ఏమనుకుంటున్నావ్!
ఏమనుకుంటున్నావ్
మేమెవరమనుకుంటున్నావ్
నీ కుర్చీకాడి కుక్కలం కాదు
నీ బిస్కిట్లకు బానిసలం అసలే కాదు.
మేం
ధర్మ చక్రంలోని ఇరవైనాలుగు ఆకులం
బీడు సమాజంలో చైత్య బీజాలు నాటే చెమట పూల వర్షాలం
మేం లేకుంటే
నువ్వు రాలిపోయే తోకచుక్కవే.
మమ్ములను గెలికితే
కేంద్రక సంలీనమే
ఆపడం
నీ అబ్బ తరం కాదు
అగో
సిరాయోధుల సిగాల జాతర
ఈ సారి అడ్డగాడిదను బలివ్వడమే
అది పనీ జేత్తలేదు
పాలూ ఇత్తలేదు
గడ్డ మీద కూకొని మెక్కుతుంది
వేల బలిదానాల తూలికా పాన్పుమీద తూగుతుంది
హక్కుల అంగీలు జింపుతూ
బాధ్యతల బరువులు మోపుతూ
వేతన వెన్ను విరవమని చెప్పడంలో ఆంతర్యం
ఆ సాయంకాల సన్నాసులకే ఎరుక
జీవన రేఖా సమతుల్యతకై
దశాబ్దాలుగా పాటిస్తున్న
తోడ్పాటు కలషాన్ని పగలగొట్టడం
దాని కుటిల నీతికే చెల్లు
సేవకా కలాలన్ని కర్రులై
వాతల వాయినాలిస్తే గాని
నాగవడిగె బరిసెలు నాట్యమాడి
నరాలను ముద్దాడుతే గాని
దాని తాగింది దిగదు
తరాజు సక్కగవదు
ఓ సేవకాగణ నాయకుల్లారా….
ఇక దౌడుతీయండి
మీ వెనక మేమున్నాం
లేకుంటే
రక్తమాంసాలు క్షయమే
భోజగద్దలకు బోనమె
(నిమ్మా రాంరెడ్డి)