నర్సిరెడ్డి కుటుంబ నిర్ణయం గొప్పది
* ఇతరుల జీవితాలను కాపాడడం గొప్ప విషయం
* నర్సిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటాము
* తక్షణ సాయంగా రూ. లక్ష ఆర్ధిక సాయం
* ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా చిన్నారుల చదువు బాధ్యతలు:
భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
బ్రెడ్ డెడ్ అయి ఇతరులకు అవయవ దానం చేసిన పేద రైతు నర్సిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
నల్గొండ జిల్లా మోత్కూరుకు చెందిన వరకాంతం నర్సిరెడ్డి అనే పేద రైతును ఆదివారం నాడు ఎల్ బి నగర్ లోని కామినేని ఆసుపత్రిలో చేర్చారు. సోమవారం నాడు ఆయన బ్రెయిన్ డెడ్ డాక్టర్లు ధృవీకరించారు. అయితే, ఆయన కుటుంబం అవయవ దానంచేసేందుకు అంగీకరించింది. గుండె, కాలేయం, మూత్రపిండాలను, కళ్లలోని కార్నియాలను డాక్టర్లు వేరు చేసి అవసరమున్నవారికి అమర్చేందుకు సిద్దం చేశారు. వీటిని ఈ ఆసుపత్రినుంచి అపోలోకు నిన్న మెట్రో రైలులో తరలించారు. దీనికోసం హైదరాబాద్ మెట్రో టెంపొరరీ గ్రీన్ కారిడార్ ను ఏర్పాటుచేసి, ప్రత్యేక రైలు ను ఏర్పాటు చేసి గుండెను ఆఘమేఘాల మీద తరలించేందుకు తోడ్పడింది. అపోలోలో వీటిని ఆపదలో ఉన్న వారికి అమరుస్తారు.
ఆపదలో ఉన్న ఇతరుల జీవితాలను నిలబెట్టడానికి వారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి గుండె దానం చేయడం గొప్ప విషయమని కోమటిరెడ్డి ప్రశంసించారు.
‘‘వారి సేవా దృక్పథం అభినందనీయము.. తాను మరణిస్తూ ఐదుగురు జీవితాలను కాపాడిన నర్సిరెడ్డి, వారి కుటుంబ సభ్యులు చరిత్రలో నిలుస్తారు. వారి కుటుంబానికి నర్సిరెడ్డి లేని లోటు తీర్చలేనిదే అయినా ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ సాయంగా లక్ష రూపాయలు ఆర్ధిక సాయం చేస్తాము. అలాగే ఇరువురు పిల్ల చదువుకు అయ్యే ఖర్చును ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా చేపట్టి వారి జీవితంలో స్థిరపడే వరకు అండగా ఉంటాము,’ అని ఆయన హామీ ఇచ్చారు.
ఇలాంటి అనుకోని ఘటనలు జరిగినప్పుడు గుండె నిర్భరం చేసుకుని ఇతరుల జీవితాలను కాపాడేందుకు ఇతరులు కూడా నర్సిరెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోమటిరెడ్డి కోరారు.