస్తారనే దానిపై పార్టీ భవితవ్యం ఉంటుంది.
కెసిఆర్ బంగారు తెలంగాాణ లో షర్మిల రాజన్న రాజ్యం స్థాపిస్తానంటున్నారు. బంగారు తెలంగాణకు ముట్టుకుంటే చాలు అన్ని వైపులా నుంచి దాడి చేసే తెలంగాణలో రాజన్న రాజ్యం ఎలా ఉంటుందో ఏమిటో ఆమె ఇంకా తెలంగాణ పరిభాషలో వివరించలేదు. కాబట్టి కొన్ని సమస్యలు తక్షణం ఎదురయి ఇబ్బంది పెట్టకుండా వాయిదా వేసుకున్నారు. షర్మిల పార్టీ పెడితే ఎవరికి ఎలాంటి తలనొప్పులొస్తాయో క్లుప్తంగా చూద్దాం:
అటువైపు ఆంధ్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘రాజన్న రాజ్యం’ స్థాపిస్తున్నారు. తెలంగాణలో కూడా రాజన్నస్థాపించాలన్న ఆలోచనను మంచికో చెడుకో జగన్మోహన్ రెడ్డి విరమించుకున్నారు. తెలంగాణలో పార్టీ పేరే వినిపించుకుండా జాగ్రత్త తీసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి అభిమానులంతా టిఆర్ఎస్ వైపు వెళ్లిపోయేందుకు అలా దోహదపడ్డారు. మిగిలిన వాళ్లు కాంగ్రెస్ లోనే ఉండటమే, బిజెపివైపుచూస్తుండటమో చేస్తున్నారు.
జగన్ నిర్ణయంతో తెలంతాణాలో వైఎస్ ఆర్ విగ్రహాలు మట్టిగొట్టుకు పోయాయి. వాటిని కూలిపోతున్నా, ఎండకు ఎండి రాలిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కెసిఆర్ తెలంగాణలో వీటిని కాపాడుకునే సాహసం కూడా ఎవరూ సాహసం చేయని పరిస్థితి. (ఇపుడు పరిస్థితి మారుతుందేమో చూడాలి.)
తెలంగాణ ఉద్యమం సాగే రోజుల్లో, తెలంగాణ వచ్చిన కొత్తలో ఆంధ్రా పార్టీలకు తెలంగాణలో పనేమిటని టిఆర్ ఎస్ నేతలు ప్రశ్నించారు. ఒక సారి రైల్లో వెళ్తున్న జగన్ మీద రాళ్ల వర్షం కురిపించారు. ఇది గతం.
ఆ తర్వాత జనసేన నేత పవన్ కల్యాణ్ కూడా తెలంగాణలో కాలుమోసేందుకు జంకుతూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కొనవూపిరితో ఉంది. ఇలాంటపుడు రాజశేఖర్ రెడ్డి కూతరు షర్మిళ తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానంటున్నారు. బంగారు తెలంగాణ నిగనిగ లాడుతున్నపుడు రాజన్న రాజ్యం ఏర్పాటుచేసేందుకు జాగా ఉందా?
నిజానికి ఆ ప్రకటన చేసేదాకా పరిస్థితి రావడమే ఆశ్చర్యం. అలాంటి వాతావరణం నెలకొన్న రాష్టం ఇది. అయినా, మొదటి మెట్టు అడ్డంకి దాటి షర్మిళ రాజన్న రాజ్యం ప్రకటన చేశారు. ఇంకా ఆమె మీద ఎలాంటి ఎదరుదాడి జరగలేదు. జరిగేలా లేదు.
ఎదురు దాటి జరిపేందుకుపై నుంచి టిఆర్ ఎస్ సైన్యానికి ఉత్తర్వులొచ్చినట్లు లేవు. ఇలా ఎందుకు జరుగుతూ ఉంది అనే అనుమానం రాజకీయ పండితులను, పామరులను పీడిస్తూ ఉంది.
అందుకే షర్మిళ వెనక ఉన్న శక్తి ఎవరు? షర్మిళ ఎవరు వదలిన బాణం అనే చర్చ మొదలయింది. ఇది చాలా కాలం సాగుతుంది. ఆసక్తి గా కూడా వుండవచ్చు. ఈ మధ్య లో షర్మిళ లక్ష్యం తెలంగాణ రాజన్న రాజ్యం ఏమిటో క్లియర్ గా వివరిస్తే కొంత మందికి తలనొప్పిగా మారవచ్చు.
