పార్టీల డెమోక్రసీ కొద్ది సేపు రద్దు చేసి కులాల డెమోక్రసీ అని ప్రకటించి అసెంబ్లీలో బల నిరూపణ పెడితే, తెలంగాణలో రెడ్ల ప్రభుత్వం వస్తుంది. ఇపుడే కాదు, 1983 నుంచి కూడా అసెంబ్లీల సింగిల్ లార్జెస్ట్ గ్రూప్ (Single largest group)రెడ్లే అవుతారు. స్వాతంత్య్రం వచ్చాక తెలుగు భూభాగంలో రెడ్లే చాలా కాలంలో రాజ్యపాలన చేశారు. రాయలసీమ రెడ్డు, తెలంగాణ రెడ్లు కలిసే సరికి వారు పెద్ద ఫోర్స్ అయిపోయి,ఉమ్మడి ఆంధ్రలో ఎక్కువ కాలం ప్రభుత్వం ఏర్పాటుచేశారు. తెలుగుదేశం వచ్చాకే వాళ్లు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. అయితే, ప్రత్యేక తెలంగాణ వచ్చాక తెలంగాణ ప్రాంతంలో రెడ్లు అధికారం కోల్పోయారు. ప్రతిపక్ష హోదా కోల్పోయారు. 2019 తర్వాత ఆంధ్రలో అధికారం దక్కించుకున్కా, తెలంగాణలో వాళ్లు పవర్ కోల్పోపోయారు.ఇది ఇర్రెవర్సిబుల్ (తిరుగురాని పయనం) లాగా కనిపిస్తూ ఉంది. అందుకే చాలా మందిలో ఆందోళన ఉంది.
ఉమ్మడి ఆంధ్రలో గతంలో వాళ్లు పవర్ కోల్పోయినా వాళ్లకంటూ ఒక పార్టీ ఉంటూ వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ. ఇపుడు కాంగ్రెస్ పోయాక ఆంధ్రలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ వాళ్ల సొంతపార్టీ అయింది. అయితే, తెలంగాణలోనే వీళ్లకొక పార్టీ అంటూ లేకుండా పోయింది. వాళ్లదనుకున్న కాంగ్రెస్ పార్టీ బాగా బలహీన పడింది. బిజెపి వాళ్ల దెపుడూ కాలేదు. టిఆర్ ఎస్ వెలమ నేత నాయకత్వంలో ఉంది. అందులో ఎప్పటికీ మార్పు రాదు.
పార్టీ లేకపోవడం, అధికారం కోల్పోవడం తెలంగాణ రెడ్డి కులనేతలను చాలా కాలంగా బాగా కలచి వేస్తున్నది. ఎందుకంటే, బాగా పలుకుబడి, పాలనాదక్షులు ఉన్న కులం వారిది.అయినా పవర్ కోల్పోయారు.
2015 మార్చిలో ఒక సారి రెండు తెలుగు రాష్ట్రాల రెడ్డి నేతలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో పరిస్థితి సమీక్షించుకునేందుకు సమావేశమయ్యారు. అపుడు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆంధ్రలో కమ్మ పార్టీగా ముద్రపడిన తెలుగు దేశం పార్టీ అధికారంలో వుంది. తెలంగాణలో వెలమ పార్టీ అయిన టిఆర్ ఎస్ రాజ్యమేలుతూ ఉంది. ఇది రెడ్డి ప్రముఖలను, ముఖ్యంగా రెడ్డియూత్ ని బాగా ఇరుకున పెట్టింది. దీనితో రెడ్ల అలాయ్ భలాయ్ అని రవీంద్ర భారతిలో ఈ దుకాణం పెట్టారు. విజయవంతమయింది. ఆతర్వాత రెడ్డి యువకులు కూడా ఒకటి రెండు సమావేశాలు పెట్టి ఆవేదన వెలిబుచ్చారు.
అయితే, 2019 తర్వాత పరిస్థితి ఆంధ్రలో అనుకూలంగా మారింది. తెలంగాణలో రెడ్డు ఇప్పట్లో అధికారంలోకి వచ్చేలా లేరు. టిఆర్ ఎస్ లో అడ్జస్టు కావలసి వస్తున్నది. లేదంటే బిజెపిలో . అక్కడ అడ్జస్టు కావలసిందే తప్ప పగ్గాలు చేతికి రావు. టిఆర్ ఎస్ ఎప్పటికీ గత కాంగ్రెస్ లాగా వాళ్ల సొంత పార్టీ కాలేదు. బిజెపి అదోరకం పార్టీ. ఈ అసహనం రకరకాల రూపాల్లో వ్యక్తమవుతూ ఉంది.
మొన్న షర్మిల ‘తెలంగాణ రాజన్న రాజ్యం’ ప్రకటనతో ‘మళ్లీ మనకంటూ ఒక పార్టీ వస్తాంది’ అనే రిలీఫ్ చాలా మంది నేతలు ‘ఆఫ్ ది రికార్డు’ వ్యక్తం చేస్తున్నారు. షర్మిలా పార్టీ ఎటు పోతుంది, ఎవరి కోసం వచ్చింది, ఎవరికోసం పనిచేస్తుంది, ఎవరు ఆశీర్వదిస్తున్నారనేవి ఇప్పట్లో తెలేవిషయాలు కాదు గాని, ఆమె ప్రకటనలో ఈ సామాజిక వర్గంలో యువకుల్లో నూతనోత్సాహం తీసుకు వచ్చింది. వెంటనే పోలోమని షర్మిలపెట్టే పార్టీలోకి రెడ్లంతా దూకకపోయినా, వాళ్లు చాలా జాగ్రత్తగా గ్రాఫ్ ని గమనిస్తూ ఉంటారు.
ఆధునిక ఆంధ్ర రాజకీయ చదరంగంలో ఈ కమ్యూనిటీని మించిన రాజకీయాను భవం అనుభవం మరొక కమ్యూనిటీకి లేదు. ఉద్యమాలను నడిపారు, అడ్డుకున్నారు. రాజకీయాల మీద వాళ్ల గ్రిప్పు అలాంటిది.
రాజకీయాలను తమవైపు తిప్పుకోవడంలో వాళ్లు చాలా నేర్పరులు. మద్రాసు ప్రెశిడెన్సీలో ప్రొవిన్సియల్ పాలిటిక్స్ మొదలైనప్పటినుంచి కూడా ఈ వర్గం చక్రం తిప్పుతూనే ఉంది. తత్కాలికంగా ఎవరితోనై కలుస్తారు, విడిపోతారు, నిటారుగా లేచి నిలబడతారు. ఈ కారణంతోనే తెలంగాణలో మళ్లీ బలపడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
సరే మళ్లీ అసెంబ్లీ విషయానికి వద్దాం. తెలంగాణ అసెంబ్లీలో కులాల వారిగా ప్రభుత్వం ఏర్పాటు చేయండి అంటే సింగిల్ లార్జెస్టు గ్రూపు రెడ్లే అవుతారు. గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కలసి 40 మంది రెడ్లు ఉన్నారు. ఇది 2014 (42) కంటే రెండు తక్కువే అయినా, లీడింగ్ గ్రూప్ వాళ్లే. 1983లో 34 మంది రెడ్లు ఉంటే, 1985లో ఎన్టీ ఆర్ హవాలో కూడా 35మంది రెడ్లుండే వారు. 1989లో మళ్లీ 40 మంది అయ్యారు.2004 రాజశేఖర్ రెడ్డి కాలం ఈ కమ్యూనిటీకి స్వర్ణయుగం. అపుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో రెడ్ల సంఖ్య 44 కు చేరింది. 2009లో ఇది 40 అయింది.రెడ్ల ప్రాముఖ్యం తెలుసు కాబట్టి కెసిఆర్ సామరస్యంతో పోతున్నారు.
కమ్మవాళ్లు చాలా మైనారిటి. వాళ్ల రికార్డు స్థాయి బలగం 8 మంది (1985). 2018 ఎన్నికల తర్వాత తెలంగాణ హౌస్ లో వారి సంఖ్య 5. తెలంగాణ రూలింగ్ క్యాస్ట్ వెలమ ల బలగం కొంచెం అటు ఇటుగా స్థిరంగా ఉంటున్నది. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వెలమల సంఖ్య పెరగలేదు. తగ్గింది. ఉదాహరణకు 1985లో 11 మంది వెలమ ఎమ్మెల్యేలు ఉండేవారు. 1989లో వారు 14 అయ్యారు. 1994,1999లో వారి సంఖ్య 12కు పడిపోయింది. 2005లో 9 అయింది.2009,2014,2010లో 10 మంది ఉన్నారు.
ఇతర కులాలకు సంబంధించి బిసిలు 22 మంది, ఎస్ సిలు 19 మంది, ఎస్ టిలు 12 మంది, ముస్లింలు 8 మంది ఉన్నారు. ఇపుడు బ్రాహ్మణలు ఇద్దరున్నారు. వైశ్యఎమ్మెల్యే ఒకరున్నారు. ఇపుడు చెప్పండి. పార్టీ స్వామ్యం కాదు, కులాల డెమోక్రసీ అంటే తెలంగాణలో ఎవరి ప్రభుత్వం వస్తుంది?
(రెడ్డి అనేది కులం పేరు కాదు. రాయలసీమ, తెలంగాణలో రెడ్ల కులం పేరు కాపు. అయితే, కోస్తా కాపులు ఈ మధ్య రాజకీయాల్లో బలపడటం, చిరంజీవి పార్టీ పెట్టడంతో కాపు అనే మాట బాగా ప్రచారంలోకి వచ్చింది.దీనితో గందరగోళం ఏర్పడింది. అప్పటి నుంచి మీడియాలో కాపులను రెడ్లను వేర్వేరుగా చూపడానికి ‘రెడ్లు’ అని వాడుతున్నారు.)