పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల మీద దాడులు జరిగినా, ఎన్నికలలో ఎవరైనా దౌర్జన్యాలు జరిపినా ఆదుకునే తక్షణం సహాయం అందించేందుకు తెలుగుదేశం పార్టీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. దీనిని శుక్రవారం నాడు మాజీ ముఖ్యమంత్రి , టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
‘పంచాయితీ ఎన్నికల్లో ప్రలోభాలను తిప్పికొట్టండి. బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి. డబ్బు, మద్యం ఎక్కడ పంచినా అడ్డుకోండి. కండబలం, ధనబలం కన్నా ప్రజాబలమే గొప్పదని రుజువు చేయండి,’ అని ఈ రోజు చంద్రబాబు నాయుడు టిడిపి నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ పిలుపునిచ్చారు.
తొలిదశ పంచాయితీ ఎన్నికల నామినేషన్ల తొలి రోజు సందర్బంగా ఆయా ప్రాంతాల టిడిపి నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఎన్నికల దౌర్జన్యాలను నివారించేందుకు సూచనలిచ్చారు.
“గత మార్చి ఎన్నికల్లో నామినేషన్ పేపర్లు లాక్కుని చించేసి, అభ్యర్ధులను బెదిరించి, తప్పుడు కేసులు పెట్టి, అక్రమ నిర్బంధాలు చేసి, 19% జడ్ పిటిసిలు, 23%ఎంపిటిసిల్లో బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడ్డారు. వైసిపి నాయకుల హింసా, విధ్వంసాలను గ్రామీణ ప్రజలెవరూ మరిచిపోరు. విధ్వంసకాండకు పాల్పడిన వైసిపికి ఓటమితోనే గుణపాఠం చెప్పాలి,” అని పిలుపు నిచ్చారు.
“వీరవాసరంలో బెదిరింపులను ఎలా రికార్డింగ్ చేశారో చూడండి. అదే స్ఫూర్తితో ఎక్కడ బెదిరింపులకు పాల్పడినా రికార్డింగ్ చేయండి, ఎన్నికల అధికారులతోపాటు పార్టీ కార్యాలయానికి పంపండి. నాతో సహా టిడిపి బృందం 24గంటలు అందుబాటులో ఉంటాం. 24గంటలు కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది. టిడిపి లీగల్ సెల్ న్యాయవాదులంతా మీకు అందుబాటులో ఉంటారు. మీకు కావాల్సిన సలహాలు, సూచనలను అందజేస్తారు.
కాల్ సెంటర్ నెంబర్ 7306299999కు ఫిర్యాదు చేయాలి. వైసిపి నాయకుల దాడులు, దౌర్జన్యాలు విధ్వంసాలపై ఫొటోలు, వీడియో సాక్ష్యాధారాలను వాట్సాప్ నెంబర్ 7557557744కు పంపాలి,” అని చంద్రబాబు చెప్పారు.