ఎక్కడైనా 24X7 నాణ్యంగా ఫ్రీ కరెంటు ఇస్తున్నారా? నిరూపిస్తే సన్యాసం: ఈటల

(ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి,తెలంగాణ)

రైతు సమస్త జీవరాశికి అన్నం పెడుతుండు. విత్తనం చనిపోతూ మొక్కను వాగ్దానం చేస్తుంది, మొక్క ఎదిగి తిండిని వాగ్దానం చేస్తది..  దీనికి మొత్తం సజీవ సాక్షి రైతు.

మొక్కకి కూడా ప్రాణం ఉంటుంది. మొక్కలు కూడా ఎడుస్తయని జగదీష్ చంద్ర బోస్ అనే శాస్త్రవేత్త చెప్పారు. ఆ మొక్కలను కూడా ప్రేమగా పెంచే వారు రైతులు కాబట్టే జై కిసాన్, జై జవాన్ అని చెప్పారు. దేశం కోసం నిస్వార్థంగా పని చేస్తున్న వారు వీరు.

రైతులు వ్యాపారులు కారు. భూమి విలువ ఎంత పెరిగినా రైతు వ్యవసాయమే చేస్తున్నారు తప్ప అమ్ముకొని పోవడం లేదు.రైతు త్యాగమూర్తి.

భారత దేశం అమెరికా లాంటి, రష్యా లాంటి దేశంకాదు. వాళ్ళ లాగా కంప్యూటర్స్, యుద్ద ట్యాంక్ లను తయారు చేసి బ్రతకలేము. 135 కోట్ల భారత దేశంలో వ్యవసాయం ను ప్రోత్సహించకపోతే మిగిలేది ఆకలి చావులు, శవాల గుట్టలు. ఇతియోపియ దేశంలో కరువు వచ్చి చనిపోతున్న వారిని చూసి జాగ్రత్త పడాలి.

1969 లో కరువు వస్తె అందరం జొన్న అన్నం మాత్రమే తిన్నాం. అలాంటి కరువు చూసే స్వామినాథన్ గారు గ్రీన్ రెవల్యూషన్ తీసుకు వచ్చారు. అందులో భాగంగానే బాక్రనంగల్ ప్రోజెక్ట్ కింద పంజాబ్, హర్యానా రాష్ట్రాలు పంటలు పండించి దేశానికి అన్నం పెట్టారు అనే విషయం మర్చిపోవద్దు.


హుజూరాబాద్ క్లస్టర్ రైతు వేదికను రైతులకు అంకితం చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేసిన ప్రసంగం


అప్పట్లో అమెరికా నుండి వచ్చే గోధుమ రవ్వ కోసం స్కూల్ కి వెళ్లి తిన్నాం. అలాంటి పరిస్థితి నుండి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది.
దేశంలో 1.05 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని FCI కొనుగోలు చేస్తే ఒక్క తెలంగాణ నుండే 62 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని FCI చైర్మన్ ప్రకటించారు. ఇది మన గొప్పతనం.  34 వేల ఎకరాలనుండి 94 వేల ఎకరాలకు హుజూరాబాద్ లో వరి సాగు పెరిగింది.

తెలంగాణ, విదర్భలో జరిగిన రైతు ఆత్మహత్యల గురించిజయతీ ఘోష్, రామచంద్ర కమీషన్లు రిపోర్ట్స్ ఇచ్చాయి. పార్టీలు, రాజకీయాల గురించి మాట్లాడడం లేదు.. ఆ కమిటీలు ఇచ్చిన నివేదికలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద లేదా అని ఒక భారతీయ పౌరుడిగా  నేను అడుగుతున్న… ఎందుకు రైతు రోడ్డుకి ఎక్కాలి?
ఎందుకు రైతు సమ్మెలు చేయాలి?

గోదావరి జలాలతో హుజురాబాద్ రైతుల కాళ్ళు కడుగుతాయని ఎవరన్నా ఊహించారా ? కానీ అది నిజం అయ్యింది. కాలు అడ్డం పెడితే నీళ్లు పారుతున్నయి.

