ఘాజీపూర్ సెంటర్ ని మో.షా ప్రభుత్వం అదృశ్యం చేయగలదా?

(ఇఫ్టూ ప్రసాద్ -పిపి)

ప్రణాళికా సంఘం రద్దు… పెద్ద నోట్ల రద్దు… GST చట్టం… కాశ్మీరుపై 370, 35A రద్దు… NRC, CAA చట్టాలు… కోవిడ్ 19పై చప్పట్ల మోతల మధ్య ఉద్దీపన పథకాలు…వంటి పలు ముఖ్య మజిలీల్లో దేశప్రజలపై మోడీ ప్రభుత్వం సాగించిన యుద్ధంలో అది ధరించిన హిందూత్వ కవచం చాలా వరకు ఉపయోగపడింది.

ఐతే అట్టి హిందూత్వ కవచం మొదటి సారి తాజా రైతాంగ పోరాటం సందర్భంలో మాత్రమే చిల్లులు పడింది. అదెలా అంటే.. సింఘు మీద ఖలిస్తాన్ ముద్రను వేసి, హిందూత్వ ఆయుధానికి గట్టి పదును పెట్టి రైతాంగ ఉద్యమం పై దాడి చేద్దామనే మోడీ షా ప్రభుత్వ తొలి పథకం ఘోరంగా విఫలమైనది. ఫలితంగా గత ఆరున్నర ఏళ్ల మోడీ ప్రభుత్వ పాలనలో తొలిసారి హిందూత్వ కవచానికి చిల్లు (బెజ్జం లేదా రంధ్రం) పడింది. ఆచిన్న చిల్లుకి ఎర్రకోట వద్ద రిపేరు చేయించి, రైతాంగం పై మరింత దూకుడు శక్తితో పెద్ద యుద్ధం చేద్దామని కార్పొరేట్ శక్తుల సౌజన్యంతో మోడీ షా ప్రభుత్వం పథక రచన చేసింది. హిందూత్వ టైరుకి పడ్డ చిల్లుకు ఎర్రకోట వద్ద రిపేరు షాప్ లో అది మాటు (పంక్చర్) వేయనైతే, వేయించింది. కానీ మూడో రోజు ఘాజీపూర్ బోర్డర్ వద్ద దానికి గాలి తుస్సుమన్నది. దాని తర్వాత హిందూత్వ కవచం మోడీ సర్కార్ కి ఉపయోగ పడకుండా పోయింది. పైగా జనవరి 29 తర్వాత ఘాజీపూర్ ముఖ్య కేంద్రంగా ప్రధానంగా “హిందూ రైతాంగం” (హిందూత్వ దృష్టి ప్రకారం) మీద హిందూత్వ సర్కార్ దాడికిదిగాల్సి వస్తోంది. ఇది మరోరకంగా చెప్పాలంటే, హిందూత్వ కవచాన్ని వదిలేసి, “దిగంబర యుద్ధం” చేయాల్సిన పరిస్థితి హిందూత్వ సర్కార్ కి ఏర్పడింది. దానికో సంకేతంగా నిలిచేదే తాజా ముళ్ల కంచెలతో కూడిన బారికేడ్ల వ్యవస్థ!


   ఢిల్లీ పోలీసుల  కాంక్రీట్ బారికేడ్లు  రైతాంగ ఉద్యమ గమనంలో ఏ మలుపులకు, పిలుపులకు చిహ్నం?


ఢిల్లీ ముట్టడి తొలిరోజు నుండే కార్పొరేట్ మీడియా సాయంతో మోడీ ప్రభుత్వం ఖలిస్తాన్ బూచితో దుష్ప్రచార దుమారాన్ని లేపింది. ఐతే అది హిట్ కాలేదు. స్టేజ్ కూ (coup) కుట్ర లో భాగంగా జనవరి మోడీ షా ప్రభుత్వం ఎర్రకోటపై తన తొత్తు తో శిక్ఖు మతపతాకాన్ని ఎగర వేయించి, దానినే ఖలిస్తాన్ జండాగా చిత్రించి, దేశప్రజల (ముఖ్యంగా హిందువుల) మనో భావాల్ని రెచ్చగొట్ట జూసింది. ఖలిస్తాన్ బూచితో రైతాంగ పోరాటాన్ని నెత్తురుటేరుల్లో ముంచి వేసే వ్యూహరచన చేసిందని జనవరి 26 నాటి పరిణామాలు వెల్లడిస్తున్నాయి. అట్టి ఫాసిస్టు రక్తసిక్త కుట్రకు రక్త క్షేత్రంగా “సింఘు” మాత్రమే అవుతుంది. అంతేతప్ప అది “ఘజీపూర్” కాజాలదు. ఎందుకంటే, ఘజీపూర్ ముట్టడి ప్రధానంగా యూపీ రైతాంగంతో కూడింది. హిందూత్వ కళ్ళద్దాల తో చూస్తే ఘజీపూర్ ముట్టడి లో పాల్గొనే రైతాంగం ప్రధానం గా హిందువులే. పైగా 2013 లో ముజఫర్ నగర్ ముస్లిమ్స్ పై హిందూత్వ మూకల దాడుల సందర్భంలోనూ; 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో హిందూత్వ శక్తుల వెనక సమీకృతులే! ఆ నేపథ్యం వల్ల నిజానికి మోడీ హిందూత్వ సర్కార్ తన విజన్ ప్రకారం హిందూ రైతాంగంతో కూడిన “ఘజీపూర్” కేంద్రాన్ని తన ఫాసిస్టు దమనకాండకు కార్యక్షేత్రంగా ఎంపిక చేసుకోదు. ఐతే సింఘు బోర్డర్ వద్ద రేపో మాపో తాను సృష్టించబోవు జలియన్ వాలాబాగ్ తరహా ఫాసిస్టు రక్తసిక్త యుద్ధకాండకు ముందే “ఘాజీపూర్” సెంటర్ ని అదృశ్యం చేయడం మో.షా ప్రభుత్వం ఎదుట ఓ కర్తవ్యంగా ముందుకొచ్చింది. “సింఘు”ను యుద్ధ ట్యాంకులతో తొక్కించి ఖలిస్తాన్ శక్తుల్ని ఏరిపారవేసిన దేశభక్తియుతచర్య (ఆపరేషన్) గా నామకరణం చేసే రేపటి కుట్రకి ముందు అది ఘజీపూర్ ని అదృశ్యం చేసే పరిమితమైన పనికి దిగింది. ఈవిధంగా తాను సింఘును సరిగ్గా జలియన్ వాలాబాగ్ గా రక్తసిక్తం చేసే సమయానికి ఘజీపూర్ ఒకవేళ ఇంకా “రైతాంగ ముట్టడి కేంద్రం” గానే కొనసాగుతూ ఉన్నట్లయితే, హిందూత్వ మోడీ సర్కారు కి ఒక ఇబ్బంది ఉంటుంది. సింగుపై తన దాడిని ఖలిస్తాన్ కేంద్రంపై దాడిగా కాక, పొరపాటున రైతాంగ పోరాటం పై తన దాడిగా “ఘజీపూర్” ప్రతిస్పందించే పరిస్థితి ఒకవేళ ఏర్పడిందనుకుందాం. ఒకవేళ అదే జరిగితే, తను చేపట్టనున్న రక్తసిక్త ఫాసిస్టు దమనకాండకు తాను ఆశించే హిందూత్వ ఫలితాలు రాక పోవచ్చు. తాను ఆశించినట్లు హిందు-శిక్ఖు మత విభజనను తెచ్చి, హిందూత్వ ఉన్మాదాన్ని ఒక ఉద్యమంగా సృష్టించడం మోడీ సర్కార్ కి సాధ్యం కాకపోవచ్చు. అందుకే, సింఘులో తన రక్తసిక్త కుట్రకు ముందే ఘజీపూర్ లో రైతాంగ ముట్టడికి విరమింప జేయడం ఓకర్తవ్యంగా మారడం సహజం.

వాస్తవ సైనిక ఆపరేషన్ స్థలం ఘజీపూర్ కాదు. అది ఉప ఆపరేషన్ స్థలం మాత్రమే. అది సింఘు బోర్డర్ మాత్రమే. ఐతే ఆపరేషన్ వికటించింది. పొరపాటున ఉప ఆపరేషన్ స్థలమే మోడీ ప్రభుత్వ రక్తసిక్త ఫాసిస్టు జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసింది. దీనితో హిందు-శిక్ఖు విభజన తెచ్చి, హిందూత్వ ఉన్మాదాన్ని దేశ ప్రజలలో సృష్టించే సువర్ణావకాశం మోడీ సర్కారుకి లేకుండా పోయింది. ఫలితంగా హిందువుల మీద హిందూత్వ సర్కారు దాడి చేసే కొత్త పరిస్థితి ఏర్పడింది. గతం లో ఖలిస్తాన్ బూచితో శిక్ఖు మైనారిటీలపై ఇందిరా గాంధీ ప్రభుత్వo “ఆపరేషన్ బ్లూ స్టార్” చేసింది. నాడు బీజేపీ శిఖుల్ని హత్తుకొని, మొన్నటి వరకూ “పవిత్ర రాజకీయ కాపురం” సాగించింది. అదే శిక్ఖు మైనారిటీ మతాన్ని బూచిగా ఎంచుకొని, మరో “ఆపరేషన్ బ్లూ స్టార్” తరహా ఫాసిస్టు కుట్ర కి మోడీ షా ప్రభుత్వం ప్లాన్ చేసి ఉండొచ్చని వర్తమాన చరిత్ర గమనాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. అట్టి ఫాసిస్టు దాడితో హిందూత్వ ఉన్మాదం సృష్టించే సువర్ణావకాశాన్ని అది మొగ్గదశలోనే మోలోయింది.

పైగా అది ఘజీపూర్ కేంద్రంగా యూపీ లో మహా పంచాతీల సృష్టికి దారితీసింది. తద్వారా అది కొత్తకుంపట్లను ఎదుర్కొనే ఇరకాటస్థితిలోకి నెట్టబడింది. తాజా “ఎర్రకోటకుట్ర”ఫలం ఇదే!

ఒక్కమాటలో చెప్పాలంటే, “డామిట్ కధ అడ్డం తిరిగింది” చందంగా మోడీ సర్కార్ తలపెట్టిన వ్యూహాత్మక “ఆపేరేషన్ రెడ్ ఫోర్ట్” కుట్ర ఘోరంగా వికటించింది.

గతం లో ముస్లిముల్ని వలె ఇప్పుడు శిక్ఖుల్ని బలి పశువుల్ని చేసి, బడా కార్పొరేట్ వ్యవస్థకు సేవ చేసే “సైనిక కుట్ర” విఫలం చెందింది. దీని వల్ల “శిక్ఖులపై పవిత్ర యుద్ధం” చేయడానికి బదులు, హిందూ రైతాంగం పై అపవిత్రదాడికి దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇది మోడీ హిందూత్వ సర్కార్ కి ఓ పెను రాజకీయ విషాదాన్ని మిగిలించే పరిణామమే.

నేడు ఘజీపూర్ కేంద్రంగా “హిందువుల పై హిందూత్వ ప్రభుత్వ యుద్ధం” చేయాల్సి రావడం రాజకీయ విషాధమే కదా! ఈ వికటించిన యుద్ధం లో తాజా బారికేడ్ల నిర్మాణం అనివార్యంగా అంతర్భాగం కావాల్సి వచ్చింది.

రాకెష్ తికాయట్ వంటి తమ ప్రియతమ రైతునేతల్ని బాహాటంగా అవమానించింది కాకుండా, అందుకు నిరసనగా ఢిల్లీ వెళ్లే తమ రైతాంగానికి ముళ్ల కంచెలు, ఇనుప మేకుల తో బారికేడ్లని మోడీ ప్రభుత్వం నిర్మించడం ఏమిటి అంటూ హిందూ బెల్ట్ లోని రైతాంగంలో ధర్మాగ్రహం కట్టలుతెంచుకొని నేడు పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటి వరకూ అన్ని మతాలకి చెందిన ప్రజలపై తన ఫాసిస్టు దాడులకు మోడీ ప్రభుత్వం ఏ హిందూత్వ కవచం ధరించిందో, దాన్ని నేడు మోడీ ప్రభుత్వం కోల్పోతున్నది. అది చేపట్టిన తాజా కాంక్రీట్ బారికేడ్ల నిర్మాణ వ్యవస్థ కూడా అది ఇప్పటి వరకు దరిస్తోన్న హిందూత్వ కవచాన్ని విచ్చిన్నం చేస్తోంది. (ఈ తరహా హిందూత్వ కవచం ఇక ముందు మోడీ సర్కారు కి లేకుండా పోతుందని కాదు. ఇక ముందు హిందూత్వ ఉన్మాదాన్ని సృష్టించే స్టేజి కూప్స్ కుట్రలకు కాలదోషం పడుతుందని కూడా కాదు. ఈ రైతాంగ పోరాటానికి పరిమితమై మాట్లాడే విషయం గా మాత్రమే గమనించాలి)

1948లో గాంధీ హత్యతో తన హిందూత్వ నిజరూపాన్ని ఆర్.ఎస్.ఎస్. తొలిసారి పూర్తి స్థాయిలో బయట పెట్టుకుంది. అది తన ఎదుగుదలకు పెద్ద రాజకీయ శాపంగా మారిందని భావించి, గాంధీహత్య పాపాన్ని కూడా గాంధీ పేరుతోనే కడిగి వేసుకుందామని 1980లో పార్టీ పేరును జనసంఘ్ నుండి బీజేపీ గా మార్చుకుంది. అది “గాంధేయ సోషలిజం”ని తన లక్ష్యంగా ప్రకటించుకుంది. అది ఫలించలేదని భావించి, బడా కార్పిరేట్ల అండతో బాబారీ మసీదు అంశం తలకెత్తుకొని తిరిగి హిందూత్వ పంథాకు పదును పెట్టుకుంది. తుదకు అధికారాన్ని పొందింది. నాటి నుండి నేటి వరకు అప్రతిహత హిందూత్వ ప్రస్థానంలో అది మొదటిసారి నేడు రైతాంగ ప్రతిఘటన ఎదుట తన హిందూత్వ ఆయుధాన్ని మొద్దు బార్చుకుంది. తాజా రైతాంగ ఉద్యమపధం కొత్త కొంగొత్త మలుపుల్ని, మజిలీల్ని దాటుతూ నేడు కొత్త పుంతల్ని తొక్కుతూ ఉంది. నేడు రివర్స్ గేరులో “ఎర్రకోట కుట్ర” ఓ పెద్ద ఉత్ప్రేరకంగా మారింది.

పెట్టుబడి దారీవర్గం తన గోయ్యుని త్రవ్వే ప్రత్యర్థి వర్గాన్ని సృష్టించడమే కాకుండా అట్టి గోతిలో తమను పూడ్చి పెట్టె ఆయుధాల్ని కూడా వారికి అందిస్తుందని కారల్ మార్క్స్, ఎంగెల్స్ క.పా. ప్రణాళికలో చెప్పింది గుర్తుకు వస్తోంది. తాము సేవ చేసి పెట్టాల్సిన బడా కార్పొరేట్ వర్గం కోసం హిందూత్వ సర్కార్ శ్రమించి సృష్టించుకున్న “హిందూత్వ ఆయుధం” కూడా ఒకదశకు వచ్చేసరికి మొద్దుబారక తప్పదు. మరో దశలోకి వచ్చే సరికి అది పూర్తిగా చేజారిపోక తప్పదు. వర్తమాన రైతాంగ పోరాటం నేడు నేర్పుతోన్న గుణపాఠం యిది.

ఇనుప మెకులతో నిర్మించే తాజా నిరంకుశ బారికేడ్ల వ్యవస్థ మైనారిటీ ఉగ్రవాదం నుండి మెజారిటీ హిందువుల్ని రక్షించే పేరుతో కాకుండా, హిందూత్వ రాజకీయ భాషలో చెప్పాలంటే, ప్రధానంగా హిందూ రైతాంగం నుండి రక్షించుకునే పేరిట తలపెట్టే నిరంకుశ ప్రక్రియగా మారడం గమనార్హం.

(ఇంకా ఉంది)


8-2-2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *