ఈ దినం దుష్టత్వం పై పోరాడే దీక్షాదినం కూడా!
(ఇఫ్టూ ప్రసాద్ -పిపి)
ప్రపంచ చరిత్రలో కాలాన్ని కాటువేసిన దుర్దినం జనవరి 30. అదే నాజీ హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ గా గద్దెనెక్కిన రోజు! ఫాసిజం ప్రతిపక్ష స్థానం నుండి అధికార స్థానానికి చేరుకున్న రోజు! అదే 1933 జనవరి 30.
భారతదేశ చరిత్రలో దుర్దినం జనవరి 30. అదే ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజ్యాంగ రచనా ప్రక్రియ పట్ల ద్వేషంతో గాంధీని మనువాద సంస్థ ఆర్.ఎస్.ఎస్. హత్య చేసిన రోజు! మనదేశ చరిత్రలో మొట్టమొదటి వ్యవస్థీకృత టెర్రరిస్టు దాడి దినం. అదే 1948 జనవరి 30.
ఒక దుర్దినంగా జనవరి 30 ప్రపంచ చరిత్రను రక్తస్రావానికి గురి చేసింది. మరో దుర్దినంగా అది భారతదేశ చరిత్రను కూడా గాయపరిచింది. భారత దేశ చరిత్రని గాయపరిచే ప్రతీఘాత ఫాసిస్టు అచారిత్రిక శక్తులకి ఆదర్శం హిట్లర్. హిట్లర్ ప్రమాణ స్వీకారం చేసిన రోజుని స్ఫూర్తి దినంగా చేపట్టి ఆ రోజు అది గాందీని హత్య చేసింది.
భారతదేశ చరిత్రలో కేవలం నాలుగు రోజుల వ్యవధిలో రెండు తేదీలకు రాజకీయ ప్రాముఖ్యత ఉంది. ఒకటి జనవరి 26. మరొకటి జనవరి 30. ఒకటి రిపబ్లిక్ డే! మరొకటి గాంధీని ఫాసిస్టు హంతక శక్తులు పొట్టన పెట్టుకున్న రోజు! జనవరి 26 పై దాడిదినమే జనవరి 30. అంటే రాజ్యాంగం ఉనికిలోకి రాక ముందే రిపబ్లిక్ రాజ్యాంగ రచనా ప్రక్రియ పై దాడి చేసే లక్ష్యంలో భాగమే గాంధీ హత్య! గాంధీ హత్యా దినాన రిపబ్లిక్ స్పూర్తితో రైతాంగ ఉద్యమ కార్యాచరణ కమిటీ ఇచ్చిన సద్భావన దివస్ పిలుపు నేడు దేశవ్యాప్తంగా అమలు జరగబోతోంది.
పైన పేర్కొన్న జనవరి 26కీ, 30కీ మధ్య జనవరి 27కి కూడా ఒక చారిత్రిక ప్రాధాన్యత ఉంది. అదే హిట్లర్ నాజీయిజం పై నిర్ణయాత్మక విజయాన్ని సాధించి, నాజీ క్రూర నిర్బంధ శిబిరాల నుండి నిర్బంధితుల్ని రష్యా ఎర్ర సైన్యాలు విడుదల చేశాయి. అదే 1945 జనవరి 27. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చాలా ఏళ్ల పాటు ఫాసిస్టు వ్యతిరేక ప్రజాతంత్ర శక్తులు ప్రపంచ వ్యాప్తంగా “విజయ్ దివస్” గా జనవరి 27 ని పాటించాయి. చరిత్రలో గత కాలపు విజయ్ దివస్ స్ఫూర్తి తో ఫాసిజం పై పోరాడే దీక్ష నేటి చారిత్రక ఆవశ్యకత!
గాంధీ హత్యా దినాన్ని “సద్భావనా దివస్” గా సంయుక్త కిసాన్ మోర్చా (SKM) పిలుపు ఇచ్చింది. నేడు ఫాసిస్టు వ్యతిరేక రాజకీయ శక్తులను ఇదోచారిత్రిక కర్తవ్యం.
భగతసింగ్ వద్ద నిలబడి చూస్తే, గాంధీ రాజకీయ శత్రువే. గాడ్సే వద్ద నిలబడి చూస్తే రాజకీయ మిత్రుడు! సోషలిజం దృక్కోణంతో చూసేవాళ్ళకి గాంధీ ప్రత్యర్థి! మనువాదాన్ని దృష్టిలోకి తీసుకొని చూసే వారికి మిత్రుడు! ఔను మరి! చెట్టుకింద కూర్చున్న మనిషి చెట్టు మీద ఉన్న మనిషి కంటే “క్రింద” వున్నట్లు! చెట్టు పక్క బావిలో దిగిన మనిషి కంటే చాలా ఎత్తులో ఉన్నట్లు! నాగపూర్ ఢిల్లీకి దక్షిణాన ఉంటే, వరంగల్ కి ఉత్తరాన ఉంటుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలన స్థానంలో సోషలిస్టు సమాజం కోరుకునే శక్తులకు మొన్నటి వరకూ గాంధీ రాజకీయ ప్రత్యర్ధే! కానీ నేడు ఫాసిజం పెట్రేగిపోయే కాలంలో వారికి కూడా గాంధీ రాజకీయ మిత్రుడే! ఈ దృష్టి కోణంలో నేటి “సద్భావనా దివస్” ని జయప్రదం చేయడం ఫాసిస్టు వ్యతిరేక శక్తులన్నింటి కనీస రాజకీయ కర్తవ్యం.
ఇప్పుడు రైతాంగానికి కూడా గాంధీ మిత్రుడే! ఫాసిస్టు కుట్రల ద్వారా రైతాంగ పోరాటాన్ని అణిచివేసి నేపథ్యంలో గాంధీ స్మారక స్ఫూర్తితో “సద్భావనా దివస్” కి ప్రాధాన్యత ఉంది.
రెక్కలు ముక్కలు చేస్తూ, ఆరుగాలం కష్టించినా, తమ పంటలకు గిట్టుబాటు ధరలు రాక, పురుగుల్ని చంపే పురుగు మందులు త్రాగి ఆత్మహత్యల పాలవుతోన్న దుస్థితి తెల్సిందే! బ్రతికి ఉన్న రైతులు కూడా జీవచ్చవాలుగా బ్రతుకుతోన్న దురవస్థ కూడా తెల్సిందే! అట్టి దుర్భర రైతాంగ ధర్మ పోరాట అణచివేత కోసం స్టేజి కూప్స్ ద్వారా రాజ్యమే కుట్రలు పన్నే ఫాసిస్టు దుర్నీతికి జనవరి 26 గుర్తుగా మిగిలింది. సారాన్ని కోల్పోయి, రూపాన్ని మాత్రమే మిగుల్చుకున్న అస్థిపంజరం వంటి రిపబ్లిక్ కి గల ఆఖరి ఆనవాళ్లను కూడా లేకుండా చేసే లక్ష్యం మోడీ సర్కార్ ది. రిపబ్లిక్ కి రాజకీయ మరణ శాసనం రాసే రాజ్య ఫాసిస్టు రాజనీతికి రైతాంగం పై జనవరి 26నాటి రాజ్య కుట్రలు చరిత్ర లో సాక్షిగా నిలుస్తాయి.
జనవరి 26కీ, జనవరి 30కీ మధ్య మూడు రోజుల వ్యవధి ఉంది. ఈ మూడు రోజులు బడా కార్పొరేట్ శక్తుల దన్నుతో మోడీ షా ప్రభుత్వం అర్బన్ లుంఫెన్ (వాడుక భాషలో లంఫెన్ అని కూడా అంటారు) గ్యాంగుల్ని రైతాంగ పోరాట శిబిరాలపై ఉసిగొలిపి రాళ్ళ దాడుల్ని చేయించింది. సింఘు, టిక్రీ, ఘజీపూర్ వంటి బోర్డర్ పాయింట్ల వద్ద యుద్ధ స్థితిని సృష్టించింది. పోలీసుల సమక్షంలో సాగే ఈ లంఫెన్ గ్యాంగుల భీభత్సకాండకు గోదీ మీడియా “స్థానిక ప్రజల పోరు” గా ముద్దు పేరు పెట్టి ప్రచారం చేస్తోంది. గడ్డకట్టే చలిలో 170 మందికి పైగా తమ ఆప్తుల్ని కళ్లెదుటే కోల్పోతూ కన్నీటితో కాలం వెళ్లదీస్తూ కొనసాగిస్తోన్న రైతాంగ పోరాట శిబిరాలపై కొత్తగా రాళ్ళ దాడి సాగుతోంది. అటు మంచువర్షం! ఇటు రాళ్ళ వర్షం! ఇంకో వైపు నిందల పర్వం! వేరొక వైపు పోరాట శిబిరాలకి విద్యుత్, మంచినీటి సరఫరాని కూడా మోడీ ప్రభుత్వం బంద్ చేయించే పాపిష్టి పనికి దిగింది. ఇన్ని రకాల కష్టాల మధ్య మన దేశ రైతాంగం పట్టువదలని దీక్షతో పోరాడుతోంది. వారికి మనం పిడికిళ్ళెత్తి అభివాదం చేద్దాం.
