(శారద శివపురపు)
టైగర్ మామగారు గుర్తున్నారు కదా. అలాగే ఆయనకి గొప్ప టైమ్ సెన్స్ ఉండేదని చెప్పాను కదా. దాని ప్రభావం అందరిమీదా ఎలా ఉండేదంటే చెప్తాను చూడండి. ఇంట్లోంచి ఎవరు ఏకారణంగా బయటికి వెళ్ళినా ఆరింటికల్లా ఇంట్లో ఉండాల్సిందే. అలా ఉండ లేని పక్షంలో ముందుగానే అనుమతి పొందాలి.
ఆఫీసు కెళ్తున్నా సరే త్వరగా వచ్చెయ్ అని అనకుండా ఉండేవారు కాదు. ఇంక ఆరింటి విషయం కాలనీలోని పిల్లలందరికీ తెలిసిందే. సాయంత్రం ఆరవగానే స్నేహితులంతా ఒరేయ్ ఆరయిపోయిందిరోయ్ అని అరిచరచి మరీ కాషన్ చేసేవారట. అంతే ఇంక ఇంటికి లగెత్తటమే, లేకపోతే బాజా భజంత్రీలే.
అసలీ ఆరింటి టైమ్ రూల్ తోటి భలే అవస్త పడ్డామనుకోండి. సరే చదువుకునేటప్పుడంటే అర్ధముంది ఉద్యోగం చేసేటప్పుడు కూడా ప్రొద్దున్న వెళ్ళేటప్పుడు స్కూటర్ స్టార్ట్ చేసాకా ఆగమని కేకేసి సీరియస్గా నడిచొచ్చి చూడూ సాయంత్రం త్వరగా వచ్చెయ్ అని చెప్పేవారు, అదేదొ సాయంత్రం ఇంటికెవరైనా వస్తారా, ఇంట్లో ఏమన్నా పెళ్ళిచూపులా, ఏదైనా ఫంక్షనా ఎదైనా అవసరమైన పనుందా, వీటితో పనే లేదు. ఆయనకి వినయంగా సరేనని చెప్పి, వచ్చిన కోపాన్ని స్కూటర్ నడపటమ్మీద చూపిస్తే పాపం జనాలు అటు ఇటూ తప్పుకోలేక అవస్థ పడేవారు.
త్వరగా లేచి, త్వరగా వెళ్ళి, త్వరగా వచ్చేసి, త్వరగా తినేసి త్వరగా పడుకోవాలి. అదే మంత్రా ఆఫ్ లైఫ్. ఇక ఆయన భోజనం వేళలు ఎట్టి పరిస్తితుల్లోనూ మారడానికి గానీ, కాస్త ఆలస్యం అవడానికి గానీ వీల్లేదు. ఆలస్యమే కాదు ఒక్క నిముషం ముందుకి జరడానికి కూడా వీల్లేదు. మా అత్తగారు ఊళ్ళో లేనప్పుడు, ఉద్యోగం చేస్కునే నేను, నా ఖంగారు ఆయనకి వేళకి భోజనం పెట్టడానికి, ఇక మీరర్ధం చేసుకోవాలి. సోమవారం ఆయన ఉపవాసం ఉండే రోజు. అంటే ఆరోజు పొద్దున్నించి ఏమీ తినరనమాట.
