విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా కొనుగోలు చేసిన వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ ను సరఫరా చేసేందుకు హైకోర్టు అనుమతినీయడంతో వాటి మీద రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిఘా మొదలయింది. ఇందులో భాగంగా ఆయన ఈ రోజు ఈ కొత్త వాహనాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో డబ్బులు అన్ని పార్టీలు విరివిరిగా పంచుతాయి. గతంలో అంబులెన్స్ లలో కూడా డబ్బులు సరఫరా అయ్యేవి. చాలా అంబులెన్స్ లను ఎన్నికల సమయంలో అధికారు పట్టుకున్న వార్తలు చూశాం. ఇపుడు ఫిబ్రవరి నెలలో పంచాయతీ ఎన్నికల జరుగుతున్ సమయంలో సుమారు 9260వాహనాలు గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ రేషన్ అందిస్తాయి. అందువల్ల దీని మీద నిఘా అవసరం.
బుధవారం ఉదయం ఎపి ఎస్ ఇసి రేషన్ పంపిణీ చేసే వాహనాలను పరిశీలించారు. హై కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ పథకానికి సంబంధించిన వివరాలను, వాహనాలను ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వం సమర్పించాల్సి ఉంది. ఈ మేరకు కోర్టు మూడు రోజులు కిందట ఉత్తర్వులిచ్చింది.
ఈ రేషన్ పంపిణీ కార్యక్రమం ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రభుత్వం ఒక పెద్ద పండగ లాాగా చేయాలనుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ అనంతపురం జిల్లా కదిరి లో ఈ కార్యక్రమంలో పాల్గొన్ని ప్రారంభించాల్సి ఉండింది.
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈ పథకం ఆగిపోయింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం హౌస్ మోషన్ తో హైకోర్టును ఆశ్రయించింది. జనవరి 31 వ తేదీన హైకోర్టు రేషన్ పంపిణీకి అనుమతినిచ్చింది. అయితే, పంపిణీ ఎన్నికల కోడ్ ప్రకారమే జరగాలని, దీనిని రాజకీయ కార్యక్రమంగా జరపరాదని చెప్పింది.
అంతేకాదు, రెండు రోజులలో డోర్ డెలివరీ పథకం, వాహనాల గురించి ఎన్నికల కమిషన్ కు తెలపాలని కూడా చెప్పింది. దీని ఫలితమే నేటి తనిఖీలు.
రాష్ట్ర ప్రభుత్వం సుమారు 9260 వాహనాలు జగనన్న రేషన్ డోర్ డెలివరీ కోసం కొనుగోలు చేసింది. జనవరి 21 న ముఖ్యమంత్రి ఈ వాహనాలను విజయవాడలో జండా ఊపి ప్రారంభించారు.ప్రతినెల 15 నుంచి 18 రోజుల పాటు ఈ వాహనాలు ఇంటింటికి తిరిగి రేషన్ కార్డుదారులకు బియ్యం అందిస్తాయి.
ఏపీ ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ రూపొందించిన నాణ్యమైన బియ్యం పంపిణీకి సంబంధించిన రెండు వాహనలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పంపిణీ ఏ రకంగా జరుగుతుందో పౌరసరఫరాలశాఖ కమీషనర్ కోన శశిధర్ వివరాలు అందించారు. పంపిణీ వాహనంలో ఎక్కి డ్రైవర్ క్యాబినిలో కూర్చుకుని నిమ్మగడ్డ పరిశీలించారు. వాహనాలలో ఉన్న సదుపాయాలుల గురించి వాకబు చేశారు.