అంబానీ, ఆదానీ వంటి బడా కార్పొరేట్ సంస్థలకు పెద్ద పాలేరుగా మారిన మోడీ-షా ప్రభుత్వం మన రైతాంగం మీద ఇన్ని రకాల ఫాసిస్టు దాడులు చేస్తున్నా, వారిలో మనోధైర్యం సడలడం లేదు. పైగా మరింత సంఘటితం అవుతోంది. దానికి గత మూడు రోజులే సాక్ష్యం!
మొన్న గురువారం రాత్రి ఘజీపూర్ వద్ద ప్రభుత్వ హంగామా యూపీ రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మారుస్తోంది. రాకేష్ తికాయట్ తో సహా రైతాంగ నేతల్ని మొన్న రాత్రి అవమానించిన రాజ్య దుర్నీతి రైతాంగంలో కడుపు మంటను పెంచింది. ఆ దాడికి నిరసనగా 24 గంటలు కూడా తిరక్కుండానే ముజఫర్ నగర్ లో నిన్న 29వ తేదీ ఏర్పాటు చేసిన మహా పంచాయతీ ఒక జనసముద్రంగా మారింది. ఈరోజు సద్భావనా దినంలో పాల్గొనడమే కాకుండా, నేటి నుండి చట్టాల రద్దు వరకూ శిబిరాలలో ఉండేందుకు నిన్నటి రాత్రి నుండే అసంఖ్యాకంగా రైతాంగం ఘజీపూర్ కు కదిలి వస్తోంది.
అత్యాచారాల సర్కార్ గా పేరొందిన యోగి ప్రభుత్వం పై యూపీ గ్రామీణ ప్రాంతాలు నేడు అట్టుడికి పోతున్నాయి. ఆ మంట ఉత్తరాఖండ్ కి కూడా వ్యాపించింది. మరోవైపు హర్యానా రైతుసంఘాల పిలుపుతో నిన్నటి నుండి గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్ లు సమావేశాలు జరిపి, మోడీ ప్రభుత్వ దమన నీతిపై నిరసన తీర్మానాలు చేస్తున్నాయి. ఇక పంజాబ్ గ్రామసీమలు నేడు అగ్నిగుండంగా మారడం ఆశ్చర్యం కలిగించదు కదా!
మొన్న 28వ తేదీ రాత్రి ఘజీపూర్ సభా వేదికపై రాజ్య దాడులకు తల్లడిల్లి ప్రముఖ యూపీ రైతునేత రాకేష్ తికాయట్ కార్చిన కన్నీళ్లు నేడు కత్తులుగా మారుతున్నాయి. ఆ ప్రతి కన్నీటిబొట్టు నేడు యూపీ గ్రామసీమల్ని తడిపివేసి, మోడీ ప్రభుత్వం పై దీర్ఘకాలిక పోరుకు రైతుల్ని అగ్గి బరాటాలుగా తీర్చిదిద్దుతోంది. ఈ వ్యాసం రాసే సమయంలో ఘజీపూర్ బోర్డర్ పోయింటుకు జనం ఓ ప్రవాహంలా కదిలి వస్తోంది. (గోది మీడియాలో వాటి దృశ్యాలకై ఎదురు చూడొద్దు)
యూపీ లో విద్యార్థిలోకం వెల్లువయ్యే పరిస్థితి కొత్తగా తలెత్తుతున్నది. నిన్నటి మహా పంచాయతీలో అసంఖ్యాకంగా విద్యార్థులు పాల్గోన్నారు. ఆ భారీ సభలో రాకేష్ తికాయట్ సహా రైతు నేతలు విద్యార్థి లోకానికి పిలుపు ఇచ్చారు. నేడు ఘజీపూర్ చేరుకుంటున్న జనంలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉందని ఇప్పుడే అందిన విశ్వసనీయ వార్త! సోమవారం నుండి ఉప విద్యా సంస్థలు కూడా జ్వలించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
విజయ మాల్యా, నీరవ్ మోడీ వంటి దొంగలు నేడు దేశసంపదని పంది కొక్కుల్లా భక్షిస్తున్నారు. అలాంటి బందిపోటు ఆర్ధిక నేరస్తుల్ని వదిలేసి, రైతు నేతల్ని కేసుల్లో ఇరికించి, ఇళ్లపై దాడులు చేస్తోంది. ఈ దురాగతాన్ని సహించబోమని రైతాంగం అగ్ని పర్వతంలా ఉడుకుతోంది.
ఇస్లాం ఉగ్రవాదం పేరిట మైనారిటీలని టెర్రర్ చేసేందుకు ఉపా చట్టాన్ని మోడీ ప్రభుత్వం తన ఆయుదంగా చేసింది. వామపక్ష ఉగ్రవాదంపై పోరు పేరిట కోరేగావ్ కేసుల్ని కూడా బనాయించింది. ఇప్పుడు ఏకంగా రైతు నేతల్ని కూడా ఉపా కేసుల్లో పెట్టింది. NIA ని మోడీ ప్రభుత్వం రంగంలోకి దింపింది. ఒకరకంగా, ఉపా చట్టం రద్దు కోసం జరిగే నేటి చిన్న ప్రజాతంత్ర ఉద్యమానికి బలాన్నే ఇస్తోంది. ఇది కీడులో కూడా మేలు వంటిదేమో!
ఒకవైపు లక్షల కోట్ల ప్రజా ధనాన్ని పందికొక్కుల్లా మింగివేస్తూ, పన్ను ఎగవేస్తూ, రాయితీలు భక్షిస్తూ దేశానికి పరమ శత్రువర్గంగా తయారైన బడా కార్పొరేట్ వర్గాన్ని పెంచి పోషిస్తూ; మరోవైపున తమ కండలు పిండి, చెమటలు కార్చి, ఐనా అప్పుల పాలై, బ్రతుకే గండంగా మారిన మన రైతాంగాన్ని దేశ ద్రోహులుగా, సంఘవిద్రోహులుగా, అసాంఘిక శక్తులుగా, హింసా మూకగా చిత్రించే ఫాసిస్టు రాజనీతి చెల్లదని చాటుదాం. వారిది ఒంటరి పోరాటం కాదని నిరూపిద్దాం. మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం.
కాలం ఇంత త్వరగా ఇలా మలుపులు తీసుకుంటుందని మూడు నెలల క్రితం రాజకీయ పండిత వర్గాలు సైతం ముందస్తు అంచనా వేయలేక పోయాయి. చరిత్ర గమనం ఎంతటి విచిత్ర మలుపులు తీసుకుంటుందో కదా!
ఇప్పటి వరకూ ఎలా వున్నా, ఇక మౌనం వహించడానికి వీలు లేదు. మన “మౌనం” కూడా ఓ నేరంగా మారే స్థితి ఏర్పడింది. మనం కదలి, జనాన్ని కూడా కదిలించాల్సిన ఓ చారిత్రక దశ ముందుకొచ్చింది. ఢిల్లీలో మన మాతా పితల వంటి రైతాంగం పై లంఫెన్ గ్యాంగులతో రాళ్ళ దాడులు చేయించే ఆపద కాలంలో “మౌనం” ద్వారా మనం నేరస్తులుగా చరిత్రలో మిగిలిపోరాదు.
చరిత్రలో విద్వేష రాజనీతి పై ఆధారపడే “ఫాసిజం” బ్రతికి బట్టకట్టి జీవించింది. కుక్క గొడుగుల వంటి దాని క్షణిక బ్రతుక్కి కూడా ప్రజల్ని చీల్చే విద్వేష రాజనీతే ఆధారంగా ఉంటుంది. మనువాద రాజనీతి ఈ విద్వేష రాజనీతికి అతిపెద్ద పోషక పదార్ధం. అదే భారతదేశ సామాజిక వ్యవస్థలో ఫాసిస్టు పాలకులకు ఓ అదనపు ఆయుధం. దానికి బలైన తొలి రాజకీయ వేత్త గాంధీ! అట్టి గాంధీ హత్య రోజు ఇచ్చిన “సద్భావన దినం” సరిగ్గా ఫాసిస్టు “విద్వేష రాజనీతి” కి విరుద్ధమైనది. ఫాసిజాన్ని ఓడించాలంటే, ప్రజల మధ్య సఖ్యత అవసరం. ఈ పిలుపు ఫాసిజం పై రాజకీయ పోరుకు అవసరమైన సాంస్కృతిక పోరు కూడా! నేటి “సద్భావనా దివస్” పిలుపు రేపటి ఫాసిస్టు వ్యతిరేక సాంస్కృతిక పరివర్తన ప్రజల్లో కలిగించడానికి ఒక వనరు కూడా! ఈ సాంస్కృతిక ఉద్యమానికి నడుం బిగించిన రైతాంగ పోరాట శక్తుల చొరవని అభినందిస్తూనే, వారికి కేవలం సంఘీభావంగానే కాకుండా, ఫాసిజం ఓటమికోసం కూడా రాజకీయ శపథం చేద్దాం.