ఆయనకి సుగర్ ఉన్నా ఈ సోమవారం ఉపవాసం మాత్రం చేసేవారు. అంటే ఆ రోజు ఒక గంట ముందే రాత్రి భోజనం ఏర్పాటు చెయ్యాలి. మాకేమో సోమవారాలు బేంకులు బిజీగా ఉండే రోజులు కదా, పైగా పనయ్యాకా పది కిలోమీటర్లు రెండు బస్సులు మారి అటూ ఇటూ ఓ అరగంట నడిచి ఇంటికి చేరాలి. ఎక్కడ నేను చెయ్యలేక చివాట్లు తింటానేమోనని మా ఆయన నా కన్నా ముందు బస్తాండ్లో నాకోసం కాచుకుని బస్సు దిగాకా స్కూటర్ మీద రయ్యిమని ఇంట్లో దింపితే, వీధిలోంచి వంటింట్లోకి రాకెట్లాగా దూసుకుపోయి యుద్ధ ప్రాతిపదిక మీద ఆయన కోసం వంటచేసి ఆదరా బాదరాగా ప్లేట్లో వడ్డించి పట్టుకెళ్తే నింపాదిగా టైమ్ చూసి 7 గంటలకి ఇంకొ రెండు నిముషాలు టైముందిగా, అప్పుడు పట్రా అనేవారు. ఆ రెండు నిముషాల్లో మళ్ళీ ఏవీ చల్లారిపోకుండా చూసుకోవాలి. అదే రెండు నిముషాలు ఆలస్యం అయ్యుంటే నన్ను అప్పటికి వదిలేసినా, అత్తగారికి మాత్రం ఫిర్యాదు వెళ్ళిపోయేది. ఇక ఆలస్యం అత్తగారివల్లయితే పాపం ఆవిడని ముక్కోటి దేవతలు ఏకమైనా కాపాడ లేరనుకోండి.
సోమవారాలు మా ఇంట్లో వాతావరణం మరీ వింతగా ఉండేది. అసలే సైలంటుగా ఉండాలి. ఇంక ఆరోజయితే ఏ వాతావరణ శాఖ కూడా చెప్పలేదు తుఫానెప్పుడొస్తుందో. మామ గారెప్పుడైనా ఉగ్రనరసింహ అవతారం ఎత్తటానికి సిద్ధంగా ఉండేవారు. అసలేం జరిగిందో మనకి తెలిసే లోపలే ఉరుములు, పిడుగులతో దడ దడా వర్షం పడిపోయేది. ఆ తరవాత సీను వరద బీభత్సం కన్నా కూడా లేడిని వేటాడి పులి వెళ్ళిపోయిన తరవాతి సీన్లా ఉంటుందంటేనే కరెక్ట్ గా ఉంటుంది.
ఆదివారమంతా రేపు సోమవారం, రేపు సోమవారం అని ఓ వందసార్లు అనుకునేవారు అత్తగారు. ఆ సోమవారాన్ని ప్రశాంతంగా నెట్టేయడానికి ఇంక కొద్ది సెకన్లల్లో పేలబోయే బాంబుని నిర్వీర్యం చెయ్యడానికి ఏవైరు కట్ చెయ్యాలో తెలియక, సిట్ ఆన్ ద ఎడ్జ్ ఒఫ్ ద సీట్ లాంటీ సినిమాలో హీరో పెట్టేంత టెన్షన్లో ఉండే వాళ్ళం. ఆ సీను ఆయన భోజనం అయ్యేవరకూ కంటిన్యూ అయ్యేది. ఇంక అప్పుదు కృత్రిమంగా గుండెకి రక్తం అందించి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసి మళ్ళా రోగి గుండె కొట్టుకుంటుంటే ఆపరేషన్ చేసిన డాక్టరు పొందే రెలీఫ్ లా ఉండేది. అప్పుడు మాత్రమే తెలిసేది గుండె లబ్ డబ్ అనే కొట్టుకుంటోందని. అంతవరకూ అదెన్నో వింత వింత చప్పుళ్ళు చేసేది మరి.
ఎక్కువ హడావిడి పడటం, కాస్త గోలగా అంటే కొద్దిగా గొంతు పెంచి అన్నమాట. అదే మనం చిన్నగా రహస్యం చెప్పుకుంటున్నట్లు మాట్లాడితే నేనంటే భయపడు తున్నారులే అని కనపడకుందా ముసిముసిగా నవ్వు కునేవారేమోనని మాకు అనుమానం. ఇక మేమే మాత్రం గొంతులు పెంచి మాట్లడటం జరిగినా ఆయన సహించరు గాక సహించరు. మా ఇంట్లో పక్క పోర్షన్లో అద్దె కుండే ఓ చిన్న కుటుంబంలో భార్యా భర్తలిద్దరూ కూడా చాలా పెద్ద పెద్ద గొంతులతో మాట్లాడేవారు. పైగా వారికి ఇంట్లోకి రావడానికీ పోవడానికీ పెరట్లోంచే దారి కాబట్టి, పొద్దున్నే చెట్లకింద చల్లని నీడలో ఆయన పేపర్ చదువుకుంటుంటే ఆవిడ పన్లు చేసుకుంటూ కబుర్లు చెప్తుండేది. వాళ్ళిద్దర్నీ చూస్తుంటే నాకు మా చిన్నప్పుడు మాపక్కింట్లో కాపురముండే అనంతపురం వాసులు గుర్తొచ్చే వారు.
ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ లేవు సరిగదా లాండ్లైన్ ఉండటమే గొప్పవిషయం. కాలనీలో ఓ ముగ్గురి నలుగిరి ఇళ్ళల్లో తప్పించి ఫోన్ సౌకర్యం ఉండేది కాదు. చెప్పొచ్చేదేంటంటే ఆవిడ ఫోన్లో అవతలివాళ్ళకి ఊకొడితే ఆరిళ్ళవతల వీధి చివరివరకూ వినిపించేది. ఇంక ఆవిడ ఏమన్నా చెపితే ఇంకో పదిళ్ళవతలికి వినపడేది. అప్పట్లో ఆవిడ పెద్దగా మాట్లాడుతుందని అనుకునేవాళ్ళం గానీ ఇప్పుడాలోచిస్తే, అప్పుడు నాయిస్ పొల్యూషన్ ఎంత తక్కువో మరి అని అనిపిస్తుంది. నా పెళ్ళయ్యాకా మళ్ళా అంత పిచ్ లో మాట్లాడే వీళ్ళని చూసాకా మళ్ళీ మా పుట్టింటి చుట్టుపక్కల్లో ఉన్నట్లనిపించేది నాకు. చెప్పొద్దూ మామగారికి మహా చిరాగ్గా ఉండేదనుకుంటా.
ఇక పనుల మీద హడావిడిగా మేమూ పెరట్లో తిరుగుతుంటే పలకరించి మాట్లాడుతుండేవారు. ఆవిడ మాటలకన్నా ఆవిడ రోజూ రోట్లో నూరే పచ్చళ్ళమీదే ఉండేది నా ధ్యాసంతా. మా పుట్టింటి ఇంటి వంటలో పులుపూ, కారం దండిగా ఉండేవి. రోజూ ఏదోక రోటి పచ్చడుండేది. వాక్కాయేంటి, వెలక్కాయేంటి, వంకాయ కాల్చి ఏంటి అమ్మ ఎన్నో రకాల పచ్చళ్ళు చేస్తుండేది ఎన్నో రకాల ఊర్గాయలుండగా కూడా. అలాంటిది ఇక్కడ ఎటువంటి పచ్చళ్ళూ తినరు, ఇక రోటి పచ్చడి ఉత్తిమాటే. ఒకవేళ ఎప్పుడన్నా ఉన్నా అందులో పులుపూ ఉండదు కారమూ ఉండదు. ఇంక దాన్ని పచ్చడి అని ఎలా అంటాం చెప్పండి. ఎంత తక్కువ పులుపంటే మామిడికాయ పప్పులో కాసిని ముక్కలు ఉడకపెట్టిన నీళ్ళు మాత్రం వేసేవారు అత్తగారు, నేను మనసులోనే లబలబ మొత్తుకునేదాన్ని. ముక్కలు వేద్దామండీ అంటే, అమ్మో ఇంకేమన్నా ఉందా అంత పులుపు మామయ్యగారు తినరు అనేవారు. నాకు ఒకసారి మా ఇంటి సంగతి గుర్తొచ్చింది. ఎండాకాలం వస్తే రోజూ మామిడికాయ పప్పు, అందులోకి నెయ్యి వేసుకుని కొత్తావకాయ నంచుకుంటే, అబ్బ అందుకని కాదుటండీ మండే ఎండలు కూడా రుచించేదీ. అదే అలవాటనుకుంటా ఇప్పటికీ మా ఆయన సాంబారులోకి, పులుసులోకీ కూడా చింతపండు ఎంత తగ్గించి వేసినా ఎక్కువయిందని గోల పెడతాడు.