గండిపల్లి, గౌరవెల్లి ప్రాజెక్ట్స్ పూర్తి చేసి మిగతా గ్రామాలకు కూడా నీళ్లు అందిస్తాము. వచ్చే సంవత్సరం లో ఈ ప్రాజెక్ట్స్ కాలువల్లో నీళ్లు పారిస్తాము.

హుజూరాబాద్ ప్రజలు ఆశీర్వదిస్తే ఆంధ్ర పాలకుల మీద కొట్లాడే అవకాశం వచ్చింది. కరెంటు గురించి అప్పటి సీఎం కిరణ్ మ్యాప్ లు పెట్టీ ఏదో చెప్పిండు. కానీ తెలంగాణ వచ్చాక మన సీఎం కెసిఆర్ గారు కరెంటు కష్టాలు లేకుండా చేశారు.

28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో అయిన 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నారా ? అలా నిరూపిస్తే  సన్యాసం పుచ్చుకుంటా.

భారత ప్రభుత్వం అయినా? ఏ ప్రభుత్వం అయినా? వారిని
నిండు మనసుతో ఆశీర్వదించేది రైతులు మాత్రమే.

70 రోజుల నుండి ఎముకలు కోరికే చలిలో ఉద్యమం చేస్తుంది ఎవరి కోసం?
CACP లో ఉన్న 5 మంది సభ్యులు పంటకు ఒక ధర నిర్ణయిస్తారు. ఆ ధరను ప్రభుత్వం  100 శాతం అమలు చేయాలి. అదే కదా మన రైతులు అడుగుతుంది.
ఐకేపీ సెంటర్ లో ధాన్యం కొనకపోతే రైస్ మిల్లర్లు కొనగలరా ?
ఎక్కువ దూరం పోలేక ఊర్లోనే ఐకేపీ సెంటర్ పెట్టు కుంటున్నం.
ధాన్యాన్ని ఎక్కడో పోయి అమ్ముకొనే శక్తి రైతుకి లేదు. ఇంత పెద్ద ఎత్తున కొంటేనే వొడవక పోతే ఎవరు కొంటారు.

ఈ అధికారం మా అమ్మ నాన్న ఇవ్వలేదు.. పల్లెల్లో ఉండే రైతులు ఇచ్చారు. ఈ అధికారం రైతు కోసమే.

భారత పౌరునిగా చేతులెత్తి దండం పెడుతున్న కేంద్రం వెంటనే స్పందించి రైతుల సమస్యలు తీర్చాలి.

సీఎం గారు అత్యధికంగా సమీక్ష చేసిన డిపార్ట్మంట్ లు వ్యవసాయం, నీటి పారుదల శాఖ.

అప్పులు చేయకుండా ఉండటం కోసం వచ్చిందే రైతు బందు.

అన్నం పెట్టే రైతు కుటుంబం అనాధ కావొద్దనే రైతు భీమా.
తెలంగాణ రాష్ట్రంలో నీటి తీరువా లేదు, కరెంటు బిల్లు లేదు, రైతు బందు ఇచ్చి, రైతు భీమా ఇచ్చి రైతుకి మద్దతు ఇస్తున్న రాష్ట్రం ఇది.

రైతు వేదికల్లో పెట్టుబడి ఎలా తగ్గాలి, పంట దిగుబడి ఎలా పెరగాలి అనే చర్చ ఈ రైతు వేదికల్లో జరగాలి.

దావాఖాన లో ఏ జబ్బుకి ఆ మందు ఇస్తారు కానీ పంటకు అన్నిటికీ ఒకటే మందు వేస్తున్నారు. అలా కాకుండా భూమిని బట్టి, భూసార పరీక్షలు బట్టి మందులు వాడాలి. అధిక మోతాదులో మందులు వాడడం వల్ల గ్రామాల్లో కూడా క్యాన్సర్ లు వస్తున్నాయి.మందులు మొక్క నుండి గింజలకు వాటి నుండి మనిషికి వస్తున్నాయి. డబ్బే ప్రధానం కాదు ఆరోగ్యం కూడా ముఖ్యమే.
పంట పొలాలు రసాయనాలతో నిండి పోయాయి వాటిని ఎలా తగ్గించాలి అనే చర్చకు రైతు వేదిక కేంద్రం కావాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *