కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ వూసే లేకపోవడం పట్ల భువనగిరి ఎంపి, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందని ఆయన వ్యాఖ్యానించారు. మండిపడ్డారు.
ఆయన రియాక్షన్ ఇది :
* 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌కు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయకుండా కాలాయాపన చేస్తున్నారు.
* ఎంతోకాలంగా ఉన్న ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ప్రత్యేక డివిజన్ డిమాండ్‌పై కేంద్రం ఎందుకు స్పందించలేదు.
* విభజన చట్టంలో పేర్కొన్నా బయ్యారం స్టీల్ ప్లాంట్, ఎంఎంటీఎస్ యాదాద్రి వరకు పొడగింపు ప్రాజెక్టు ఏమయ్యాయి.
* రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద కేసీఆర్ తాకట్టు పెట్టడంతో కేంద్రం రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు.
* టీఆర్ఎస్ ఎంపీలు, బీజేపీ నేతల అసమర్థత వల్లే రాష్ట్రం అన్యాయానికి గురయ్యింది. ఎప్పటి లాగానే రైల్వే కేటాయింపుల్లో రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించారు. మెట్రో రైలు విస్తరణ ప్రాజక్టులలో హైదరాబాద్ కు స్థానం దక్కలేదు.
* ఈ సమావేశాల్లో తెలంగాణకు, రైతులకు జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీస్తాం.
*చక్కగా నడుస్తున్న కేంద్రం ప్రభుత్వ సంస్థలను అభివృద్ధి చేసేందుకు కాకుండా వాటిని కార్పోరేట్ కంపెనీలకు అమ్మేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
* ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే వాటికి బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగా జరిగాయి. తమిళనాడు దీనికి ఉదాహరణ. చెన్నై మెట్రో రైలు విస్తరణకు భారీ నిధులు కేటాయించారు.ఇది అక్కడి అసెంబ్లీ ఎన్నికల మీద కన్నేసి చేసినదే.
* రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలకు కేంద్రం ఇచ్చే నిధులను తగ్గించాలనే నిర్ణయం హేయమైనది. తద్వారా రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు కుంటుపడవా.
* లాక్‌డౌన్ వల్ల ఏర్పడిన దేశ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొవడంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మన దేశంలోని అత్యధిక మంది ప్రజల జీవనోపాధి పై దుష్ఫ్రభావం చూపే విధంగా జడ్జెట్ ఉంది.
* మోడీ ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది. స్వతంత్ర భారతదేశంలో మునుపెన్నడూ చూడని స్థాయికి మన ప్రజలలో ఆర్థిక అసమానతలను విస్తృతం చేసిన ధనికులకు, కార్పొరేట్‌లకు రాయితీల మీద రాయితీలు ఇస్తున్నారు.
*వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో కూడా ద్రోహం చేసింది. వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయింపులలో భారీగా కోతలు విధించింది.