తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో జరుగని అన్యాయం వరంగల్ నిరుద్యోగ వికలాంగులకు జరుగుతున్నదని ఉమ్మడి వరంగల్ జిల్లా వికాలంగులు ఆవేదన చెందుతున్నారు.
గత మూడు సంవత్సరాలుగా (2017 నుండి 2020)వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలుగా ఉన్న 88 కి పైగా వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల నియామకం చేపట్టకుండా వికలాంగుల జీవితాల్లో చీకటిని నింపుతున్న వైనం నెలకొన్నది.
దీనికి ప్రధాన కారణాలు వికలాంగుల పట్ల వివక్షత కనబరచడం, పట్టింపులేని తనంతో పాటు జిల్లా సంక్షేమ అధికారుల మాటిమాటికి బదిలీలు ,ఉద్యోగ విరమణలు మరియు కార్యాలయంలో నియామక ప్రక్రియ పనుల నిర్వహణ సిబ్బంది లోటని చెపుతూ కాలయాపన చేస్తున్న అధికారులు ప్రస్తుతం ఆన్ లైన్ మార్గదర్శకాలు జారీ అయిన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తామని కొత్త రాగం తీస్తున్నారు వారు చెబుతున్నారు.
మరో ప్రధానకారణం స్వతంత్ర వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనంచేయడంతో వికలాంగుల సమస్యలు పెరిగి పెనం మీద నుండి పొయ్యిల పడ్డట్టయింది.
ఈ మూడేండ్ల కాలంలో ఎన్నోసార్లు నోటిఫికేషన్ ఇవ్వండని జిల్లా కలెక్టర్లను, జిల్లా సంక్షేమ అధికారులకు వినతి పత్రాలు ,విజ్ఞాపనలుచేసి ప్రాధేయపడినా, నిరసనలు, బైఠాయింపులు జరిపినా పట్టించుకున్న నాథుడే కరువైన దుస్థితి దాపురించింది.
గత సంవత్సరం విసిగి వేసారిపోయిన అంధ నిరుద్యోగులు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంను ముట్టడి చేసి బైఠాయింపు జరిపినందులకు పోలీసులకే అరెస్టు చేయించి అమానవీయతకు పాల్పడిన దారుణ సంఘటన జరిగింది. పోలీసులు అరెస్టు చేసిన అంధ నిరుద్యోగులందరిని నగరం శివారులో నిర్మానుష్య ప్రదేశంలో నిర్ధ్యాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళడం జరిగింది.
అప్పటి నుండి ఈనాటి వరకు జిల్లా మహిళా ,శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది వికలాంగుల పట్ల తమ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా అనాలోచిత కారణాలను చూపుతూ అనవసర కాలయాపనకు పాల్పడుతున్నారు.
అంతేగాకుండా వరంగల్ జిల్లాకు ఏ సంక్షేమ అధికారి బదిలీ లేదా ప్రమోషన్ పై వచ్చినా నాలుగైదు నెలల్లోనే మళ్లీ బదిలీ చేయించుకొని పోవడంతో పాటు ఇదే జిల్లాలో కొందరు ఉద్యోగ విరమణ పొందటం నిత్యకృత్యమైంది.
ఇలాంటి అధికారుల పాలన వికలాంగుల పాలిట శాపంగా మారింది.
గత మూడు నెలల కిందట 88 ఖాళీలున్నాయని ప్రకటించిన
అధికారులు ప్రస్తుతం మాట మార్చి 72 మాత్రమే ఉన్నాయని దబాయిస్తున్నారు. ఇదేమి అన్యాయమని నిలదీయగా మిగతా ఖాళీలను ఆయా విభాగాలే మళ్ళీ తిరిగి తీసుకున్నాయనే నెపంతో దాటవేస్తున్నారు.ఇదంతా గమనిస్తే ఇందులో ఏదో కుట్ర కుతంత్రాలకు తావిస్తున్నట్టుగా భావించవలసి రావడంలో సందేహం లేదు.
మళ్ళీ తిరిగి తమ ఖాళీ పోస్టులను తామే తీసుకున్నారనేది పూర్తిగా అబద్దమే కాదు అవాస్తవం, అసంబద్ధం కూడా.
గతంలో ఇదే కుటిల వైఖరి అవలంభించి కొన్ని పోస్టులను లోపాయికారణంగా లంచాలకు మరిగిన అధికారులు,సిబ్బంది కుమ్ముక్కై అమ్ముకున్నారనే అపవాదును మూటగట్టుకున్నారనేది గమనార్హం.ఇందులో తొంబది శాతానికి పైగా వాస్తవమున్నదంటున్నారు.
ప్రస్తుతం కూడా ఇట్లాగే సంవత్సరాల తరబడి దీర్ఘ కాలయాపనలు కొనసాగిస్తూ మరికొన్ని పోస్టులను అమ్ముకుంటున్నారేమోనని నిరుద్యోగ వికలాంగులుఅనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళనకు గురవుతున్నారు.
ప్రస్తుతం కూడా ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్న జిల్లా సంక్షేమ అధికారి కూడా నోటిఫికేషన్ ,నియామకాల గొడవలు నాకేందుకులే అన్న ధోరణిలో మా చేతుల్లో ఏం లేదు రాష్ట్ర వికలాంగుల శాఖ ఆన్ లైన్ మార్గదర్శకాలు జారీచేస్తేనే నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు.
ఇదే దాటవేత సాచివేత విధానం కొనసాగితే నిరుద్యోగ వికలాంగుల జీవితాలు నరకప్రాయంగా మారతాయని ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వెలిబుచ్చుచున్నారు.
ఏదేమైనా జిల్లా కలెక్టర్ సహృదయంతో స్పందించి అత్యంత మానవీయతను ప్రదర్శించి ఆన్ లైనో ,ఆఫ్ లైన్లో నో వీలైనంత తొందరలో నోటిఫికేషన్ ఇప్పించి నియామకాలను పూర్తి పారదర్శకంగా జరిపి వికలాంగుల చీకటి జీవితాల్లో వెలుగులు నింపగలరని వారు ఒకప్రకటనలో కోరారు.