1.రాజన్న రాజ్యంలో రాయలసీమకు ఎక్కువ ప్రాముఖ్యం ఉండేదని ఒక విమర్శ ఉంది. రాయలసీమలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపడుతున్న ప్రాజక్టుల వల్ల తెలంగాణకు నష్టమని ఆ రోజుల్లో హైదరాబాద్ బ్రదర్స్ (మర్రిశశిధర్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి) అసెంబ్లీలో , అసెంబ్లీ బయట ఆందోళన చేసేవారు. ఈ ఆందోళన ఇపుడూ కొద్దిగా కొనసాగుతూ ఉంది. పోతిరెడ్డి పాడు రాయలసీమ లిఫ్ట్ కు తెలంగాణ వ్యతిరేకత చూపడం ఇందులో భాగమే. తెలంగాణ ప్రభుత్వం వీటికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేసింది.కేంద్రానికి లేఖలు రాసింది. దీని మీద షర్మిళ తన వైఖరి చెప్పాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాయలసీమ అనుకూల ధోరణిని తాను వ్యతిరేకించి జై తెలంగాణ అంటారా? ఇది రాయలసీమ నేతలకు తలనొప్పి తెచ్చే కోణం.
2. బంగారు తెలంగాణ బాగా లేదు, రాజన్న రాజ్యమే బాగుంటుందని షర్మిళ బంగారు వ్యతిరేకత విధానం తీసుకుంటారా? కెసిఆర్ సైన్యం వూరుకుంటుందా? ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాక, ఇంకా ఈ రాజన్న రాజ్యం గొడవేమిటని, తెలంగాణ పునర్నిర్మాణం అంటున్న ప్రొఫెసర్ కోదండ రామ్, డాక్టర్ చెరకు సుధాకర్ తదితర నేతలు ప్రశ్నిస్తారా? ఈ ‘తెలంగాణ వాదం’ షర్మిళకు తలనొప్పి.
3. కేసులో, వ్యక్తి గత కారణాలో, ప్రయోజనాలో, ఏదైతే ఏముంది తెలంగాణాలో ఆంధ్రా లీడర్లనుంచి ఎలాంటి తలనొప్పి లేకుండా కెసిఆర్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక మిగిలింది ఆంధ్రా కాంట్రాక్టర్లు. అదెపుడూ తెలంగాణ రాష్ట్రం లోసమస్య కాలేదు. ఇలా తప్పిపోయందనుకున్న తలనొప్పి, యాత్రలు తప్ప రాజకీయాలు తెలియని షర్మిళ వల్ల మళ్లీ మొదలవుతుందా? తెలంగాణలో చప్పట్లు ఈలలు డ్యాన్సులు చూసి షర్మిళ ఏ సమయంలో ఏ ప్రకటన చేస్తారో, ఏ సమస్య వస్తుందో? ఇది రూలింగ్ పార్టీకి తలనొప్పి.
4. షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం తెచ్చేందుకు పార్టీ పెట్టి, తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకని చెప్పి తీసుకునే పొలిటికల్ లైన్ తెలంగాణలో టిడిపి పునరుద్ధరణకు దారి తీస్తే చాలా మందికి తలనొప్పి వస్తుంది. పనిలో పనిగా జనసేన కూడా ముందుకు రావచ్చు. ఒక ఆంధ్ర పార్టీని అనుమతిస్తే, రెండో ఆంధ్ర పార్టీ కి తలుపుతెరుచుకుంటాయి.మళ్లీ ఆంధ్రపెత్తనమా అని వాళ్లు తయారవవచ్చు.ఇదొక తల నొప్పి.
5. షర్మిలమ్మ కు వ్యతిరేకంగా టిఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు క్రమంగా తగ్గిపోతున్నాయి. కారణం ఆమె పార్టీ పెట్టి కాంగ్రెస్ , బిజెపిలను బలహీనపరుస్తారని, అది కెసిఆర్ కు మేలు చేస్తుందని, టిఆర్ ఎస్ సోషల్ సైన్యానికి పైనుంచి సూచనలొచ్చాయా? కెసిఆర్ కు లాభం చేకూర్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రోద్భలంతోనే షర్మిలమ్మ పార్టీ పెడుతున్నారని అని కొంతమంది చేస్తున్న వాదనకు ఇది బలం చేకూరుస్తుంది. ఇది బిజెపి, కాంగ్రెస్ లకు తలనొప్పి.
6. షర్మిలమ్మ పార్టీ క్లిక్ కాక తెలంగాణలో మరొక ప్రజారాజ్యం, జనసేనో అయిపోతే, వైఎస్ ఆర్ అభిమానులకు తలనొప్పి.
7. తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేకతతో సీమ ప్రజల చిరకాల డిమాండ్లయిన సిద్దేశ్వరం అలుగు గుండ్రేవుల రిజర్వాయర్, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. వీటి మీద తనవైఖరి చెప్పకుండా చెప్పే షర్మిల తప్పించుకోవడం సాధ్యం కాదు. వైఎస్ ఆర్ ఉంటే ఈ ప్రాజక్టులు కార్యరూపం దాల్చేవని రాయలసీమ నేతలు భావిస్తున్నారు. వీటి మీద షర్మిల వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే రాయలసీమ వైఎస్ అభిమాలనులకు తలనొప్పి. వీటిని సమర్థిస్తే తెలంగాణ నేతలకు తలనొప్పి.
తెలంగాణ లో పార్టీ పెట్టి సమైక్య వాదంతో సాగిన వైఎస్ ఆర్ అజండా తో ముందుకు సాగడం షర్మిల కు సాధ్యమా?