జగన్ డ్రీమ్: ఆంధ్రలో ప్రతి గ్రామాన ఇంటర్నెట్ లైబ్రరీ

అమరావతి: వచ్చే మూడేళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయాన్ని అన్ని గ్రామాలకూ వసతి కల్పించే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతూ ఉంది.   ఇంటర్నెట్ లెేకుండా అభివృద్ధి సాధ్యం కాదని రాష్ట్రంలో ఇంటర్నెట్ అందుబాటులో లేని గ్రామమనేది కనిపించరాదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అధికారులకు సూచన లిచ్చారు. ప్రతి గ్రామంలో ఒక ఇంటర్నెట్ లైబ్రరీ ఉండాలని , గ్రామానికి అంది ఒక  ముఖ్యమయిన కేంద్రం కావాలని ఆయన చెప్పారు.

గ్రామంలో ఎవరైనా సరే ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా ఈ ఇంటర్నెట్ లైబ్రరీని  తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు. కోవిడ్ అనంతరం వస్తున్న మార్పులను దృష్టిలో  పెట్టుకుని ‘వర్క్‌ ఫ్రం హోం’ కు  వీలుగా కూడా  గ్రామాలు తయారు కావాలని జగన్ చెప్పారు.

ఈ-లైబ్రరీ కోసం  సొంత భవనం కూడా కట్టాలని, దీనికి  కార్యాచరణ రూపొందించాలని జగన్  ఆదేశించారు.

గ్రామంలోని సచివాలయాలు, ఆర్బీకేలు అన్నీ కూడా ఇంటర్నెట్‌తో అనుసంధానం కావాలని ఇంటింటా  ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండేలా సహకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఐటీ-ఎలక్ట్రానిక్‌ పాలసీపై శుక్ర‌వారం జరిగిన ఒక సమావేశంలో   ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  మాట్లాడుతూ ఈ సూచనలు చేశారు.

విశాఖపట్నం, తిరుపతి, బెంగుళూరు సమీపంలో మరొక చోట మొత్తం మూడుచోట్ల కనీసం 2 వేల ఎకరాల విస్తరణలో ఐటీ కాన్సెప్ట్‌ సిటీలను ఏర్పాటు  చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

ఈ కాన్సెప్ట్ ‌సిటీల్లో మౌలిక సదుపాయాలు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలని  నిర్మాణంలో  ఈ కాన్సెప్ట్ సిటీల ఆర్కిటెక్చర్‌ యునిక్‌గా ఉండాలని, ప్రతి కాన్సెప్ట్‌ సిటీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన మాస్టర్‌ ప్లాన్‌  తొందరగా రూపొందించాలని ఆయన అధికారులకు సూచన లిచ్చారు

ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ యూనివర్శిటీ …

విశాఖలో ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ యూనివర్శిటీ ఏర్పాటు విషయం మీద కూడా సమావేశం చర్చ జరిగింది.  యూనివర్శిటీలో రోబోటిక్స్, ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీస్, డేటా అనలిటిక్స్‌ సైన్సెస్, అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రానిక్స్, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటివనరులు తదితర రంగాల్లో ఐటీ అప్లికేషన్లపై బోధన, పరిశోధన లక్క్ష్యంగా ఉండాలని అన్నారు.

దేశంలోని ప్రఖ్యాత ఐఐటీ సహా వివిధ సాంకేతిక సంస్థల్లోని నిపుణులు దీనిపై త్వరలోనే నివేదిక సమర్పించనున్నారని  అధికారులు  ముఖ్యమంత్రికి వెల్లడించారు.

సాంకేతిక విద్యను అభ్యసించిన వారికి నైపుణ్యాలను మెరుగు పరిచేందుకూ ఈ యూనివర్శిటీ ఉపయోగపడాలని,  యూనివర్శిటీ సహా ఐటీ సంబంధిత విభాగాలన్నీ ఒకే చోట ఉండాలని తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *