ఆ లక్ష్యం ఆత్మ నిర్భర భారతే…
(నిమ్మ రాంరెడ్డి)
రక్త దాహంతో పరుగెత్తిన పాదాలు మట్టి పాదాలైతే కానే కావు
అవి మతోన్మాద చిత్తుల జిత్తులు.
లక్షల ప్రాణ త్యాగ పునాదుల మీద రెపరెపలాడే జెండాను పీకేసిన చేతులు కడుపు నింపే చేతులు కానే కావు
అవి పచ్చి రక్త మాంస భోక్తల పంజాలు.
కాయో పండో తెలవనపుడే
చిగురులను తుంచేయడం సూక్ష్మగ్రాహుల సలక్షణం అనిపించుకుంటదా
నడిపించేవానికి పిల్లనా జెల్లనా
ఎనుకేమేసుకుంటండు
అపారమైన కీర్తి తప్ప
అతడు
భరతమాత నుదిటి మీది తిలకం
మహోగ్ర కాళీమాత కరవాలం
భారతీయతకు భద్ర కవచం
శతాదిక కోట్ల ప్రాణాలను రక్షించే ఆయుష్మాణ్ గుళిక.
గుంటకు ఆరువేలివ్వడం
ఉన్నోని పథకమా
లేనోని పథకమా
యూరియాకు వేపనూనె పూయడం మట్టిగుండెకు కందెన కాదా
ఇపుడు బస్తా యూరియా రెండొందల అరవైమూడే
నీకు తెలుసా
గింజకు పెంచిన గిట్టుబాటు
నీకెరుకేనా
కిసాన్ క్రెడిటు
ఎవరికి క్రెడిటు
తొంబైశాతం వ్యవసాయ సబ్సిడీలు ఎందుకున్నయ్
పచ్చవడడానికా ఎర్రవడడానికా
కల్లోల కరోనాకు ఆయుష్మాన్ గుళికలివ్వడం
కాచే గుండెనా
దోచే గుండెనా
శంబువట్టుకపోయే పరిస్థితిని నాలుగు గోడలకు పరిమితం చేయడం
గౌరవించడమా
గాండ్రించడామా
సైనికులకు బుల్లెట్ ప్రూఫులివ్వడం చరిత్రలో నీకెరుకేనా
రయ్యనవోయే రాజమార్గం
ఎవరికోసం
శత్రువుకు రొమ్మువిరిసి ఎదురు నిలిచింది వీరత్వం కాదా
అగ్ర రాజ్యం లేచి నిలబడి స్వాగతివ్వడం
వొట్టి ముచ్చటా
ప్రగతి పరుగులువెడుతుంటే
పత్తిత్తై పగలడం ఎర్రతనం
పక్కోని లాగు తడుత్తుంది
సూడు
చిల్లువడ్డకుండ
ఎన్నడైన నిండుతదా
కాలానుగుణ మార్పులు
ప్రకృతి నైజమే కదా
ఆ చేతులు
కడుపు నింపే చేతులే
ఆ కళ్లు
కాపు కాచే కళ్లే
ఆ గుండె
మండే అఖండ భారత జ్యోతే
ఆ లక్ష్యం
ఆత్మ నిర్భర భారతే
సందేహం వలదు
wait & see