యువతరం, మహిళలు మెచ్చితే చేనేత కు స్వర్ణయుగం

చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్  సంస్థ అయిన ఆప్కో (APCO) ను కాపాడుకుంటేనే చేనేత మనుగడ సాగించ గలుగుతుందని, దీని కోసం ప్రతిఒక్కరు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు అన్నారు.

విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయం చేనేత భవన్ లో గురువారం కృష్ణా జిల్లాలోని చేనేత సహకార సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ కొత్త డిజైన్లతో చేనేత రంగం ఆధునికం కావాల్సిన అవసరం ఉందని, చేనేత రంగానికి భవిష్యత్తులేదనుకోవడం పొరపాటని అన్నారు. ‘ఇపుడు  యువత, మహిళలు మార్కెట్ ను నడిపించే శక్తులు. వాళ్లు చేనేతను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ రెండు వర్గాలు ఆకట్టుకుంటే చేనేత స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తుంది. ఈ వర్గాలలో చేనేత పట్ల  మక్కువ పెరుగుతూ ఉండటం  ఎంతో శుభసూచకం. వారి అభిరుచికి తగ్గట్టుగా నూతన వెరైటీలు, సరికొత్త డిజైనులకు రూపకల్పన చేయాల్సిన బాధ్యత చేనేత రంగానిది,’ అని మోహన రావు  అన్నారు.

కాలం చెల్లిన ముతక వెరైటీలకు స్వస్తి పలికి మగ్గంపై నూతన డిజైన్లకు నాంది పలకాల్సిన సమయం ఆసన్నమయింది, కాలం తో పాటు మారే రంగాలకు మంచి భవిషత్తు ఉంటుందని ఆయన చెప్పారు

“డిజైన్లు, రంగులు, బుటాలు, బోర్డర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుని స్వల్ప మార్పులు చేయ టం ద్వారా  అప్కో తరఫున  నూతన డిజైన్లు, మోడళ్ళు ఇవ్వగలగాలి. ఆప్కో ద్వారా ఇచ్చిన కొత్త డిజైన్లు నేయించగలిగితే సొసైటీల వద్ద ఉన్న పాత స్థాకు  విలువ జోడించ పెరుగుతుంది,’ అని మోహన్ రావు అన్నారు.

ప్రభుత్వంతో మాట్లాడి బిల్లులు కూడా త్వరితగతిన విడుదలయ్యే విధంగా చర్యలు చేపడతానని ఆయన హామీ ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా షోరూములను మరింతగా విస్తరించి చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని, వస్త్ర విక్రయాలను పెంచేందుకు ఒక ప్రణాళిక రూపొందిస్తామని ఆయన వెల్లడించారు.


చేనేతను ఇష్టపడుతున్న యువత,మహిళలు
వారిని మెప్పించేలా డిజైన్లు రూపకల్పన
రాబోయే కాలం చేనేతకు స్వర్ణయుగమే
ఆప్కో మెగా షోరూమ్ ల విస్తరణ


జిల్లాలోని చేనేత సహకార సంఘాల వారు నేయిస్తున్న డిజైన్లను చైర్మన్ మోహనరావు పరిశీలించారు. ఈ సమావేశంలో ఆప్కో జీఏం లేళ్ల రమేష్ బాబు, వీవర్స్ సర్వీస్ సెంటరు ఏడీ హిమజ్ కుమార్, డీఏంఓలు, ఏడీలు, సొసైటీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *