రైతు సంఘాలకు రాజ్యం పెడుతున్న పరీక్ష…

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

కల్లోల కడలిలో విరిగిపడ్డ పెను కెరటం, క్షణాలలోనే తిరిగి ఎగిసిపడే రీతిలో నేడు రైతాంగ పోరు సాగుతోంది. అది వరసగా నేడు పలు విజయాల్ని సొంతం చేసుకుంటూ పురోగమిస్తోన్నది. అది అట్టి విజయాల జాబితా లో నేడు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోగలిగింది. అదే రాజ్యం చేత ఢిల్లీ రైతు ధర్నాల చుట్టూ నేడు నిర్మాణమౌతోన్న తాజా కాంక్రీట్ బారికేడ్ల వ్యవస్థ!

ఇప్పటివరకూ రైతాంగ ఉద్యమ సంస్థలతో రాజ్యం ఓ బృహత్తర నాటకం ఆడుతూ వచ్చింది. అందులోని వివిధ అంకాలు గతించాయి. మరో కొత్త అంకంలోకి యీ నాటకం చేరుతోంది. అదెలాగో అంశాల వారీగా టూకీగా చూద్దాం.

1 “మీ రైతు సంఘాలు చలో ఢిల్లీ పిలుపు ఇస్తే ఇవ్వొచ్చు. కానీ పంజాబ్ నుండి ఢిల్లీకి వచ్చే దారుల్లో అడుగడుగునా మా రాజ్యం విధించే ఆటంకాల్ని కాదని మీరు రైతాంగాన్ని ఢిల్లీకి ఎలా రప్పించ గలరు?”
(ఇది రైతు సంఘాలకు రాజ్యం పెట్టిన పరీక్ష! అలాంటి పరీక్షలో ఉత్తీర్ణత ని సాధించి రైతాంగం ఎట్టకేలకు ఢిల్లీకి బోర్డర్లకి చేరింది)

2 “మా రాజ్యానికి ప్రాణ సమానమైన సరుకుల రవాణా కి ప్రాణాధారమైన జాతీయ రహదారుల వద్దకి చేరి నిలిచిన మీ రైతాంగాన్ని సింఘు, టిక్రీ బోర్డర్ల నుండి ఖాళీ చేయించి, డిల్లీ సరిహద్దుకి బయటనున్న బూహారీ గ్రౌండ్ కి తరలించండి”
(బుహారీ గ్రౌండ్ వసతిని రైతు ప్రదర్శకులకి ఉదార బుద్ధితో కల్పించే రాజ్య ఉదార ముసుగు సైతం ఊడిపోయింది)

3 “గడ్డకట్టే చలిలో రైతులతో మీ రైతు సంఘాలు అలా ధర్నా చేయించితే, అసలు సమస్య ఎలా కొలిక్కి వస్తుంది? మీకు మా ప్రభుత్వం ఉదార రాజనీతి తో పలికే ఆహ్వానం స్వీకరించి, మాతో చర్చలకు రండి”
(రైతునేతలది మొండివైఖరిగా నిరూపించే ఈ రాజకీయ రాజ్య లక్ష్యం కూడా విఫలమైనది)

4 “మా ప్రభుత్వ దౌత్యం ద్వారా పరిస్కారం సాధ్యం కాదనే భావం ఒకవేళ మీ రైతాంగ ఉద్యమ సంస్థలలో ఏర్పడితే, మనందరికీ ఎంతో శిరోధార్యమైన సుప్రీంకోర్టు ద్వారా మధవర్తిత్వ పరిస్కారం కై ముందుకు రండి. అంతే తప్ప, రోడ్ల దిగ్బంధనాన్ని నిరవధికంగా కొనసాగించడం మనకెవరికీ విజ్ఞత కాదు.”
(ఈ సరికొత్త రాజ్య నాటక ప్రక్రియ కూడా విఫలమైనది)

5 “పోనీ మీకు సుప్రీంకోర్టు చేపట్టే మధ్యవర్తిత్వ ప్రక్రియ కూడా ఇష్టం లేకపోతే, దేశ విశాల ప్రయోజనాల కోసం మా ప్రభుత్వమే ఒక వెనకడుగు వేస్తోంది. ఆ మూడు చట్టాల్ని ఏడాదిన్నర సస్పెండ్ చేస్తుంది. ఇకనైనా రైతుల్ని రోడ్లపై నుండి తొలగించండి”
(రైతాంగ లౌక్యం ఎదుట ఈ సరికోత్త రాజ్య దౌత్యం కూడా బెడిసి కొట్టింది)

6″గణతంత్ర దినోత్సవ ప్రతిష్ఠని కాపాడే దేశభక్తియుత స్ఫూర్తికి ప్రభుత్వం కట్టుబడి, మీరు కోరిన రిపబ్లిక్ డే ట్రాక్టర్ పెరేడ్ కి అనుమతివ్వకూడదని ఇంత వరకు అనుకున్నాం. కానీ రైతాంగం పట్ల సానుభూతితో ఉదారంగా అనుమతిస్తున్నాం”
(ఈ సందర్భంగా రాజ్యం పన్నిన భారీ స్టేజి కూప్ (కుట్ర) ని సైతం రైతాంగం అధిగమించింది)

పైన పేర్కొన్న రాజ్య నాటకంలో ఆరు అంకాలు పూర్తయ్యాయి. అవి అన్నీ ప్రధానంగా కపటోపాయాలు, మాయోపాయలతో కూడినవే. అవి ప్రేక్షకులైన 130 కోట్లమంది దేశప్రజలతో రక్తి కట్టించలేక పోయాయి. తాను రైతులకు వ్యతిరేకంగా చేపట్టే తదుపరి స్టేజి కూప్స్ కూడా ఫలించక పోవచ్చనే అంచనాకు రాజ్యం వచ్చింది. ఫలితమే నేడు రాజ్యం నేరుగా తన నిజరూపం తో దేశ ప్రజల ఎదుటకు రాక తప్పడం లేదు. అదే ఢిల్లీ లో నేడు రాజ్యం చేపట్టిన కాంక్రీట్ బారికేడ్ల నిర్మాణం.

దొంగే దొంగా, దొంగా అని అరిచినట్లు, దేశప్రజల్ని పాలించే రాజ్యమే స్వయంగా కొన్ని నేరాల్ని చేసి, వాటిని తాను అణిచివేయ జూసే కొన్ని ప్రజా సమూహాలకు అంటగట్టి, అణిచివేతకు దిగుతుంది. అట్టి కుట్రల్ని “స్టేజి కూప్స్” అంటారు. జనవరి 26 రైతుల రిపబ్లిక్ ట్రాక్టర్ పెరేడ్ సందర్భంగా ఢిల్లీ ఎర్రకోట పై ఖలిస్తాన్ జండాను రైతులే ఎగరవేసినట్లు మోడీ ప్రభుత్వం ఒక కుట్రని పన్నింది. చరిత్రలో అదో పెద్ద స్టేజి ‘కూ” (Coup)!

పై కాంక్రీట్ బారికేడ్ల నిర్మాణం రేపటి రాజ్య రక్తసిక్త అంకానికి తెర లేపుతుందా? ఈ ఏడవ అంకం మున్ముందు ఏ పెను ప్రమాద సంకేతం? అది ప్రేక్షక లోకమైన దేశ ప్రజల్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అది మున్ముందు రైతాంగానికి ఏ అంతిమ ఫలితాల్ని ఇస్తుంది? వాటి అన్నింటిపై ఈ వ్యాసంలో మాట్లాడటం లేదు. అవి మరో సందర్భంలో మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మాట్లాడేది ఒక్కటే. రాజ్యానికి 1-కౌటిల్యం 2-క్రౌర్యం అనే రెండు మొఖాలు ఉంటాయి. తాజా ఢిల్లీ రైతాంగ ఉద్యమం పట్ల మోడీ ప్రభుత్వం ఒకవేళ ఇంత వరకూ ద్విముఖ ఎత్తుగడలు వేస్తున్నప్పుటికీ, ప్రధానంగా తన కౌటిల్యపు మొఖంతోనే దౌత్యం చేస్తూ వచ్చింది. తద్వారా అది తన దీర్ఘకాలిక రాజకీయ వ్యూహానికి అనుకూలంగా దేశప్రజల్ని మలుచుకునే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఐతేరైతాంగ చైతన్యం ఎదుట దానికి నేడు పొలిటికల్ మార్కెట్లో గిరాకీ పడిపోయింది. అందుకే తాను అపురూపంగా స్వయంగా నిర్మించి, నిర్వహించే రహదారులపై అదితానే ఇనుప మేకులు పాతి, కాంక్రీట్ బారికేడ్ల నిర్మాణానికి బరితెగించింది. అంటే, అది తన కౌటిల్యాన్ని వదిలేసి, క్రౌర్యాన్ని మాత్రమే ప్రదర్శించే దశకు చేరింది. ఇది నిజానికి తాజారైతాంగ ఉద్యమ గమనంలో ఒక కీలక మలుపు. ఇది రైతాంగం సాధించిన తాజా రాజకీయ విజయం కూడా!

రాజ్య కౌటిల్య ఎత్తుగడల్ని అధిగమించడంలో ఈ ఘన రాజకీయ విజయాన్ని నేడు రైతాంగం సాధించింది. ఈ విజయ స్ఫూర్తి తో రైతాంగ ఉద్యమ సంస్థలు మున్ముందు రాజ్య క్రౌర్యపు ఎత్తుగడల్ని కూడా తిప్పికొట్టి విజయం సాధిస్తుందని ఆశిద్దాం.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *