(డా. డి.వి.జి.శంకర రావు , మాజీ ఎంపీ, పార్వతీపురం.)
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరణకు కేంద్రం పూనుకోవడం సమంజసమూ కాదు ఆమోదయోగ్యమూ కాదు. గతంలో ఒక సారి ఈ ప్రయత్నం జరిగినపుడు పార్లమెంటులో ఎంపిలు ప్రతిఘటించడం జరిగింది. ప్రతిఘటించిన ఎంపిలో నేను కూడా ఉన్నాను. దీనికి ఈ ప్రాంత ఎంపిగా గర్వపడుతున్నారు. దిలీప్ రే ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నపుడు అప్పటి డిజెన్వెస్టు కమిషన్, నాటి ఎన్ డిఎ ప్రభుత్వ విధానాలకు తగ్గట్టుగా 51 శాతానికి తగ్గకుండా ప్రయివేటీకరించాలని సిఫార్సు చేసింది.31.03.1999న కమిషన్ ప్రయివేటీకరణకు సిఫార్సు చేసిందని మంత్రి సభలో ప్రకటించారు. అపుడు నేను తెలుగుదేశం ఎంపిగా సభలో ఉన్నాను. చర్చలో పాల్గొన్నారు. నిరసనగా మేమంతా స్పీకర్ పోడియం చుట్టు ముట్టాము. కాంగ్రెస్ ఎంపిలంతా కూడా తీవ్రంగా ప్రతిఘటించారు.
1700 కోట్ల రుపాయల సాయం అందించి వైజాగ్ స్టీల్స్ ను ఆధునికీకరించేందుకు సకాలంలో చర్యలు తీసుకోవాలని మేమంతా చేసిన అభ్యర్థనలను, అందించిన వినతిపత్రాలను నాటి ప్రభుత్వం ఖాతరు చేయలేదు. అయితే, ప్రయివేటీకరణ ప్రతిపాదనను అడ్డోకోగలిగాం.
సభలో ఎర్రన్నాయుడు, ఎంవివిఎస్ మూర్తి, లతోపాటు ఎంపిలంతా గట్టిగా వాదించిన ఫలితం అది. కాంగ్రెస్ ఎంపి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా ప్రయివేటీకరించాలన్న ప్రతిపాాదనను వ్యతిరేకించారు.
అయితే, మళ్లీ ప్రధాని మోదీ నాయకత్వంలోని బిజెపి మరొక ఈ ప్రతిపాదన తీసుకురావడం సరైన నిర్ణయం కాదు. ఇప్పటికే ఆంధ్రాబ్యాంక్ ను యూనియన్ బ్యాంక్ లో విలీనం ఆంధ్ర పేరు లేకుండా చేశారు. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఆంధ్రా బ్యాంక్ జాతీయోద్యమంలో భాగంగా ఏర్పాటయింది. దీని సంస్థాపకుడు డా పట్టాభి గొప్ప స్వాతంత్య్ర యోధుడు. ఆయన స్థాపించిన ఆంధ్రాబ్యాంక్ అనే మాట లేకుండా ఈ చరిత్రను చెరిపేయాలనుకోవడం ఏమిటి?
ఇలాగే వైజాగ్ స్టీల్ (RINL)కూడా ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన వ్యవహారమే.
పూర్తి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ కర్మాగారం ప్రతిష్టాత్మకమైనది మాత్రమే కాదు తెలుగు వారికి గర్వకారణమైనది.
ఆంధ్రప్రదేశ్ కు విభజన తర్వాత తెలంగాణకు పోనూ మిగిలిన అరా కొరా ప్రభుత్వరంగ సంస్థల్లో పెద్దది.నష్టాల పేరుతోనో, విధానాల పేరుతోనో విశాఖ ఉక్కుని అమ్మేయడమంటే ఈ రాష్ట్రానికి, దేశానికి నష్టపరుస్తున్నట్టే.
భావోద్వేగాల అంశం పక్కకు పెట్టినా,లాభనష్టాల లెక్కలో కూడా ఈ నిర్ణయం తప్పే. ఎందుకంటే ఈ సంస్థ నష్టాలు తలకు మించి,ఏ కోశానా లాభం కనబడక,పోషణ భారం తప్పని తెల్ల ఏనుగు తరహా కాదు. ఉద్దేశ్యపూర్వకంగానో, ఉదాసీనత కారణంగానో ప్రభుత్వం తిండి పెట్టని బాతు.బంగారు గుడ్లు పెట్టగల శక్తి ఉండీ యజమాని తిండి పెట్టక మాడ్చిన బాతు. కొంచెం సౌకర్యం, సహకారం చూపితే లాభాలు చూపించగలదు.
30వేల ఎకరాల్లో,ఇరవై వేల మంది శాశ్వత ఉద్యోగులు,ఇరవై వేల మంది తాత్కాలిక ఉద్యోగుల తో, నాణ్యమైన ఉక్కు ఉత్పత్తితో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు దేశంలోనే తీరప్రాంతంలో ఉన్న ఏకైక కర్మాగారం.అయితే దీనికి అవసరమైన ముడిసరుకు కోసం స్వంత గనుల్లేవు.అలా స్వంత వనరులు సమకూర్చినట్టయితే ఉత్పత్తి చౌకగా జరిగే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ పని చెయ్యడం లేదు.పైగా విస్తరణ కోసం కంపెనీ అప్పుల్లో కూరుకుంది.ప్రభుత్వం తలచుకొంటే సులభంగా సమస్యను పరిష్కరించి,ఈ నవరత్న సంస్థని లాభాల బాట పట్టించగలదు.తద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తీసుకురాగలదు.అలా కాకుండా అమ్మివేయడమే పరిష్కారం అనుకొంటే విలువైన ప్రజాసంపదను వదులుకొన్నట్టే.అప్పుడు ఆత్మనిర్భర భారత్ కి అర్ధమే ఉండదు.
కేంద్రం ఈ సంస్థని పూర్తి ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి.అవసరమైన చేయూత అందించాలి.రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్న అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థని ప్రయివేటీకరణ బారి న పడకుండా కాపాడుకోవాలి.విభజన హామీల ప్రకారం రావాల్సిన కడప ఉక్కు గురించి కూడా గొంతెత్తాలి.విశాఖ ఉక్కు దేశానికి బరువు కాదు,ఆంధ్రులకు పరువు.
– డా. డి.వి.జి.శంకర రావు , మాజీ ఎంపీ, పార్వతీపురం.