(భూమన్)
ఈ సారి నిజంగా మా యాత్ర శేషాచలం అడవుల్లో భయం భయంగానే సాగింది. గుంజన జలపాతం చేరుకునే దారి పొడుగునా గుండె వేగంగా కొట్టు కుంటూనే ఉంది. జలపాతం చేరాక, అక్కడి ప్రకృతి సౌందర్యంలో లీనమయ్యాక గాని తేరుకోలేక పోయాం. ఇంత బిక్కు బిక్కుగా మేం శేషాచలం అడవుల్లో తిరగడం ఇదే మొదటి సారి.
ఒకటి రెండు సార్లు గుంజన జలపాతం చేరుకునేందుకు ప్రయత్నించాం. అయితే దారి కంప చెట్లతో బాగా మూసుకుపోయింది. వెళ్లడం వీలుకాక వెనక్కి వచ్చాం. ఈ సారి వీలయింది.
ఎందుకంటే, మొన్న కురిసిన వర్షాల వల్ల చెట్లన్నీ కొట్టుకు పోయాయి. దీనితో మాకు కొండలను , బండరాళ్లను సమీపించి, వాటిని పాకుతూ జలపాతం చేరుకునేందుకు వీలయింది.
కోడూరు సమీపాన ఉన్న బాలపల్లి చెక్ పోస్టు నుంచి ఈ సారి శేషాచలం అడవుల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. దట్టమయిన అడవిలో నుంచి గుంజనచేరుకోవడం వూహించుకుని ఉబ్బితబ్బిబ్బయ్యాం.
ఈ ఉత్సాహం ఫారెస్టు అధికారుల చెప్పిన సమాచారంతో నీరుగారి పోయింది. ఈ ప్రాంతంలోకి ఇపుడు 24 ఏనుగులు ప్రవేశించాయని, ఈ అడవీ మార్గం గుంజన జలపాతం వెళ్లడం ఏ మాత్రం సురక్షిత కాదు అని అటవీ శాఖ అధికారులు చెప్పారు.
దీనితో మేము కోడూరు వైపున ఉన్న బొప్పరాజుపల్లె మార్గం ద్వారా గుంజన జలపాతం చేరుకున్నాం. ఇది కొద్దిగా సురక్షితం. బొప్ప రాజు పల్లె నుంచి జలపాతం సుమారు 12 కిమీ దూరం ఉంటుంది.
ఆ దారి పొడీత మాకు ఎనుగుల లద్దెలు కనిపించాయి. అంటే ఇక్కడ ఏనుగులు తిరుగాడుతున్నాయన్నమాట. ఈ దారి నుంచి ప్రవేశించే ఏనుగులు కంగుమడుగు చేరుకుంటాయట. అక్కడి నుంచి ఆ ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉంటాయి. వేసవిలో ఈ ఏనుగులు ఈ ప్రాంతాలను వదలి వెళ్లవు. అందుకని ఇక్కడి నుంచి శేషాచలం అడవుల్లోకి రావడం మంచిది కాదని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. అయితే సాహసంచేయాలనే అనుకున్నాం. ఎందుకంటే, మరొక సారి నిరుత్సాహంగా ఇంటిముఖంగా పట్టడం ఇష్టం లేదు. ముందుకెళ్లడం సాహసమే.
ఏనుగులు తిరుగాడే ప్రాంతం చాలా ప్రమాదకరం. తెల్ల షర్టు వేసుకోరాదు. తెల్ల వాహనం లో తిరగరాదు. మైళ్ల దూరాన్నుంచే అవి మనుషుల్ని పసిగడతాయట. అంతేకాదు, గంటకు నలభై కిమీ వేగంతో పరిగెడతాయి. అందుకే వాటి కంట పడకుండా జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరిక చేశారు. ఏనుగులు ప్రవేశించే వీలున్న అడవుల్లో తిరగడం ప్రమాదం అని కూడా వారు హెచ్చరించారు. ఈ విషయాలు తెలిశాక భయం లేకుండా ఎలా ఉంటుంది? బిక్కు బిక్కు మంటూనే మా నడక ప్రారంభించాం. చివరకు గమ్య స్థానం చేరుకున్నాం.
శేషాచలం అడవుల్లో చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం గుంజన జలపాతం. చాలా రోజులుగా నేను దీని గురించి వింటూ వస్తున్నాను. ఈ జలపాతపు నిండుగా దూకేటపుడు దీని హోరు కోడూరు పట్టణం దాకా వినిపిస్తుందని మా చిన్నపుడు చెప్పే వారు. చాలా కాలంగా వెళ్లాలనుకుంటున్నానే గాని, వీలుపడలేదు. కరోనా సమయంలో ఈ అవకాశం లభించింది.
బొప్పరాజు పల్లె నుంచి దొంగల బండ చేరుకున్నాం. అక్కడ ఒక కొండ ఎక్కిదిగాం. అక్కడ అద్భుతమయిన కొలనులు ఆరేడు కనిపించాయి. ఈ గుండాలలలో తనివితీరా ఈదులాడి జలపాతం దగ్గిరకు పోయాం. ఈ దొంగల బండ ప్రాంతానికి ఏనుగులు దాహం తీర్చుకోవాడానిక వస్తాయని, ఇక్కడే జలకాలాడతాయని అధికారులు చెప్పారు.
ఈ జలపాతం సౌందర్య చూసి ఆశ్చర్యపోయాను. సుమారు 150 అడుగుల ఎత్తునుంచి జలపాతం దుంకుతూ ఉంది. ఈ జలపాతం చూస్తూ అలా ఉండి పోవాలనిపించే కనువిందు అది.
నీళ్లు దూకుతున్న దృశ్యం, ఆ మోత ద్వని, ఆ కొండల పరిసరాలు… వర్ణించనలవికాని ప్రకృతి సౌందర్యం. కాస్కేడ్ అని మాట గుర్తుంది. ఒక జలపాతం కిందికి దూకుతుంది. అక్కడొక మడుగు ఏర్పడుతుంది. ఈ నీళ్లు జలపాతమై కిందికి దూకుతాయి. అక్కడొక మడుగు. జలపాతం. ఇలా అయిదారు జలపాతల గొలుసు అంది. ఇంత అద్భతం ఎక్కడైనా ఉంటుందా?
ఆజలపాతం నాలుగు మూలలు కలియతిరిగాం. కాళ్లు పగళ్లుబారేంతగా తిరిగామంటే నమ్మండి. ఇంటికొచ్చాక గాని కాళ్ల పగుళ్ల గురించి తెలియలేదు. అంతేనా, ఒక సారి మేం చేసిన యాత్ర మామూలు యాత్ర గాదు, సాహసయాత్ర అని తల్చుకుంటే వొళ్లు గగుర్పొడుస్తుంది.
ఎందుకంటే ఎత్తయిన కొండ కొసల నుంచి నడచుకుంటూ పాకుకుంటూ వెళ్లాం. అదెంత ప్రమాదకరమయిన ఫీటో తలచుకుంటే ఇపుడు భయమవుతుంది. అలాంటి కొండ చరియలనుంచి ట్రెక్ చేయకూడదని పిస్తుంది. ఏమో చెప్పలేం, మళ్లీ ఎవరైనా మిత్రులొచ్చి పోదామంటే, ఈ ప్రకృతి సౌందర్యవ్యామోహం, ఒక్కచోట మనని ఉండనీయదు.
సరే ఇప్పటికయితే, ఇలాంటి ప్రమాదపు అంచులదాకా వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. శేషాచలం అడవుల్లో ఎన్ని జలపాతాలున్నాయో… తుంబురు తీర్థం, నారాయణ తీర్థం, శేషతీర్థం, తాటికోన, గుండాల కోన… ఇలా ఎన్ని ఉన్నాయో లెక్కేలదు. వీటిని ఎన్ని సార్లయినా సందర్శించవచ్చు. ఆ జలపాతాలు ఒక ఎత్తు, గుంజన గొలుసు జలపాతాలు ఒక ఎత్తు. ఇది చాలా ఎత్తునుంచి దిగదాలకు అంచెలంచెలుగా దూకే జలపాతం ఇదే.
దాచేస్తే దాగని సత్యాల్లాగా ఇపుడు ఇవి మా కంటపడుతున్నాయి. ఈ గుంజన జలపాతానికి వెళ్లే అవకాశం అందరికీ రాకపోవచ్చు, అవకాశం వస్తే మాత్రం తప్పక వెళ్లి తీరాలి. గుంజన జలపాతం గురించి ఎక్కడైనా ఎవరైనా రాశారేమోనని ఎంతో వెదికాను, సరైన సమాచారం ఎక్కడా దొరకలేదు. ఈ గుంజన జలపాతానికి ఇన్ని నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ విషయాన్ని మాత్రం అన్వేషించి తీరాల్సిందే. ఆ పని పూర్తి చేస్తాను.
ఎలా చేరుకోవాలి: కడప జిల్లా రైల్వే కోడూరుకు చేరుకోవాలి.కోడూరు కడప- తిరుపతి హైవే మధ్య ఉంటుంది. ఇక్కడికి రేణిగుంట నుంచి రావచ్చు, కడప నుంచి రావచ్చు. రెండు వూర్లకి విమనాశ్రయాలున్నాయి. రైలు మార్గం ఉంది.చక్కటి బస్ రూట్ ఉంది. ముందు కోడూరు నుంచి బొప్పరాజుపల్లెకు చేరుకోెవాలి. అక్కడి నుంచి 12 కిమీ నడక. అయితే స్థానికుల గైడెన్స్ తీసుకోవడం అవసరం. అటవీ శాఖ వారిని కూడా సంప్రదించాలి.