ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలయినపుడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదలచేయడం పట్ల వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
40 సంవత్సరాల రాజకీయానుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినఅనుభవంతో కాకలు తీరిని చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలచేయడం లక్ష్మణ రేఖ దాటడం కాదా అని అంబటి ప్రశ్నించారు.
‘ప్రజాస్వామ్యంలో ఉన్న వారందరికీ ఇదో విచిత్రంగా ఉంది. ఈ మేనిఫెస్టోలో ఒకవైపు చంద్రబాబు, మరోవైపు తన కొడుకు లోకేష్ ఫోటోలు కూడా వేశారు. ఇవన్నీ చూస్తుంటే.. పిచ్చి ముదిరింది, రోకలి చుట్టమన్నట్టు ఉంది చంద్రబాబు వ్యవహారం. గ్రామ పంచాయితీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం ఏమిటి? ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాదా? పల్లెల్లో జరిగే ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయం ఉండకూడదని, పార్టీలకు అతీతంగా పంచాయితీ ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిస్తే చంద్రబాబు పంచాయితీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేస్తారా?,’ అని అంబటి ఈ రోజు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నించారు.
ఒక రాజకీయ పార్టీ పంచాయతీ ఎన్నికలకు మ్యానిఫెస్టో విడుదల చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం కాదా అని ప్రశ్నిస్తూ ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబుపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
‘‘మీకు చంద్రబాబు సన్నిహితుడైనా సరే, ఆయనపై ఏం యాక్షన్ తీసుకుంటారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది,’ అని ఆయన అన్నాారు.
ఎస్ఈసీ రాజ్యాంగ స్ఫూర్తితో కాకుండా చంద్రబాబు స్ఫూర్తితో పనిచేస్తున్నారని అంటూ పార్టీ రహిత ఎన్నికలను రాజకీయ పార్టీల ఎన్నికలుగా మార్చాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు చేసిన ఈ దుర్మార్గం మీద చట్టపరంగా చర్య తీసుకునే ఉద్దేశం నిమ్మగడ్డకు ఉందా? లేదా?. ఉంటే, టీడీపీ గుర్తింపు రద్దు చేస్తారా? లేక కోర్టులో కేసులు వేసి లంచ్ మోషన్లు, హౌజ్ మోషన్లు వేస్తారా?.’ రమేష్ కుమార్ చెప్పాలని అన్నారు.
‘అభ్యర్తులకు గుర్తులు కూడా ల్లేని పంచాయితీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన మతి పోయిన మాజీ ముఖ్యమంత్రిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో తక్షణం సమాధానం చెప్పా,’లని డిమాండ్ చేశారు.
‘ పంచాయితీ ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలు. గుర్తులు ఏమీ ఉండవు. జెండాలు కూడా ఉండవు. రాజకీయ ప్రచారాలు ఉండవు. అయితే, చాటున ఆయా పార్టీలకు చెందిన వ్యక్తులు కొంతమంది పోటీ చేయవచ్చు. అయితే, ఇవేవో జనరల్ ఎలక్షన్ మాదిరిగా.. ఎన్నికల కమిషన్ ఎన్టీఆర్, వైఎస్ఆర్ విగ్రహాలకు గుడ్డలు కప్పే ప్రయత్నం చేస్తున్నారు,’ అని అంబడి విమర్శించారు.