తమ్ముడు పవన్ కల్యాణ్ కి అండగా ఉండేందుకు మెగా స్టార్ చిరంజీవి జనసేన లో చేరతారా?
జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఈ విషయం మీద ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ వెంట చిరంజీవి రాబోతున్నారని విజయవాడలో మనోహర్ అన్నారని వార్త వచ్చింది. వివరాలు కనుగొనేందుకు నాదెండ్ల మనోహర్ తో మాట్లాడాలని మేం చేసిన ప్రయత్నం ఫలించలేదు. అయితే, పవన్ కు చిరు అండగా ఉంటానని హామీ ఇచ్చారని చెబుతూ ఇది త్వరలోనే జరుగుతుందని మనోహర్ అన్నారు.
పవన్ కు చిరంజీవి నుంచి నైతిక మద్దతు ఉంటుందని మనోహర్ అన్నారు. నైతిక మద్దతు అంటే ఏమిటి? ఇపుడు రాష్ట్రంలో చర్చంతా రెడ్డి,కమ్మ రాజకీయాలతోనే సాగుతూ ఉంది. అంటే వైసిపి, తెలుగుదేశం పార్టీల చుట్టు రాజకీయ చర్చ నడుస్తూ ఉంది. దీన్నుంచి కొద్ది సేపు చర్చను జనసేన వైపు మళ్లించేందుకు నాదెండ్ల మనోహర్ ఈ ‘మెగాస్త్రం’ వేశారా.
చిరంజీవి మొదటి రాజకీయ ప్రస్తానం నిరాశగా ముగిసింది. ఆయన స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిసేసి తాను మంత్రిగా కేంద్రానికి వెళ్లి సంతృప్తి చెందారు. అయితే, కేంద్ర మంత్రిగా ఉన్నపుడు ఆయన రాజకీయంగా బలపడలేకపోయారు. కాకపోతే, టూరిజం మంత్రి సగం ప్రపంచం తిరిగారు. ఉమ్మడి ఆంధ్రకి టూరిజం ప్రాజక్లులుకూడా ఏవీ తెచ్చినట్లు లేదు తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ చతికిల పడటంతో ఆయన మౌనంగా రాజకీయాల నుంచి నిష్క్రమించారు. సినిమాలలో సెటిలై పోయారు. ఆయన సెకండ్ సినిమాలు బాగా హిట్టయ్యాయి. బాగా నిలదొక్కుకున్నారు.
తమ్ముడు పవన్ రాజకీయాల్లో ఇంకా వూగిసలాడుతూనే ఉన్నారు. ఎలాగైనా రాజకీయంగా నిలదొక్కుకోవడానికి పవన్ కల్యాణ్ చాలా వ్యూహాలు వేస్తున్నారు. గతంలో ప్రకటించిన ఇజాలు వదిలేసుకున్నారు. షే గవేరాను వదిలించుకున్నారు. విప్లవకారుడు తరిమెల నాగిరెడ్డిని విడిచిపెట్టారు. తన తెద్దామనుకున్నా ఇజం పుస్తకాలు మానేశారు. కేంద్రం దక్షిణాదిని చిన్న చూపుచూస్తున్నదని, అవమాన పరుస్తున్నదని, హిందీ రుద్దుతూ ఉందన్న ఆవేశ ప్రసంగాలను మర్చిపోయారు.
ఇపుడ చక్కగా నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని హిందూత్వంలోకి మారారు. హిందూసెంటిమెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. డిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసే ప్రయత్నం చేశారు. అది వీలు కాలేదు గాని హోం మంత్రి అమిత్ షా దర్శనమయింది. ఇంతకు మించి రాజకీయంగా ఆయన బలపడినట్లు కనిపించదు. కాకపోతే, ఏవూరెళ్లినా జనం బాగా వస్తున్నారు.
ఇలాంటపుడు నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటన చిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే, చిరంజీవి వంటి హైప్రొఫైల్ వ్యక్తికి రాష్ట్రంలో స్పేస్ ఎక్కడుంది? కాంగ్రెస్ లేదు. తెలుగుదేశంలోకి రాలేడు. వైసిపిలో చేరలేడు. బిజెపిలో చేరి చేసేదేమీ లేదు. ఇక మిగిలింది జనసేన. ప్రజారాజ్యం మూసిన చిరంజీవి జనసేన నాయకత్వం స్వీకరిస్తారా? ఇలాంటి కూర్చునేందుకు, నిలబడేందుకు చోటులేని పరిస్థితుల్లో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఏంచేస్తారు?
పవన్ కు నైతిక మద్దతు నిస్తారని, ఆయన పవన్ తోనే ఉంటారని మనోహర్ అన్నారు. నైతిక మద్దతీయవచ్చు. అయితే, ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో రగులుతున్న వైషమ్య రాజకీయాలలో నైతిక మద్దతు వల్ల సాధించేమీ ఉండదు.
రాజకీయా చర్చను వైసిపి, తెలుగుదేశం నుంచి మళ్లించడానికి నాదెండ్ల మనోహర్ వేసిన మెగాస్త్రమేమో ఇది.