అలా పచ్చళ్ళకి మొహం వాచి పోయిన నాకు మా పక్కింటావిడ భలే దొరికింది. రోజూ ఏదో ఒక పచ్చడి నూరేది, మెంతులూ, బెల్లం, ఇంగువ ఘుమ ఘుమలాడుతోంటే ఆ పచ్చడి నేనటు ఇటూ తిరుగుతూ పనిచేసుకుంటూ బేంక్ కి రెడీ అవుతూ ఆశగా రోటికేసి చూస్తూండేదాన్ని. ఆవిడకూడా పచ్చడి కోసం తపించిపోయే నా జిహ్వచూసి ప్రతిపూటా నాకు మాత్రం కాస్త ఓ చిన్న గిన్నెలో ఇచ్చేది.
మామగారికి నచ్చదని తెలిసినా నా నాలిక ను అదుపులో పెట్టుకోలేక పోయాను. చూసి చూసి ఒకరోజు నన్ను పిలిచి ఎందుకూ ఆవిడతో అన్ని కబుర్లు నువ్వు, పచ్చడి లంచం ఇచ్చి నిన్ను మంచి చేసుకోవాలనుకుంటోంది ఆవిడ తెలుసా అన్నారు. అయ్యో మామగారూ, నేనే ఆవిడను మంచి చేసుకుని పచ్చడి తీసుకుంటున్నాననిన్నీ చెప్పలేక మనసులోనే నవ్వేసుకున్నాన్నేను.
ఇక పండగ లొచ్చినపుడల్లా ఒకటైతే ఆనవాయితీ ఉండేది. మామూలుగా పండగంటే కాస్త అందరూ ఒకచోట చేరి చేసే సందడి, అల్లరి, కబుర్లు చక్క చక్కని పిండివంటల తోటి భోజనం కదా. ఎంత తక్కువ చేసుకున్నా, పులిహోర, పాయసం గారెలూ, అల్లం చట్నీనో, బూరెలో, బొబ్బట్లో ఉంటాయిగా, ఓ రెండు కూరలూ, పప్పూ, పులుసూ ఓ పచ్చడితోటి. మరి ఇవన్నీ చెయ్యడానికి తినేందుకు పట్టే టైమ్‌లో ఓ పదిరెట్లు ఎక్కువే పడుతుంది కదా. అవి ఒక్కరే చెయ్యలేరు కదా. ఒకరికంటే ఎక్కువ వంటింట్లో ఉంటే కొన్ని మాటలుంటాయా, కొన్ని జోకులో, కొన్ని సవరణలో ఉంటాయిగా మరి. ఏదన్నా లెక్క ఉండేదో ఎంటో, ఇక ఆయన కోపం సంగతి కూడ మేము మరిచిపోయినట్టు ఆయనకనిపించేదో ఏంటో, బాగా కాగి ఉన్న నూనెలో కారంపొడి వేసినట్లు భగ్గుమనేవారు. ఇంక ఇంటిల్లిపాదీ ఉక్కిరి బిక్కిరి అయిపోయేవాళ్ళు.
ఆయనకి ప్రియమైన చెల్లెలి భర్తా, బావమరిది ఒకరుండేవారు ఇంటికి దగ్గరలోనే. మామగారు వారి అమ్మకీ నాన్నకీ పెట్టే తద్దినాలకి ఆయనే భోక్త అన్నమాట. మామగారికి సుగర్ అని చెప్పానుగా, ఇన్సులిన్ కూడా తీసుకుని కార్యక్రమం ముగించుకుని సిద్ధంగా ఉండేవారు బోజనానికి. ఇక ఈయన టైమ్ సెన్సుకీ ఆయన చేసే ఆలస్యానికీ భలే సరిపోయేది. పాపం ఆయన్ని చూస్తే అచ్చం శంకరాభరణంలో అల్లూ రామలింగయ్య లాంటి అతి అమాయకమైన, ఎంత భయపెట్టినా శంకర శాస్త్రిని అమితంగా ప్రేమిస్తాడు చూసారా, అలాంటి కేరక్టర్ అన్నమాట. ప్రతీ తద్దినానికీ ఆలస్యంగా రావటమ్, చివాట్లు తిన్నాకే భోజనం చెయ్యడం ఒక ఆనవాయితీగా జరిగేది. ఆ తద్దినమంతా అక్కిడితో ముగిసేది. కాకపోతే మెచ్చుకోవాల్సిందేంటంటే ఇద్దరూ ఆ విషయం ఆ తరవాత మర్చిపోయేవాళ్ళు.
మామాగారితో భయంలేకుండా సమ ఉజ్జీలా మాట్లాడగలిగే వారొకరుండేవారు. ఆయన మామగారి మేనల్లుడు మొదట, తరవాత అల్లుడూనూ. ఆయనొక్కరే మామయ్యా ఏంటి కబుర్లు అంటూ మాట్లాడేవారు. ఓ రోజు ఓ తమాషా జరిగింది. మామాగారికి ఎవరైనా ఆరింటికల్లా ఇంటికి రావాలి, తొమ్మిదికల్లా పడుకోవాలి లైట్లార్పేసి కదా. కానీ అల్లుడుగారు కొంచం బిందాస్ అన్నమాట. పొరుగూరు నుంచి పని మీదొచ్చిన ఆయన తొమ్మిదవుతుండగా సినిమా కెళ్దామన్నారు. అసలు వట్టేసి చెప్తేనేగాని మీరు నమ్మరు, మా పెళ్ళయ్యాకా మేము రెండో ఆట మాట దేవుడెరుగు, మొదటి షో కూడా ఎప్పుడూ వెళ్ళలేదు, ఎందుకంటే తొమ్మిదింటికల్లా ఇంట్లో ఉండటం సాధ్యం కాదు కదా. అందుకని సినిమా కెళ్ళాలనిపిస్తే సెలవు పెట్టుకోవాల్సిందే.
ఏదో మొదట్లో సరదా పడి ఒకట్రెండు సినిమాలు అలా చూసాము. కాని రాన్రానూ అలా కుదరక సినిమాలకే దూరమయ్యాం ఓ పదేళ్ళకి పైగా. ఏదో భారతీయుడు, ప్రతిఘటన లాంటి సినిమాలు మరీ పాపులర్ అయ్యి చూడకపోవడమేదో విడ్డూరం, అపరాధం అయి కూర్చుంటే అప్పుడు చూసినట్లున్నాం అది కూడ బహుసా సెలవు పెట్టుకునే. అయితే పాపం మామగారు సెకండ్ షోకి వెళ్ళడం జరిగింది పెళ్ళికి ముందే.
సరే మా విషయం పక్కనపెడితే, అయిష్టంగానే అల్లుడి బలవంతం మీద మామగారూ ఆయనా కలిసి రెండో ఆటకి వెళ్ళారు. వెళ్ళిందీ ఏ సినిమా అంటే సత్యం శివం సుందరం. పైగా ఇద్దరూ అదేదో భక్తి ప్రాధాన్యమైన సినిమా అనుకున్నారు. పైగా భక్తి విషయానికొస్తే ఇద్దరూ కూడా భక్త కన్నప్ప అంత సీరియస్ భక్తులు. నిజానికి ఆ సినిమా నేను కూడా చూడలేదు, అయితే ఆ సినిమాకి జీనత్ అమాన్ ఎంత కాంట్రిబ్యూట్ చేసిందో నాకు తెలుసు. అదేదో వెంకటేశ్వర మహాత్మ్యం లాంటి సినిమా ఏమో అనుకున్న వీళ్ళకి పెద్ద షాకిచ్చిందా సినిమా. ఇక అర్ధరాత్రి ఇంటికొచ్చి ఆ సినిమా తీసిన వాళ్ళని, వేసిన వాళ్ళనీ, ఎరక్కపోయి వెళ్ళక వెళ్ళక రెండో ఆట, నిద్ర పాడు చేసుకుని మరీ అలాంటి సినిమా చూడాల్సివచ్చినందుకు శాపనార్ధాలు పెడుతూ ఇంటిల్లిపాదికీ శివరాత్రి జాగరణ చేయించి మరీ ప్రాయశ్చిత్తం చేసుకున్నారట.
ఇంకా చాలా చాలా నవ్వించే కధలు చెప్పాలండోయ్. మామగారిని గుర్తుంచుకోండేం. అలాగే మీ ఇంట్లోనూ మామగారిలాంటి పెద్దవాళ్ళుంటే వారి సంగతులు సరదాగా కామెంట్స్ లో పంచుకొండేం.
(శారద శివపురపు,రచయిత్రి, బ్లాగర్, బెంగళూరు)
శారదగారూ, మీ శైలి అద్భుతం. వంకాయ పచ్చడి అంటే గుర్తొచ్చింది. మా వూరు (ఇపుడు లేదు,ప్రాజక్టులో మునిగిపోయింది). వంకాయలకు, సన్నిమ్మకాయలకు ప్రసిద్ధి. మా వూరి వంకాయల రుచి ఏ వూరి వంకాయలకు రాదని మా ఆమ్మ ఇప్పటికి గొణుగుతూ ఉంటుంది. అక్కడ వంకాయలు మరీ విపరీతంగా దొరుకుతాయి కాబట్టి రోజూ భోజనంలో వంకాయ ఏదో ఒక రూపంలో ప్రత్యక్ష మయ్యేది. వంకాయ కారెం, వంకాయ పచ్చడి, నూనె వంకాయ, వంకాయ పప్పు, వంకాయ దబ్బలు, వంకాయ బేళ్ల పులుసు…ఎన్నిరూపాలో. మా వూర్లో ఉరగాయలు తక్కువే. రోటి పచ్చడే ఎక్కువ. మా వూర్లో ఒక కమ్యూనిటీ రోలు ఉండింది. ఆ బజార్లో ఉన్న వాళ్లంతా పచ్చడి నూరుకునేందుకు ఆ రోటి కాడికే వచ్చే వాళ్లు. అక్కడ వ్యవహారం ఒక తాయానా తెగేది కాదు. ఎవరిళ్లలో వాళున్నా, కారం నూరు కోవడానికి వచ్చినామెతో అలా మాట్లాడుతూ ఉండేవాళ్లు. ఈ రోటికాడ వంకాయ కారెం పాపులర్. వంకాయలు కాల్చి వేరుశనక్కాయలతో నూరే పచ్చడి ఒకరకం. వంకాయలు కాల్చి కేవలం రోంత కారెం పొడి, ఉప్పు ఉల్లిగడ్డ ముక్కలు చేత్తో నలిపి చేసే పచ్చడి మరొక రకం. ఇది ఎమర్జన్సీ పచ్చడి. నాకు తెలిసినంత వరకు అది పరాకాష్ట. చేత్తో నలిపి చేసే పచ్చడి రుచి ఎంత గొప్పగా ఉండేదో. ప్రాజక్టు వల్ల మా వూరు వొదిలి తలా ఒక దిక్కు పోయాం. అయితే, ఇప్పటికి నాకు అలాంటి వంకాయలు, ఆ వంకాయల రంగు, ఆ వంకాయల లేతదనం, ఆ వంకాయలతో చేసిన పచ్చడి రుచి ఎక్కడా కనిపించలేదు. ఒకసారి మా అమ్మను అడిగాను, ‘మన వంకాయలు ఎందుకు అంత రుచిగా ఉంటాయి’, అని. ఆమె చెప్పింది… ‘మన పెన్నమ్మ తల్లి గొప్పదనం అది. పెన్నా ఏటి నీళ్లతో ఏం పండించినా అంతే, అది రుచిగానే ఉంటుంది,’ అని
ధన్యవాదాలు అండి. ఏటి ఒడ్డున పండే వంకాయ రుచి నాకు తెలియదు కానీ, హైదరాబాదులో దొరికే వంకాయ రుచి మాత్రం నాకు తెలుసు. అలాంటి వంకాయలు బెంగలూర్లో అతి అరుదుగా దొరుకుతాయి. అందుకని హైదరాబాదు వెళ్ళినా, లేదా ఎవరైనా వస్తున్నా మేము కోరేది ఒకటో, రెండో కిలోల వంకాయలు తెమ్మని. ఇక వాటితో రకరకాల వంకాయ కూరలతో వంకాయ వారోత్సవాలు జరుపుకుంటాము.
