అమరావతి :జనవరి 30 : పార్టీ రహిత ఎన్నికలయిన పంచాయతీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం మీద రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది.
మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఇది బాగా వివాదానికి దారి తీసింది. రూలింగ్ వైసిపి తీవ్రంగా స్పందించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడి మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మేనిఫెస్టో ఎన్నికల నియమావళికి విరుద్ధమని, తక్షణమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ రహితంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని.. పార్టీ గుర్తులు, కరపత్రాలు, ఫ్లెక్సీలు రాజకీయ పార్టీలు వాడకూడదని చట్టం స్పష్టంచేస్తోంది. అయినా, 40 సంవత్సరాల రాజకీయానుభవం, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మ్యానిఫెస్టో విడుదల చేయడం రాజ్యాంగ ఉల్లంఘన, దీని మీద కమిషన్ చర్య తీసుకోవాలని అని వైసిపి డిమాండ్ చేసింది.
పార్టీ తరఫున జనరల్ సెక్రెటరీ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రెటరీ మద్దిపాటి వెంకటరాజు పేరున ‘ తెలుగుదేశం పంచాయతీ ఎన్నికల మ్యానిఫెస్టో 2021’ ముద్రణ అయిందని, దీనిని జనవరి 28న చంద్రబాబునాయుడు విడుదల చేశారని అప్పిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు మీదే ఎన్నికల కమిషన్ స్పందించింది. తెలుగుదేశం నుంచి వివరణ కోరింది.శనివారం టీడీపీకి ఈ నోటీసు జారీచేస్తూ ఫిబ్రవరి 2వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
తెలుగుదేశం పార్టీ నుంచి సమాధానం రాకపోతే, కమిషనే ఒక నిర్ణయానికి వస్తుందనికమిషన్ పేర్కొంది. కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతకంతోనే నోటీసు జారీ అయింది.