‘విశాఖ ఉక్కు ఉద్యమం, ఢిల్లీ రైతు ఉద్యమంలో భాగం కావాలి’

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

విశాఖ ఉక్కుకర్మాగారం ₹2 లక్షల నుండి ₹3 లక్షల కోట్ల విలువ గలది. అది ప్రజల ఆస్తి. వేలాది ఎకరాల విలువైన భూముల కబ్జా వ్యవహారమది. గుమ్మడి కాయంత విలువను ఆవ గింజ ధర కట్టి అమ్ముకునే దుర్మార్గం.కడుపు తరుక్కుపోతుంది. అది మనకి అతిపెద్ద కుంభకోణమే.

కానీ నేటి రైతాంగ ప్రతిఘటన ఏ కుంభకోణంపై నేడు యుద్ధం చేస్తుందో దాని విలువతో పోల్చితే, ఉక్కు కుంభకోణం చిన్నదే. వ్యవసాయ చట్టాల ద్వారా ఏటా ₹అరవై లక్షలకోట్ల విలువచెసే ఉత్పత్తుల్ని బడా కార్పొరేట్ శక్తులు కబ్జా చేస్తాయి. ఆ లాభం ప్రతిఏటా కార్పొరేట్లు జుర్రుకునేది.

ఒకేసారి అమ్మకం (one time settlement) తో విలువ కట్టబడే విశాఖ ఉక్కు ధర ₹మూడు లక్షల కోట్లు అనుకుందాం. ప్రతిఏటా కల్పవృక్షం వలె లాభాల్ని పండించే, ఒకే ఏడాది మార్కెట్ విలువ ₹60 లక్షల కోట్లలో ఈ ఉక్కు విలువ 5శాతమే. అది ₹2లక్షల కోట్లయితే 3 శాతమే. వ్యవసాయ మార్కెట్ విలువ ప్రతిఏటా రావడంతో పాటు, క్రమంగా విలువ పెరుగుతూ పోవడం కూడా గమనార్హం.

శత్రువు విసిరే ఆయుధాల్ని వడుపుగా పట్టుకొని, తిరిగి అదే శత్రువుపై విసరడం ఓ రాజకీయ కళ. విశాఖ ఉక్కు ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తులకు అట్టి రాజకీయ కళ అవసరం. ఏ ఫాసిస్టు శక్తులు మన దేశ వ్యవసాయ రంగాన్ని కబ్జా చేయడానికి పధకం వేశాయో, అవే శక్తులు విశాఖ ఉక్కు కబ్జా కోసం కన్ను వేసాయి. ఉత్తరాది గంగా, యమునాలు ఎందుకు పరవళ్లు తొక్కుతున్నాయో, ఇక్కడ కృష్ణా గోదావరులను కూడా అందుకోసమే ఉరకలు వేయించాలి.

అక్కడ రైతాంగ ఉద్యమం ఎలా మోడీ ప్రభుత్వ పీఠంపై తిరగబడుతున్నదో, ఇక్కడ ప్రజాదరణతో సాగే ఉక్కు కార్మికోద్యమం కూడా అదే శత్రువుపై ఎక్కుపెట్టి సాగాలి. వాస్తవ శత్రువుని విడిచి పెట్టి, జగన్, బాబు మధ్య పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటూ కొనసాగే రాంగ్ రూట్ లోకి దారి మళ్ళకుండా సరైన గురితో నడిపించాల్సి ఉంది. నేడు గంగ, గోదావరి మధ్య ఐక్యత అంటే కార్మిక, కర్షక, కూలీల మైత్రీ ఉద్యమం. సారంలో శ్రామికోద్యమం. అది అన్ని వర్గాల ప్రజల మద్దతుతో కొనసాగించాల్సిన ఉద్యమం.

ఆఖరి మాట. ఉదాహరణకు నేడు విశాఖ గెలిచింది. కానీ ఆంధ్ర రాష్ట్ర అండలేక ఢిల్లీ రైతు ప్రతిఘటన ఓటమి పొందిందని అనుకుందాం. ఓ మహత్తర రైతు పోరాటాన్ని అణిచిన విజయోన్మాదంతో రేపు రాజ్యం తిరిగి విశాఖ ఉక్కును కబ్జా చేయగలదు. నేడు ఉక్కుపై గెలిచిన ఆనందం ఎంతో కాలం మిగలదు. అది గాలి బుడగ విజయంగానే మిగిలి పోతుంది. దీన్ని తిరగేసి కింద చూద్దాం.

విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం జగన్, బాబు రచ్చ వల్ల గురి తప్పి గానీ లేదా మరో విధంగా గురితప్పి గానీ ఒకవేళ ఓటమి పొందిందనుకుందాం. ఆంధ్ర రాష్ట్ర అండ లేకుండా కూడా, కొన్ని అదనపు కఠోర త్యాగాలు చేసి ఢిల్లీ రైతాంగ ప్రతిఘటన రేపు విజయం సాధించిందని అనుకుందాం.

నేడు ఓడిన విశాఖ ఉద్యమం కూడా తిరిగి ఢిల్లీ రైతాంగ విజయ స్ఫూర్తితో మున్ముందు మళ్లీ పునరుజ్జీవం పొంది తలెత్తి నిలబడగలదు. అంతే కాక, అది 29 కార్మిక చట్టాల పునరుద్ధరణ డిమాండ్ తో కార్మికోద్యమానికి కూడా రేపు దారిదీపంగా మారవచ్చు.

పై గతితార్కిక రాజకీయ నియమం పట్ల సూత్రబద్ద అవగాహనతో విశాఖ ఉక్కు ఉద్యమానికి దిశా నిర్దేశం చేసుకోవడం నేటి కర్తవ్యం. గంగా, గోదావరుల ప్రవాహాలు వేటికి అవే పొంతన లేనివిగా సాగరాదు. ఉత్తరాది, దక్షిణాది దారులు ఎవరివి వారివే కారాదు. కార్మిక, కర్షక వర్గాల మైత్రిబంధంతో ఒకే దిశలో ఉద్యమాలు సాగాలి. దారి మళ్లించే వారితో ఐక్యత పేరిట ఉక్కు పరిరక్షణ ఉద్యమ దిశని మార్చరాదు.

ఢిల్లీ పీఠంపైకి గురి పెట్టి సాగే సుస్పష్ట ఉద్యమ గమన మార్గం నుండి వైదొలగ రాదు. అలాదారి మళ్లించే కొన్ని తుంటరి రాజకీయ శక్తుల్ని ఒంటరి చేయాల్సి రావచ్చు. వాటిని వదులుకునే పరిస్థితి కూడా రావచ్చు. వాపు, బలుపు ఒకటి కావని గుర్తుంచుకోవాలి. ఢిల్లీ పీఠంపై గురిపెట్టనివ్వని లక్ష్యంతో ఉద్దేశ్యపూర్వక బుద్ధి తో పనిచేసే కొన్ని తుంటరి శక్తుల్ని వదులుకోవడానికి సిద్ధపడాలి. దిశానిర్దేశం లేని దారి తప్పిన మార్గంలో సూడో శత్రువుపై సాగే తెగ బలిసిన ఉద్యమంకంటే, వాస్తవ శత్రువు ని లక్ష్యంగా ఎంచుకొని సాగే ఉద్యమం కొంత బలహీనపడ్డా సిద్ధపడాలి. ఈ అవగాహనను విడిచిపెట్టి “సర్వం మనమే” అనే గురి తప్పిన విశృంఖల ఐక్యత అంతిమంగా వాస్తవ శత్రువుకే లాభిస్తుంది.

ఇప్పుడు వాస్తవ శత్రువు బడాకార్పొరేట్ వ్యవస్థే. దానికి పెద్ద పాలేరుగా సేవ చేసే మోడీ షా ప్రభుత్వమే! వాటిని ఓడించాలంటే, కృష్ణా, గోదావరిల్ని ప్రవహింపజేసి, ఉరకలు వేయిస్తే సరిపోదు, వాటిని గంగా, యమునలతో అనుసంధానం చేయించే పనిని కూడా చేపట్టాలి. అదే విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమ తక్షణ లక్ష్యం కావాలి..

https://trendingtelugunews.com/top-stories/breaking/vizag-steel-privatisation-ycp-active-role-vijayasai-reddy-double-game/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *