(పరకాల సూర్యమోహన్)
భారత దేశంలో వేల సంవత్సరాల క్రితమే స్త్రీలను పూజించి, గౌరవించి వారికి ఉన్నత హోదా కల్పించిన సంప్రదాయం ఉంది.
ఒక రాజు అధికార దర్పంతో తాను మోహించిన కన్యని ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతంగానైనా పెళ్ళిచేసుకోవాలని ప్రయత్నించినప్పుడు ధిక్కరించి అగ్ని ప్రవేశం చేసి, ప్రాణత్యాగం చేసి వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిగా కోట్లాది మంది భక్తుల పూజలు అందుకుంటున్న ఒక కన్య యదార్థ చరిత్ర మనం విన్నదే. ఈ అమ్మవారి ఆలయాలు చాలా చోట్ల ఉన్నాయి. ప్రసిద్ధి కెక్కాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో వెలసిన శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం వాటిలో విశిష్టమైనది.
ఈ ఆలయ స్థాపన వెనుక అమ్మవారి మహత్తరమైన విషయం వుంది. మనం పైన చెప్పుకున్న ఆ యదార్థ సంఘటన సంభవించింది ఈ పెనుగొండలోనే.
నేను సేకరించిన సమాచారం ప్రకారం క్రీ.శ,10, 11 శతాబ్దాల కాలంలో వైశ్యుల రాజు కుసుమ శ్రేష్టి తన 18 పరగణాలకు పెనుగొండను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ వుండేవాడు .ఈ ప్రాంతం అంతా వేంగి దేశంలో అంతర్భాగం. వేంగి దేశాన్ని 7వ విష్ణు వర్థనుడు (విమలాదిత్య మహారాజు) పరిపాలిస్తున్న కాలం అది.
కుసుమశ్రేష్టి, కుసుమాంబ దంపతులకు ఇద్దరు పిల్లలు— ఒక కుమారుడు, కుమార్తె కుమార్తె పేరు వాసవి. ఆమె అపురూప సౌందర్యవతి. ఆమె అన్ని కళల్ని అభ్యాసించింది. సంగీతం, తర్క శాస్త్రాల పట్ల మక్కువ కనపర్చేది. యుక్త వయస్సు రాగానే ఆమెకు వివాహం చేయడానికి తలిదండ్రులు తగిన వరుడికోసం అన్వేషణ ప్రారంభించారు.
ఇది ఇలా వుండగా, సామ్రాజ్య విస్తరణ కోసం దండ యాత్రలు జరుపుతూ ఒక సారి విష్ణువర్థనుడు తన సైన్యంతో పెనుగొండ పొలిమేరల్లో మకాం చేసారని తెలుసుకొని కుశుమ శ్రేష్టి ఆ రాజుగారిని సకల మర్యాదలతో నగరానికి తీసుకువెళ్ళి వూరి ప్రజల సమక్షంలో ఘనసన్మానం ఏర్పాటుచేస్తాడు.
ఆ జన సమూహంలో అపురూప సౌందర్యంతో మెరిసిపోతున్న వాసవి పై విష్ణువర్థనుడి దృష్టి పడుతుంది. తొలి చూపులోనే మోహపరవశుడైన ఆ రాజు ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని తన మంత్రితో కబురు పెడతాడు.
రాజగారి కోరిక విని కుశుమశ్రేష్టి నిశ్చేష్టుడవుతాడు. రాజుగారు అప్పటికే వివాహితుడు. వయస్సులో తన కూతురు కన్నా బాగా పెద్దవాడు. ఆయన క్షత్రియుడు, తాను వైశ్యుడు. ఏమీ చేయలేని, చెప్పలేని నిస్సహాయ స్థితిలో కుమిలిపోతున్న కుశుమశ్రేష్టిని చూసి ఆయన బంధుమిత్రులు అంతా ఆ నిర్ణయాన్ని వాసవికే వదిలివేయమని సలహా ఇస్తారు.
తాను జీవితాంతం కన్యగానే వుంటాననీ , ప్రాపంచిక విషయాలతో తనకు సంబంధం లేదని వాసవి స్పష్టంచేస్తుంది. ఇదే విషయాన్ని కుశుమశ్రేష్టి రాజుగారికి తెలియ జేయగానే ఆయన విపరీతంగా ఆగ్రహించాడు. బలవంతంగా నైనా వాసవిని తీసుకురమ్మని తన సైన్యాన్ని పంపుతాడు. అయితే వైశ్యులంతా ఎంతో ఐకమత్యంతో ప్రతిఘటించి రాజుగారి సైన్యాల్ని తరిమి కొడతారు.
ఇది ఇలావుండగా, కుశుమశ్రేష్టి భాస్కరాచార్యుల అనే పండితుడి సమక్షంలో 18 పరగణాలలోని 714 గోత్రాలకు చెందిన వైశ్య ప్రముఖులతో ఈ విపత్కర పరిస్థితిని చర్చించాడు. అక్కడ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి.
102 గోత్రాలకు చెందిన ముఖ్యులు రాజుగారికి తమ కులానికి చెందిన పిల్లని ఇవ్వరాదనీ, రాజుగారిని ఎదిరించి వీర మరణానికైనా సిద్ధపడాలని అభిప్రాయపడతారు. మిగిలిన 612 గోత్రాల ముఖ్యులు మాత్రం రాజు గారితో కయ్యం వద్దనీ, వియ్యమే అందరికీ శ్రేయస్కరం అని అభిప్రాయ పడతారు.
దీనితో వైశ్యుల ఐకమత్యం దెబ్బతిన్నా సరే రాజుగారిని ఎదిరించి తమ కుల గౌరవాన్ని కాపాడుకోవాలని పెనుగొండలోని 102 ‘గోత్రాల వారు కుశుమ శ్రేష్టి నాయకత్వంలో సంసిద్థమవుతారు.
దెబ్బ తిన్నపాములా పగపట్టిన విష్ణువర్థనుడు తన యావత్తు సైన్యాన్ని సమీకరించి పెనుగొండ మీద విరుచుకు పడటానికి సిద్ధం అవుతూ వుంటాడు.
ఈ విషయం తెలుసుకున్న వాసవి తన తండ్రి వద్దకు వచ్చి, “ఒక కన్యకోసం ఎందుకు అనేక మంది రక్తం చిందించాలి? యుద్ధం అనే ఆలోచనను విరమిద్దాం.దీనికి బదులు మరో వినూత్న మార్గాన్ని అవలంబిద్దాం. అహింసా మార్గంలో ఆత్మ త్యాగానికి నేను సిద్థమవుతాను. దృడసంల్పం, పట్టుదలవున్నవారు మాత్రమే నాతో రావాలి,” అని నచ్చజెపుతుంది.
వాసవి చేసిన సూచనల ప్రకారం గోదావరి తీరాన, బ్రహ్మ కుండం అనే పవిత్ర ప్రదేశంలో కుశుమశ్రేష్టి సైనికులు 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేస్తారు. తనతో బాటు అక్కడికి చేరుకున్న 102 గోత్రాల జంటలను ఉద్దేశించి ” మీరంతా నాతో బాటు మంటలలో దూకడానికి సిద్థంగా వున్నారా,” అని వాసవి అడుగుతుంది. వారంతా ‘తాము సిద్థమే’ అని చెప్పగానే వాసవి దేశభక్తి ,నిజాయితి, సమాజ సేవ , సహనం గురించి వివరిస్తుంది. ఆ తరువాత వారంతా ఇష్టదైవాల్ని స్మరిస్తూ అగ్ని గుండంలో దూకి ఆత్మ బలిదానం చేస్తారు.
అయితే దీనికి సంబంధించి ఒక పురాణ గాథ కూడా ప్రచారంలో వున్నట్టు అనేక పుస్తకాలలో పేర్కొనడం జరిగింది.
తనతో బాటు అగ్నిప్రవేశం చేయడానికి తమ సంసిద్థతను తెలియజేసిన 102 గోత్రాల జంటలు ఆమెను ఒక దేవతాంశగా భావించి నిజస్వరూపం చూపమని వాసవిని కోరారు. అందుకు ఆమె అనుగ్రహించి తన నిజస్వరూపాన్ని చూపించి తాను ఆది పరాశక్తి ఆర్య మహాదేవి అవతారమనీ, ధర్మాన్ని నిలిపేందుకు, స్త్రీ ల గౌరవాన్ని కాపాడేందుకూ , విష్ణువర్థనుడిని అంతమొందించేందుకూ, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకూ తాను కలియుగంలో జన్మించానని పేర్కొన్నట్టు పురాణ గాథలు ప్రచారంలో వున్నాయి.
వాసవి ఆత్మ బలిదానం గురించి తెలియని విష్ణువర్థనుడు తన సైన్యాలతో పెనుగొండ పొలిమేరలకు చేరుకోగానే వేగులు హుటాహుటిన ఆయన వద్దకు వెళ్ళి వాసవి , ఆమె అనుచరులు మంటల్లోకి దూకి ఆత్మాహుతి చేశారని చెబుతారు. దాంతో ఆయన గుండె పగిలి అక్కడికక్కడే చనిపోయాడని చెబుతారు.
విష్ణువర్థనుడి కుమారుడు రాజ రాజ నరేంద్రుడు జరిగిన సంగతి తెలుసుకుని విలపిస్తూ పెనుగొండ చేరుకుని అందరికీ క్షమాపణ చెబుతాడు. విరూపాక్షుడు తన సోదరుడిని ఓదార్చి భాస్కరాచార్యుల సూచన మేరకు ఆయన కాశీ, గయ పుణ్యక్షేత్రాలను సందర్శించి తిరిగి వస్తాడు. పెనుగొండను ఒక పుణ్య క్షేత్రంగా చేయడానికి అక్కడ అందరి గోత్రాలకు చిహ్నంగా శివలింగాలను ప్రతిష్టిస్తాడు. వాసవి గౌరవార్థం నరేంద్రుడు ఆమె విగ్రహాన్ని ప్రతిష్టిస్తాడు. అప్పటినుంచి, వైశ్యులందరూ వాసవి కన్యకా పరమేశ్వరిని తమ కుల దేవతగా పరిగణించి పూజించసాగారు.
స్త్రీ ల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఆత్మ బలిదానం చేసిన మహోన్నత స్త్రీ మూర్తిగా ఆమె, చరిత్రలో అజరామరంగా, వైశ్యుల మనసులలో ఒక విజేతగా, అహింసకు, శాంతికి ప్రతీకగా ఆమె నిలిచిపోయింది.
పెనుగొండ లోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం గాలిగోపురం ఏడు అంతస్తులతో హరివిల్లులా, శోభాయమానమైన వాస్తురీతులతో అలరారుతూ వుంటుంది.
పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీగా పరిగణిస్తారు.
ఆలయంలోకి అడుగు పెట్టగానే రెండు నంది విగ్రహాలు, పెద్ద ధ్వజస్తంభం, దాని ముందు నల్లరాతితో చెక్కిన నాగ విగ్రహం కనిపిస్తాయి. విశాలమైన ప్రాకారంలో ప్రదక్షిణ చేసి రాగానే ముందుగా వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది.
ప్రధాన మండపంలో మూడు గర్భగుడులు వరుసగా కనిపిస్తాయి. ఒక దానిలో ఈశ్వరుని విగ్రహం, ఎడమ వైపున మహిషాసురమర్దిని విగ్రహం కనిపిస్తాయి. ఈశ్వరుని విగ్రహానికి కుడివైపున వాసవి దేవి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ కొలువైవుంది.
లక్ష్మీ జనార్థన స్వామి క్షేత్ర పాలకుడిగా వున్న ఈ క్షేత్రం లో దసరా ఉత్సవాలు కనుల పండువగా జరుగుతూ వుంటాయి. ఈ ఉత్సవాల్ని కన్నులారా తిలకించేందుకు భక్తులు దేశం నలుమూలల నుంచి ఇక్కడకు వస్తూ వుంటారు.
ఏటా వేల సంఖ్య భక్తులు ఆ క్షేత్రం సందర్శిస్తూఉంటారు. వారికి వసతి సౌకర్యాలు కలుగ జేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇది ఇలా ఉంటే ఈ మధ్య శ్రీమతి సుభాషిణి, యస్.రామ్మూర్తి ఈ ఆలయానికి సమీపంలోనే 9 ఎకరాల విస్తీర్ణం లో, దాతల సాయంతో కోట్ల వ్యయంతో అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధునిక రీతిలో ఒక బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించారు.
ఎలా చేరుకోవాలి: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ కి ఆర్టీసీ బస్సులు, ట్రైన్ సౌకర్యాలు ఉన్నాయి నిడదవోలు, తాడేపల్లి గూడెం,తణుకు రైలు స్టేషన్లలో దిగి బస్ లలో గాని ఆటోల్లో గాని పెనుగొండ చేరుకోవచ్చు.
అదొక అపూర్వమైన, అబ్బుర పరచే రూపకల్పన. ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే 90 అడుగుల ఎత్తైన వాసవి మాత పంచలోహ విగ్రహం భక్తులకు అభయం ఇస్తూ దర్శనమిస్తూ కనిపిస్తుంది.
ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం అని చెబుతారు. దాదాపుగా 65 టన్నుల బరువుతో ఈ విగ్రహం ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పవచ్చు. ఇంత ఎత్తైన విగ్రహం ఎటువంటి సపోర్టు లేకుండా కేవలం రెండు కాళ్ళమీదే నిలబడి వుండటం మరొక అద్భుతం. ఈ 90 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించడానికి గర్భగుడిని 180 అడుగుల ఎత్తున నిర్మించారు. ఇటువంటి రూపకల్పన వున్న అమ్మవారి ఆలయం ప్రపంచంలో మరెక్కడా లేదని చెబుతారు.దీనిని 2019 ఫిబ్రవరిలో ఆవిష్కరించారు.
గర్భగుడి నిర్మాణం కూడా ఒక అద్భుత ఇంజనీరింగ్ విన్యాసం.
భూకంపాలను తట్టుకునేలా నిర్మించారు.
ప్రత్యేక ఉత్సవ సమయంలో భక్తులు లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళి పవిత్ర జలంతో, పుష్పాలతో మహా మస్తకాభిషేకం జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ పుణ్య క్షేత్రాన్ని దర్శించడానికి వేల, లక్షల సంఖ్య లో దేశం నలుమూలలనుంచి తరలి నచ్చే భక్తుల కోసం ఇక్కడ భోజన వసతి సౌకర్యాలు వున్నాయి.
భక్తులు అతి నామమాత్రపు అద్దె చెల్లించి ఇక్కడ గదులలో బస చేయవచ్చు. ఉదయం పలహారం, మధ్యాహ్నం భోజనం భక్తులకు ఉచితం. త్వరలో వృద్థులకోసం ఆశ్రమం, ఉచిత వైద్యశాల నిర్మించవచ్చని తెలుస్తోంది.
అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ ట్రస్ట్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం బెంగుళూరులో వుంది.
శ్రీ వాసవీ అమ్మవారి ఆలయాలు: పెనుగొండతో బాటు దేశంలో వివిధ ప్రాంతాలలో కూడా అమ్మవారి ఆలయాలు ఉన్నాయి అవి : కల్వకుర్తి, షిమోగ, చెన్నై, ప్రొద్దుటూరు, తాడాపత్రి, బైరెడ్డి పల్లి, బెంగుళూరు, కోలార్, బళ్ళారి, అనంతపురం జిల్లా పెనుకొండ, హిందూపురం, హైదరాబాద్, మాచర్ల, జమ్మాలమడుగు.
ఆర్య వైశ్య సత్రాలు: శ్రీశైలం,పుటపర్తి, తిరుమల, మంత్రాలయం, మహానంది, విజయవాడ ,అన్నవరం, వేముల వాడ, అహోబిలం, యాదగిరి గుట్ట, భద్రాచలం, బాసర,మొదలైన ప్రదేశాలలో ఆర్య వైశ్య నిత్యాన్నదాన సత్రాలు వున్నాయి.
(గమనిక: వివిధ వైబ్ సైట్ నుంచి సేకరించిన సమాచారం, పరిచయం వున్న వైశ్య ప్రముఖులు అందించిన అమూల్యమైన సమాచారం ఆధారంగా ఈ వ్యాసం రాయడం జరిగింది. అయినప్పటికీ ఇది సమగ్రం కాదు. నాకు తెలియని, నా దృష్టికి రాని సమాచారం ఇంకా ఎంతో వుండవచ్చు. ఎవరి మనోభావాలను కించ పరచడం నా ఉద్దేశ్యం కాదు. పొరపాట్లు దొర్లితే క్షంతవ్యుడిని. ఈ వ్యాసం పరమోద్దేశ్యం పాఠకులకు ఈ పుణ్యక్షేత్రం గురించి నాకు తెలిసిన విశేషాలను అందించడం. పాఠకులు సదుద్దేశంతో అర్థం చేసుకో గలరని ఆశిస్తున్నాను. ఇందులో కొన్ని ఫొటోలు నేను తీసినవి వున్నాయి. నేను అడిగిన వెంటనే పెనుగొండ ఆలయాలకు వెళ్ళి ఎన్నో అద్భుతమైన ఫొటోలు తీసి పంపిన నా మిత్రులకు కృతజ్ఞతలు. -రచయిత )
(పరకాల సూర్యమోహన్, జర్నలిస్టు, చెన్నై)
It’s nice to know the history of the place. But I was intrigued by the fact that to avoid war n bloodshed she resorted to self immolation but why then so many others along with her. Well it’s history and can’t be changed, but saddening even today such incidents happen to women and history repeats itself.
వాసవీ కన్యకాపరమేశ్వరి పేరు వినడమే గానీ ఎప్పుడూ ఈ గుడికి వెళ్ళలేదు. బయట నుంచి పెనుగొండ గుడి ఒకసారి చూసాను. మీ ద్వారా చరిత్ర తెలిసింది. ఒకడి కోరికకు ఇంతమంది బలి అవ్వడం విచారకరం. బయట ఎత్తైన విగ్రహం చాలా అందంగా వుంది. Next time definitely I will visit this temple. Thank you for the excellent article.
బాగుంది బావ గారు..
Very nice and informative article
నేను మూడు ప్రముఖ ’అమ్మవారిశాల‘ ల మధ్య పెరిగాను. రాయలసీమలో కన్యకా పరమేశ్వరి ఆలయాలను ‘అమ్మవారిశాల’ అొంటారు. ఇందులో ఒకటి ప్రొద్దుటూరు, రెండోది జమ్మలమడుగు, మూడు తాడిపత్రి. మీరు రాసిన వివరాలు చదివాక పెనుగొండ విశేషం చూడాలనిపిస్తూ ఉంది. ఎలాగూ తొందర్లో కవిటం ప్రోగ్రాం ఉందిగా. అపుడే ఈ పని కానిస్తాం. ధన్యవాదాలు, సూర్యమోహన్ గారూ, మంచి విశేషాలు చెప్పారు.
An elaborate real story that takes us to a real tour. Visited the temple in 2019. Excellent architecture and a huge idol of Kanyaka.