(ఒకపుడు తిరుపతి గొప్పసెక్యులర్ నగరం. నగరం నడిబొడ్డున ఉన్న గోవిందరాజస్వామి కోనేటి కట్ట పాపులర్ రాజకీయ సభా వేదిక. కొనేటి కట్ట మీద ఈ రోజుల్లో అలాంటి రాజకీయ వాతావరణం వూహించనేలేం.)
(రాఘవ శర్మ)
తిరుపతిలోని కోనేటి కట్టకు ఒక విశేషమైన చరిత్ర ఉంది.
‘కోనేటి కట్ట’ గా ప్రసిద్ధి చెందిన గోవిందరాజ స్వామి కోనేరు చాలా పురాతనమైనది.ఇక్కడ పూజలు, ఉత్సవాల నిర్వహణలో దీనికి అయిదు శతాబ్దాల చరిత్ర ఉంది.
దశబ్దాలపాటు ఈ నగరానికి ఒక ముఖ్యమైన సభావేదికగా ఈ కోనేటి కట్ట ఉపయోగపడింది.ఈ కట్టపైన లెక్కలేనన్ని సభలు, సమావేశాలు జరిగాయి.
ప్రజాస్వామిక భావనలో కీలకమైన భావప్రకటనా స్వేచ్ఛకు ఇదొక వేదికయ్యింది.తిరుపతి లో వ్యక్తమైన ప్రజల ఆవేదనలకు, ఆలోచనలకు, భావ సంఘర్షణకు, తాత్విక చింతనకు, భిన్న రాజకీయ దృక్పథాలకు ఈ కోనేటి కట్ట దశాబ్దాలపాటు సాక్ష్యంగా నిలబడింది.
ఒక్క మాటలో చెప్పాలంటే కోనేటి కట్ట తిరుపతి ప్రజల గుండె చప్పుడు.
ఈ కోనేరు చాలా పెద్దది.దీనిచుట్టూ రాతితో పిట్టగోడ లాంటి కట్ట నిర్మించారు. రాతి కట్టపైన ఎత్తైన గ్రిల్ ఏర్పాటు చేశారు. లోపల చుట్టూ విశాలంగా నేలంతా చక్కగా చెక్కిన రాళ్ళు పరిచారు.
కోనేరులోకి దిగడానికి రాతి మెట్లు.దాని మధ్యలో అంద మైన పెద్ద రాతి మండపం.
నాకు తెలిసినప్పుడు కూడా ఈ కోనేరులో నీళ్ళుండేవి. ఇప్పుడు నీళ్ళు లేవు. గోవిందరాజ స్వామి తెప్పోత్సవ సమయాలలో మాత్రం నీళ్ళు నింపుతున్నారు. ఈ కోనేరు అసలు పేరు గోవింద పుష్కరిణి.దీనికి కృష్ణ రాయ కోనేరు అన్న పేరు కూడా ఉండేది. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో నిర్మించారు.
ఈ ఆలయానికంటే ముందు ఇక్కడ పార్థసారథి ఆలయం ఉండేది. తిరుచానూరు నుంచి తిరుమల వెళ్ళడానికి వేదపండితులు చాలా ఇబ్బంది పడేవారు. రామనుజాచార్యుల సూచన మేరకు వేదపండితుల కోసం గుడి చుట్టూ అగ్రహారం నిర్మించారు. తిరుపతి నగరం తొలుత ఈ ఆలయం చుట్టూనే నిర్మించారు.
ఆ రోజుల్లో దీనిని రామానుజనగర్ అనేవారు.ఈ పుష్కరిణి గురించిన ప్రస్థావన క్రీస్తు శకం 1522 నాటి శాసనం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ కోనేరును తొలుత సాళువ తిమ్మరుసు తమ్ముడు, శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో పనిచేసే రాచిరాజ కుమారుడు గోవిందరాజులు నిర్మించాడు.
ఆ తరువాత దశలవారీగా ఈ కోనేటి నిర్మాణం అభివృద్ధి చెందింది.
గోవిందరాజస్వామి కోనేరుకు వాయవ్య దిశలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది.ఆ రావి చెట్టు పక్కనే వినాయకుడి ఆలయం.ఆరావి చెట్టు కిందనే, కోనేటి గట్టుపైన సభావేదిక ఏర్పాటుచేసుకునే వారు.
సభా వేదిక ముందున్న మెట్లన్నీ ఒక సహజసిద్ధమైన గ్యాలరీ లా అనిపిస్తుంది. ఆ మెట్లపైనే ప్రేక్షకులు కూర్చుని, ఎత్తుగా ఉన్న వేదికపై ప్రసంగాలు వినేవారు.
ఈ కోనేటి కట్ట పైన ఎన్ని సభలు జరిగాయో లెక్కే లేదు.అనేక మంది సాహితీ వేత్తలు, ఎందరో రాజకీయ నాయకులు, మరెందరో సామాజిక సేవకులు, కార్మిక నాయకులు ఇక్కడి నుంచే ప్రసంగించారు. జాతీయ నాయకులు, మాజీ ప్రధానులు కూడా ఈ కోనేటి కట్టనుంచే ఉపన్యసించారు. ఈ కోనేటి కట్ట పైనుంచి త్రిపురనేని మధుసూదన రావు చేసిన ప్రసంగాలు అనేక సార్లు విన్నాను.
జ్వాలముఖి వాక్ప్రవాహంలో తేలియాడాను. భూమన్ ఆవేశాత్మక మాటలతో మమేకమయ్యాను. నిఖిలేశ్వర్ ధర్మాగ్రహాన్ని ఆస్వాదించాను.
రాయలసీమ సమస్యలపైన మైసూరారెడ్డి వాదనాపటిమను గమనించాను. ఏక బిగిన మూడు గంటల పాటు ప్రసంగించిన నాదెండ్ల భాస్కరరావును చూసి ఆశ్చర్యపోయాను.
జోరున వర్షం కురుస్తున్న సమయంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఈ కోనేటి కట్టపైనుంచే ప్రసంగించారు. రాజకీయంగా, స్థానికంగా ఏ సమస్య వచ్చినా, తిరుపతిలో ఏ ఆందోళన జరిగినా వామపక్షాలకు కోనేటి కట్టే సభా వేదిక అయ్యింది.
ఇప్పుడైతే ఆంక్షలు వచ్చాయి కానీ, ఒకప్పుడు కోనేటి కట్టపైన సభలకు అనుమతి అవసరం ఉండేది కాదు. కోనేటి కట్టపైన మీటింగు సమయం, ప్రసంగించే వక్తల పేర్లు రిక్షాలో మైకు పెట్టి చెప్పిస్తే చాలు జనం వచ్చేవారు. మాట్లాడే వక్తలు, ప్రేక్షకులు ఉంటే మైకు ఖర్చు నామమాత్రం.తేలికగా సభ సక్సెస్ అయ్యేది.
ఎంత స్వేచ్ఛ ! ఎంత చైతన్యం!
ప్రజాస్వామిక ప్రక్రియలో ఇది ఎంత ముఖ్య మో! వీటన్నిటినీ కాలం తన కడుపులో దాచుకుంది.
అది 1980 ప్రాంతం. కోనేటి కట్టపైన ఓపీడీఆర్ తరపున ఒక పెద్ద సభ పెట్టాం. ఆ సభ పేరు ‘ గొప్ప బహిరంగ సభ’
‘ గొప్ప బహిరంగ సభ’ అని మాకు మేమే పెట్టిన ఆపేరు తలుచుకుంటే ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. కోనేటి కట్టపైన టేబుల్ , నాలుగు కుర్చీలువేశాం. మైకు పెట్టాం. అంతే.
జ్వాలాముఖి, భూమన్, నిఖిలేశ్వర తోపాటు నేను కూడా ప్రసంగించాను. పెద్ద సంఖ్యలో జనం వచ్చారు.
దశాబ్దాలపాటు కోనేటి కట్టపైన సభలు చూస్తున్నాం కనుక మాకేమీ వింతగా అనిపించలేదు. ‘అసలు కోనేరులో సభ ఎలా పెడతారు!?’ అని జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ తొలుత విస్తుపోయారు. సభ తరువాత సహజ సిద్ధమైన ఈ వేదికను చూసి ముచ్చట పడిపోయారు.
‘ఇక్కడి రైల్వే స్టేషన్ కూడా దేవాలయ మండపం లాగా ఉంటుందే !’ అంటూ ఒక సారి నిఖిలేశ్వర్ ఆశ్చర్యపోయారు. నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, భూమన్ గతంలో విరసం లో ఉన్నారు. దాని వ్యవస్థాపక సభ్యులు.
సైద్ధాంతికంగా విరసంతో విభేదించి బైటి కొచ్చారు.రవిబాబు, రంగనాయకమ్మ వంటి పలువురితో కలిసి జనసాహితిని ఏర్పాటు చేశారు.జనసాహితిలోనూ విభేదాలు !
పార్టీలో వచ్చిన విభేదాలు రచయితల సంఘాలలోనూ ప్రతిబింబించాయి. భూమన్, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి జనసాహితీ నుంచి కూడా బైటికి వచ్చారు. జనసాహితీ తిరుపతి యూనిట్‌లో ఉన్న నేను, ఏ.ఎన్. నాగేశ్వరరావు కూడా అదే బాట నడిచాం.
ఈ నేపథ్యంలో విప్లవ సాహితీ సంస్థల ఐక్యత కోసం తిరుపతి లో జ్వాలాముఖి, త్రిపురనేని మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే మొదటి సత్రంలో జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ బస చేశారు.
కోనేటి కట్ట వద్ద సభ అయిపోయిన మరుసటి రోజు త్రిపురనేని వారి గదికి వచ్చారు.ఆ సత్రంలోనే ఒక దగ్గర నేలపైన కూర్చుని జ్వాలాముఖి, త్రిపురనేని గంటల తరబడి మాట్లాడుకున్నారు.
నేను,భూమన్, నిఖిలేశ్వర్, ఏఎన్ నాగేశ్వరరావు దూరంగా ఉండిపోయాం. మళ్ళీ విరసంలోకి రమ్మని ఆహ్వానించడం కోసమే త్రిపురనేని ఈ చర్చలు జరిపారు.చర్చలు ఫలించలేదు. ఎవరి వాదనలో వారున్నారు. కొన్నిసైద్ధాంతిక విభేదాలున్నా వారి ధ్యేయం మాత్రం ఒకటే.
వారి మధ్య పరస్పర గౌరవాభిమానాలుండేవి. ఆ తరువాత కూడా జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ చాలా సార్లు తిరుపతి వచ్చారు.తిరుపతి రైల్వే స్టేషన్‌సమీపంలో ఉన్న బాలాజీ భవన్ మరో పెద్ద సభావేదిక.బాలాజీ భవన్‌లో కూడా మంచి సభలు జరిగాయి.
బాలాజీ భవన్ అనుబంధ లాడ్జిలో ఒక సారి జ్వాలాముఖి దిగారు.ఆయన్ను కలవడం కోసం ఆ లాడ్జికి వెళ్ళాను. లాడ్జి గది సాదాసీదాగా ఉంది.బాత్‌రూంలోకి వెళ్ళి పాకుడుకు జారి పడ్డాను. దెబ్బలు తగల లేదు.
ఆ శబ్దానికి జ్వాలాముఖి గబగబా వచ్చి చేతులు కడిగి సపర్యలు చేశారు. సాయంత్రం బాలాజీ భవన్ సభలో జ్వాలాముఖి ప్రసంగం మొదలైంది.
‘ ఈ దేశమంతా పాకుడుపట్టింది. సర్కస్ ఫీట్లు చేస్తూ ఎంత కాలం జాగ్రత్తగా అడుగులు వేస్తాం? ఎవరో ఒకరు జారిపడతారు. ఎప్పుడో ఒకప్పుడు మనం కూడా జారిపడతాం. ఈ రోజు ఒకరు. రేపు మరొకరు. ఎల్లుండి మరొకరు. ఒకరోజు మన వంతూ వస్తుంది. జారిపడిన వారిని చూసి నవ్వడం కాదు.
ఈ దేశానికి పట్టిన అవినీతి పాకుడును మనమందరం కలిసి కడిగేయాలి’ అన్నారు.
ఆ రోజు బాత్‌రూంలో నేను జారిపడిన సంఘటనను ప్రతీకగా తీసుకుని ఆవేశంతో, అర్థవంతంగా , అన ర్ఘలంగా జ్వాలాముఖి మాట్లాడుతుంటే సభం తా కిమ్మనలేదు. ఆశ్చర్యపోయాను.
ఇప్పుడు ఆ బాలాజీ భవన్ కూడా తన ఉనికిని కోల్పోయింది.ఆ తరువాత చిన్న దైనా అంబేద్కర్ భవన్ అనేక సభలకు వేదికయ్యింది. ఆ ఆవరణలో షామియానాలు వేసుకుని సదస్సులు కూడా జరుపుతూనే ఉన్నారు.
తిరుపతిలో మహతీ వచ్చినా, త్యాగరాజ మండపం ఉన్నా, బాలాజీ భవన్ ఉన్నా, యూనివర్సిటీల ఆడిటోరియాలు ఉన్నా , భావ ప్రకటనా వేదికగా కోనేటికట్టకు ఏదీ సాటి రాదు.
ఇప్పుడు ఆ కోనేరు చుట్టూ కొత్త వాతావరణం అలుముకుంది.ఇల్లు, వాకిలి లేని నిరుపేదలకు ఈ కోనే రే నివాస స్థలం.బిచ్చగాళ్ల కు స్వర్గధామం.
ఇప్పుడు కోనేరులోకి ఎవరినీ అనుమతించడం లేదు.గేట్లు వేసేస్తున్నారు.
కోనేటికి తూర్పున యాత్రికుల కోసం విష్ణు నివాసం వెలిసింది.ఉత్తరాన పెద్ద పెద్ద హోటళ్ళు అవతరించాయి.దక్షిణ దిశగా జీపులు, కార్ల పార్కింగ్ వచ్చేసింది. పడమర ఉన్న రోడ్డు రద్దీగా తయారైంది.
ఇలా నలుదిక్కులా కోనేటిని ఏదో ఒకటి కమ్మేసింది.కోనేటి కట్ట సభలు మెల్లగా చ రిత్రలోకి జారుకున్నాయి.ఇలా జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.
(రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)