పిఆర్ సిలో తెలంగాణ ఉద్యోగులకు కేవలం 7.5% ఫిట్మెంట్ ప్రకటించడం తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఊహించని నిరాశ తెచ్చిందని మాజీ శాసనసభ్యుడు, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఉద్యోగులు 63 శాతం ఫిట్మెంట్ అడిగితే కేవలం 7.5 శాతం ఎలా ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులు ఆశించిన కనీస వేతనం రూ. 25000 కాకుండా కేవలం రూ. 19000 సూచించడం అన్యాయమని ఆయన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.
పెరిగిన పెట్రోలు, డీజిల్, నిత్యావసరాలు, ఇంటి అద్దెలకు అనుగుణంగా ప్రతిపాదనలు లేవని ఆయన అన్నారు.
వంశీ ఇంకా ఏమన్నారంటే…
*ఇంటి అద్దెకు హెచ్ఆర్ఏ ను గణనీయంగా తగ్గిస్తూ పీఆర్సీ నివేదికల్లో పేర్కొన్నారు. ఇప్పుడున్న దాని ప్రకారం, కొత్త జిల్లాల ఏర్పాటుతో హెచ్ఆర్ఏ పెంచాలని ఉద్యోగులు విన్నవిస్తే కమిషన్ మాత్రం తగ్గిస్తూ సూచనలు చేసింది. ఇప్పటి వరకు 30, 20, 14.5, 12 శాతం హెచ్ఆర్ఏ ఉండగా.. పీఆర్సీ తొలి నివేదికలో మాత్రం 24, 17, 13, 11 శాతంగా సూచించారు.
*రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో భాగంగా గ్రాట్యుటీ చెల్లింపుల్లో రూ. 20 లక్షలు ఆశిస్తే కేవలం రూ. 16 లక్షలు చెల్లించాలని ప్రతిపాదించారు.
*ఉచిత EHS అని చెప్పి ఇప్పుడు జీతంలో నుండి 1% కొత విధించడం అన్యాయం.
*ఉద్యోగుల పిల్లల స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ గతంలో ఉన్న రూ. 2500ని తగ్గించి రూ. 2000కు ప్రతిపాదించడం ఇబ్బంది.
* సీపీఎస్ రద్దు కోసం పోరాడుతున్న లక్షలాది ఉద్యోగస్థులకు ఈ నివేదిక మరింత శాపంగా మారనుంది.
* తక్షణమే అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, సీపీఎస్ సంఘాలతో చర్చించి అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి.
*ఉద్యోగ, ఉపాద్యాయ, పెన్షనర్లకు అన్యాయం జరగనియ్యం. వారి పక్షాన ఏ పోరాటానికైనా సిద్ధం.