జగన్ సలహాదారులంతా ఇరకాటంలో పడ్డారా?

ఏకు అనుకున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మేకు అయ్యాడు. అసెంబ్లీలో  151 స్థానాలు గెల్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీని రమేష్ కుమార్ కలవర పెడుతున్నాడు. ఎన్నికలు జరప వచ్చని సుప్రీం కోర్టు తీర్పు వచ్చాక రాష్ట్రం ప్రభుత్వంలో అంతవరకు తిరుగుబాటు శంఖారావం వూదిన వాళ్లంతా సరెండర్ అయ్యారు. ఉద్యోగులంతా గమ్మున ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. పోలీసు అధికారులు,జిల్లా కలెక్టర్లు  అంతా దారి కొచ్చారు. అంతేకాదు, కమిషనర్ ఎపుడు ఏ చర్య తీసుకుంటారో ననే భయం అధికారులందరిలో మొదలయింది.కేంద్రం నుంచి నిమ్మగడ్డకు మద్దతు ఉందా,లేకపోతే, ఇలా విజృంభించడం సాధ్యమా అనే అనుమానం మొలకెత్తింది.

ఎన్నికలు సక్రమంగా జరిపి మంచి మార్కులు తెచ్చుకునేందుకు కలెక్టర్లు ఎస్ పిలు పోటీపడుతున్నారు. ఎన్నికలు మోసాలు అరికట్టేందుకు,మద్య ప్రవాహం అరికట్టేందుకు హెల్ప్ లైన్లు పెడుతున్నారు. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంటు బృందాలు ఏర్పాటు చేస్తున్నారు.

పంచాయతీరాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లతో నిర్బంధ పదవీ విరమణ చేయించాలని కమిషనర్  సిఫార్సు చేయడం ప్రభుత్వం యంత్రాంగంలో భూకంపం సృష్టించింది.దీనితో  రాష్ట్రంలో సీనియర్ అధికారులంతా వణికిపోతున్నారు. మాజీ చీఫ్ సెక్రెటరీ ఎల్ వి సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకుని ఈ సిఫార్సు ను ఉపసంహరింపచేశారని చెబుతారు.

రూలింగ్ పార్టీ అండతో రాజ్యాంగ నియమాలకు  వ్యతిరేకంగా వెళితే, వెళ్లినంత కాలం బండి సజావుగానే వెళ్లవచ్చు, అయితే ఎక్కడైనా ఎపుడైనా కథ అనుకోని మలుపు దగ్గిర అడ్డం తిరుగవచ్చు. ఈ బెణకు ఇపుడు అధికారుల్లో సర్వత్రా కనిపిస్తుంది.

రెండూ మూడు సార్లు డిజిపి కోర్టు దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఏ కేసులో ఎవరినైనా కోర్టు సమ్మన్ చేయవచ్చుగా అని అంటున్నారు.

చివరకు ఎన్నికల వాతావరణం ఇలా సానుకూలంగా మారుతుందని ఎవరూ వూహించలేదు. ముఖ్యంగా అధికారులెవరూ వూహించలేదు.

కమిషన్ కు, ప్రభుత్వానికి ఘర్షణ ముదురు తుందునుకున్నారు గాని కథ కంచికి పోతుందని, రమేష్ కుమార్ ఎన్నికలను ఇలా టిఎన్ శేషన్ లాగా నిర్వహిస్తారని వూహించనే లేదు.

ప్రభుత్వోద్యోగుల, కలెక్టర్ల, ఎస్ పిల, పోలీసుల సహాయ నిరాకరణతో వూపిరాడక పెట్టెబేడే సర్దుకుని కమిషనర్ రమేష్ కుమార్ హైదరాాబాద్ పారిపోతాడని అనుకున్నారు. చాలా మంది ఐఎఎస్ అధికారులు, ఐపిఎస్ అధికారులు వూహించుకున్నది తప్పయింది.  అధికారులంతా మొత్తానికి  ఎక్కడో తప్పుజరుగుతోందన్న ఒక ఆలోచనలో పడ్డారు.

ఈ పరిణామాల మీద ముఖ్యమంత్రి జగన్ బాగా అసంతృప్తితో ఉన్నట్లు వినపడుతూ ఉంది. ఈ పరిస్థితి వచ్చేందుకు కారణం చుట్టూ వున్న సలహాదారులేనని ఆయన సలహా దారులమీద, క్యాబినెట్ సన్నిహితుల మీద ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది.

ఎందుకంటే, రెండేళ్ల లోనే ఇంత ఎదురు దెబ్బ తగలడమేమిటి?  కొర్టుల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు లొచ్చినా, అది బహిరంగంగా సమస్య సృష్టించలేదు.

తీర్పుల ప్రభావం తన  కార్యక్రమాలను పెద్దగా ఆపేయలేదు. తన పర్యటలను రద్దు చేసుకోలేదు. ఏకచ్ఛత్రాధిపత్యంతో సాగుతున్న పరిపాలను స్తంభింప చేయలేదు. కాని, ఒక రిటైర్డు అధికారి, ఎన్నికల కమిషనర్ రూపంలో ఈ పని చేయిస్తున్నాడు.

మొన్న అనంతపురం కదిరిలో ముఖ్యమంత్రితో ప్రారంభించాల్సిన ఇంటింటికి రేషన్ కార్యక్రమాన్నిప్రభుత్వం రద్దు చేసుకోవలసి వచ్చింది. ఇంత మెజారిటి తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఇలా ఒక అధికారితో పేచీ పెట్టుకుని,  సుప్రీంకోర్టు నుంచి ప్రతికూల తీర్పు వినాల్సి రావడానికి కారణం,  చుట్టూర ఉన్న సలహాదారులెవరూ సరిగ్గా పరిస్థితిని, కమిషన్ రాజ్యాంగ హోదాని అంచనా వేయలేకపోవడమేనని జగన్ భావిస్తున్నట్లు ఒక వర్షన్ రాజకీయ వర్గాల్లో వినబడుతూ ఉంది.

కొంతమంది సలహాదారుల మీద, క్యాబినెట్ మంత్రుల మీద జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వినబడుతూ ఉంది.

జగన్ ను సంతృప్తి పరిచేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని  ఎలాగైనా కట్టడి చేసేందుకు ప్రివిలేజ్ మోషన్ తెస్తున్నారని, ఇది చివరి అస్త్రమని చెబుతున్నారు.

అదీ పారకపోతే, పంచాయతీ ఎన్నికల తర్వాత కొన్ని తలకాయలు లేచిపోతాయని అనుకుంటున్నారు. తన చుట్టూర ఉన్నవాళ్లు అంతా బాగున్నపుడు అంటే  శాంతికాలంలో సలహాలిచ్చే వాళ్లే తప్ప సంక్షోభం, యుద్ధ సమయంలో సలహాలిచ్చేందుకు పనికిరారని జగన్ గమనించేందుకు ఒక రెండు వారాలు పడుతుంది.

ఈ మధ్యలో  జగన్ ని శాంతింప చేసేందుకు తిట్ల యుద్ధానికి పూనుకున్నారని చెబుతున్నారు.

ఈ  సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు,  తాజాగా లక్ష్మిపార్వతి రమేష్ కుమార్ మీద దాడి చేసేందుకు కారణం జగన్ ఆగ్రహమే నని అంటున్నారు.

నిమ్మగడ్డ ఇదేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకు పోతున్నారు.

పైకి  రాజ్యంగం ఉత్తి  కాగితపు ముక్కే.  వాడితే  అదే ఆ కాగితంతో కత్తి చేయవచ్చని, యుద్ధానికి వాడుకోవచ్చని వాడిన వాళ్ల కే తెలుసు. అయితే, కాగితాపు రాజ్యంగాన్ని కత్తిలా వాడాలనుకునేవాళ్లు, అధికారుల్లో బాగా తక్కువ. అంతా  పవర్ తో. మంచి పోస్టింగులతో సర్దుకు పోయి పదికాలాలు చల్లగా ఉండాలనుకుంటారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *