(నిమ్మ రాంరెడ్డి)
తల్లిని
రాళ్లకేసి కొడుతుంటే
రక్తాలు కారవట్టె
నీళ్లల్లో ముంచుతుంటే
ఊపిరాడుతలేదాయె
పట్టుచీర కట్టిన తల్లి
పాత చీరలకై తండ్లాట
ఇనప్పెట్టెలోని నగలన్నీ
బ్యాంకులోన తనకా
కొట్లాడి కట్టుకున్న గోడ అవతలింట్లో
కిలకిలా రావాలు
రక్తార్పణతో సిద్ధించిన ఈ ఇంట్లో
బిడ్డల ఆహాకారాలు
ఇదేందంటే
ఈపుకు సున్నమే
కళ్లు మూసుకుంటే
కడుపులో కటకటే
ఊరిస్తూ ఊరించే
ఊకదంపుడు మాటలు
స్వలాభ కార్యాలకు
స్వాగతపు బాటలు
సేవకా చక్రాలకు
కందెన కరువు
మూడీకల అల్లికకు
ముప్పైమూణ్ణెళ్ల అరువు
చూసిన కళ్లకు రాసిన కలాలకు మధ్య
మాటేసిన ఏలికపాము
కడుపులు కొట్టి కడుపునింపుకునే కక్రుత్తిలో తారాజువ్వలు
పాములకు పాలువోస్తే గంతే మరి
ఏకతాటిపై పిడికిళ్లెత్తితే
జేజమ్మ దిగొచ్చింది
ఒక్క అడుగు ఎనకకేసినం
ముందుకు దూకితే
ఈ కొండదేవర దిగిరాడా
అమ్మా!
నీ బిడ్డల కళ్లల్లో
నీరు ఇంకక ముందే
కొంగు నడుముకు చుట్టు
కొడవళ్లు చేపట్టు
కొంగు నడుముకు చుట్టు
కొడవళ్లు చేపట్టు