Very good writing Sarada garu.
ఈ రచయిత్రి ఎవరోగాని చాలా దారుణంగా నోరూరించేలా వంకాయ రోటి పచ్చళ్ళ గురించి రాస్తే అది చదివిన పాఠకులు కొంత మంది మరీ ఓవర్ గా రెచ్చిపోయి వంకాయలతో వాళ్ళ వూళ్ళో ఎలాంటి రకరకాల పచ్చళ్ళు చేసుకు తినేవారో, ఎన్నెన్ని రకాల వంకాయలు దొరుకుతాయో , వాటిల్తో ఎలాంటి ఎలాంటి పచ్చళ్ళు చేసుకుతినొచ్చో అవి తింటూంటే ఇంక స్వర్గానికి బెత్తేడు దూరమే తెలుసా అని రాసి మా లాంటి భోజనప్రియుల ప్రాణాలు తినేసారు. అలాంటివి చదివి మా లాంటి
అర్భక పాఠకులు ఏమైపోవాలి?. వంకాయ రోటి పచ్చడి గురించి చదువుతోంటే ఓ టేబుల్ స్పూన్డు అమూల్యమైన లాలాజలం వేస్టయిపోయింది. నాకు అసలే వంకాయ అంటే పిచ్చి ఇష్టం. వారానికి ఓసారైనా వంకాయ గుత్తి కూర, వంకాయ పచ్చి పులుసు తినకపోతే రోజూ మందుకొట్టేవాడికి ఆ టైముకి మందు పడక పోతే ఎలా అల్లలాడిపోతాడో అలా అయిపోతాను.
ఇంక వుండబట్టలేక వంకాయ కాల్చిన రోటి పచ్చడి తినాలని వుంది , బజారుకెళ్ళి మాంఛి లేతొంకాయలు పట్టుకొస్తాను చేసి పెట్టవా అని మొహమంతా ప్రేమ పులుముకొని మా ఆవిడిని అడిగితే తినాలని అంతా కోరికగా వుందా ఎన్నో నెల ? అని పకపకా నవ్వింది. నా వుత్సాహం అంతా నీరుకారిపోయింది. నెమ్మదిగా గాలి పోతున్న బుడగలా అయిపోయింది నా మొహం. రచయిత్రిగారికి మరీ ఇంత శాడిజం పనికి రాదు. చేసేదేమీలేక “వంకాయ వంటి కూరయు,
శంకరుని వంటి దైవము”అని మనసులో పాడుకుని తృప్తి పడ్డాను.
Thanks a lot Surya Mohan garu for your hilarious comment. Looks like my writing activated the taste buds for Binjal curries and chutneys.
రచనా శైలి అద్భుతం. మామగారి సేవలో అప్పుడు ఎంత భయపడేవారో తెలియదుగానీ ఇప్పుడు మాత్రం రసవత్తరంగా, హాస్యాన్ని జోడించి పండిస్తున్నారు. మీ మామగారు మా పెద్ద నాన్నగారే అయిన, వారి time sense కొంత మాత్రమే తెలుసు. ఇప్పుడు తెలుస్తోంది సుమా. మీ ఇంటి ఆవరణ కళ్ళతో మళ్లీ దర్శనం అవుతోంది ….అంత మంచి వివరణ. ఈ కథలు ఎప్పటికీ దాచి వుంచుకోవలసిన నిధులు మాకు.
Thanks a lot Usha. All our memories of our elders when documented, are real treasures for future generations.
Yeppudo chinnappudu naku chala ishtamaina rachayitri BEENADEVI garu rasina kadha okati chadivanu.. Aa pustakam peru gurtu ravatledu.. Kani.. Ippatikii konni vakyalu gurtu vachhi navvistune untayi nannu..
Innella taravata malli antaga navvinchina kadha, anandam ichhina kadha.. Maa SHARADA raasina ee kadha.. (idi kadha kadu..anukondi) i love your style of writing..sharada.. Simple, straightforward nd funny…enjoyed it thoroughly.. Proud of you…
Thanks Vijji. So nice of you to be so liberal with your lovely words. Thanks again.