పిఆర్ ఎసి సిఫార్సులు అధ్వాన్నంగా ఉండేందుకు కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం కారణమని టిఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తున్న వాదన పచ్చి అబద్ధమని తెలంగాణ జనసమితి నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో తెగించిన పోరాడిన ప్రభుత్వోద్యోగులకంటే కాంట్రాక్టర్ల మీదే ప్రభుత్వానికి ఎక్కువ ప్రేమ ఉండటమే ఫిట్ మెంట్ 7.5 శాతం మించక పోవడానికి కారణం అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ రోజు ఖమ్మం IMA ఫంక్షన్ హలులో జరిగిన ఖమ్మం , నల్గొండ , వరంగల్ పట్టభద్రుల MLC ఎన్నికల వ్యూహరచన సమావేశంలో ప్రొఫెసర్ కోదండ్ రామ్ పాల్గొన్నారు. మొదట, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు డా. శీలం పాపారావు ఆధ్వర్యంలో కోదండరామ్ ని గజమాలతో సత్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కోదండ రామ్ మాట్లాడుతూ పిఆర్ సి సిఫార్సులను తీవ్రంగా దుయ్యబట్టారు.తెలంగాణలో ప్రశ్నించే నాయకులు రావాలని చెబుతూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే నాయకులకు వోటేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రొఫెసర్ కోదండరామ్ ఏమన్నారంటే…
PRC పెరుగుతున్న ధరల అనుగుణంగా ఉద్యోగులకు పెంచాలని ,1978 తర్వాత ఇంత తక్కువగా ఇవ్వలేదు, ఏ కమిషన్ సిఫార్సు చేయలేదు.
తెలంగాణ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని PRC సిఫార్స్ ల మీద ప్రభుత్వం వివరణ ఇస్తున్నది. అయితే, అది ఒక కుంటి సాకు మాత్రమే.
తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పిన కేసీఆర్ తనకు తానే ఉద్యోగులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నపుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు.
కాని, కాంట్రాక్టర్లకు దోచిపెట్టటానికి ఈ ప్రభుత్వం పని చేస్తోంది. కమిషన్ కోసం ప్రాజెక్టు ఎస్టి మేషన్ పెంచడాని ఆర్థిక పరిస్థితి అడ్డురావడం లేదా?
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు చేసిన త్యాగం గొప్పది. కాని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల పై ఉన్న ప్రేమ ప్రభుత్వ ఉద్యోగులపై లేకపోవడం దారుణం.
తెలంగాణ జన సమితి ఉద్యోగులకు మద్దతుగా ఉంటుంది. ఉద్యోగాలు భర్తీ చేయటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
తెలంగాణ అకాంక్ష ను కేసీఆర్ తుంగ లోకి తొక్కారు. టిఆర్ యస్ ప్రభుత్వ లో నాయకులు తెలంగాణ వనరులను దోచుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష కోసం తెలంగాణ జన సమితి పని చేస్తున్నది.
తెలంగాణ అభివృద్ధి కోసం ఈ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి ప్రజలు అవకాశం కల్పించాలి. ఈ ప్రజా వ్యతిరేక పాలనకు అంతం పలకాలి.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు ధర్మాజన్ రెడ్డి , గోపగాని శంకర్ , బైరా రమేష్ , ఉపాధ్యక్షులు తాళ్లూరి వెంకటేశ్వర్లు , రమేష్ రెడ్డి , రాష్ట్ర కార్యదర్శులు శ్రీ శెల్ రెడ్డి , రాయప్ప , జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెబోయిన బాబు మరియు జిల్లా నాయకులు , రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .