ఆంధ్రప్రదేశ్ మళ్లీ మంచి రోజులొచ్చేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినపుడే నని తెలంగాణ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈ రోజు విజయవాడ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎపిసిసి అధ్యక్షుడితో కలసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన తొలిసారి విజయవాడ వచ్చి కాంగ్రెస్ కార్యాలయం సందర్శించారు. ఆయనకు పిసిసి అధ్యక్షుడు డాక్టర్ సాకె శైలజానాథ్ స్వాగతం పలికారు.
రాష్ట్ర విభజన జరిపినందుకు ఆంధ్రా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉండటం సహజమే నంటు, ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ రావడమే మార్గమని అన్నారు. దీనికి సాక్ష్యం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అని, ఆయన అన్ని ప్రాంతాల అభివృద్ధికి పాటుపడ్డారని చెప్పారు. అయితే, ఆంధ్రులు సమైక్యంగా ఉండాలని కోరుకున్నా,తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారని, దానితో విభజన అనివార్య మయిందని జగ్గారెడ్డి చెప్పారు. దీనివల్లే తొలుత టిడిపి, ఇపుడు వైసిపి అధికారంలోకి వచ్చిన విషయం ఆయన గుర్తు చేశారు.
కుల రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ కుతకుత ఉడుకు తున్నపుడు, రూలింగ్ లో ఉన్న వైసిసి, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీలు ఒకరినొకరు చీల్చి చెండాడుకుంటున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇపుడున్న వైషమ్య రాజకీయాలతో నాటి కాంగ్రెస్ పరిపాలనను పోలుస్తూ,”సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చాలా బాగుంది. మూడు ప్రాంతాలను సమాన దృష్టితో చూస్తూ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. అన్ని కులాలను మతాలను గౌరవించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే,’ అని జగ్గారెడ్డి అన్నారు.
“రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పై కోపమున్న మాట వాస్తవమే. కానీ రాష్ట్రాభివృద్ధి కాంగ్రె స్ పార్టీలోనే సాధ్యం,’ అని అన్నారు.
“పోలవరానికి జాతీయ హోదా కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం. ఏపీ లో కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగిన నష్టం ఏమీలేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్డ్ పార్టీ కి అధికారం ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తున్నారు. అపుడే మీకు మంచి రోజులు వస్తాయి,’ అని ఆయన అన్నారు.