రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు రాష్ట్ర ఎన్నిలక కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద నిప్పులు చెరిగారు. తొలి నుంచి రమేష్ కుమార్ మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నది సజ్జలయే. దీని మీద కమిషనర్ అభ్యంతరం కూడా చెప్పారు. ఈ రోజు కమిషన్ పంచాయతీ రాజ్ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిని గృహనిర్బంధం చేస్తూ ఉత్తర్వు లిచ్చాక సజ్జల మరొక దాడి జరిపారు. రిటైరయ్యాక నిమ్మగడ్డ చూడాల్సినవి చాలా ఉంటాయని హెచ్చరించారు.
చిత్తూరు జిల్లాలో జరిగిన ఏకగ్రీవ ఎన్నికల కారణంగానే మంత్రి పెద్దిరెడ్డి మీద గృహ నిర్బంధం విధించాలని నిర్ణయం తీసుకున్నారని చెబుతూ ఏకగ్రీవం ఎన్నిక ఎలా అక్రమమో నిమ్మగడ వివరణ ఇవ్వాలని సజ్జల డిమాండ్ చేశారు. నిమ్మగడ్డ చేసిన తప్పుడు పనులకు కచ్చితంగా శిక్ష తప్పదు అని కూడా అన్నారు.
ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు రావాలని కుటిల నిమ్మగడ్డ కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి పై గృహ నిర్బంధంలో పెట్టాలని ఉత్తర్వులీయడం సిగ్గు చేటని సజ్జల వ్యాఖ్యానించారు.
ఎస్ ఈ సి తప్పులను చెబితే గృహ నిర్బంధం అంటారా అని ప్రశ్నించారు . పెద్దిరెడ్డి గృహ నిర్బంధం ఉత్వర్వుల మీద పై కోర్టు కెళతామని అన్నారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరి డైరెక్షన్ లో పని చేస్తున్నారనేది ఆయన ప్రవర్తన లోనే అర్థం అవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
జడ్పీటిసి ఎన్నికల సమయంలో ఏకగ్రీవాల ఊపందుకున్న నేపథ్యంలో సగం లో ఆపారని, పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అడుగడుగునా అడ్డుపడుతున్నారని సజ్జల ఆరోపించారు.
‘సీనియర్ మంత్రికే దిక్కు లేదు మీరెంత అనే కోణం లో ప్రభుత్వ అధికారులను బెదిరించే యత్నం చేస్తున్నారు. అధికారులు నిమ్మగడ కు భయపడకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. నిమ్మగడ రిటైర్ అయిన తర్వాత చూడాల్సినవి చాలా ఉన్నాయి.’ అని హెచ్చరించారు.
సజ్జల ఇంకా ఏమన్నారంటే…
ఎస్ ఈ సి ఎన్నికల పనులను మార్గదర్శకంగా చేయండి. నిమ్మగడ తన బాధ్యత మరచి పరిమితిని మించి ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రంలో సర్వాధికారాలు తనకెే ఉన్నాయన్న ధోరణితో నిమ్మగడ్డ ప్రవర్తిస్తున్నారు.
పౌరసరఫరాల శాఖ నుండి నాణ్యమైన బియ్యం ఇంటింటికి పంపిణీ చేయాలనేది ఎపుడో గతంలోనే తీసుకున్న నిర్ణయం. దానికి అడ్డుతగులుతున్నారు. చిత్తూరు, గుంటూరు జిల్లాలో ఏకగ్రీవాల పై డిక్లరేషన్ ఇచ్చాక నిలిపివేయడం దారుణం. చట్టవ్యతిరేకం. ఎప్పటి లాగే ఏకగ్రీవాలు జరిగాయి తప్ప అధిక సంఖ్యలో లేవు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతుంటే చూడలేక రాజకీయాలు చేస్తున్నాడు. రాయలసీమ జిల్లాలో కూడా చిత్తూరు లో మాదిరే ఏకగ్రీవాలు జరిగాయి. కేవలం నిమ్మగడ్డకు వివరణ అడిగే అధికారం ఉంది తప్ప చర్యలకు అధికారం లేదు. నిమ్మగడ్డ తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరు.. అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం.. టీడీపీ ప్రభుత్వం కాదు అనేది నిమ్మగడ్డ గమనించాలి. ఎస్ ఈసిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన పావు లాగా నిమ్మగడ ను వాడుకుంటున్నారు.