ఎపిలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక కుట్ర చేస్తున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు.
ఏకగ్రీవ పంచాయతీలకు ముందు నుంచీ అన్ని రాష్ట్రాల్లో ప్రోత్సాహకాలు ఇస్తున్నారని, అయితే ఈ సాకు చెప్పి ఎక్కువ ఏకగ్రీవాలు సాధించాలన్న వంకతో భయపెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ లో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని సుధాకర్ రెడ్డి తెలిపారు.
గతంలో వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉపయోగించిన అక్రమ పద్దతులే ఇప్పుడు ఉపయోగిస్తున్నారని ఆయన విమర్శించారు.
మంగళవారం చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని కొన్నిగ్రామాల్లో వైకాపా నేతలు బెదిరింపులు ప్రారంభించారని సుధాకర్ రెడ్డి ఆరోపించారు.
వైకాపా వారిపై పోటీకి దిగే ప్రతిపక్ష పార్టీల వారిని సామ, ధాన, బేధ ,దండోపాయంతో లొంగదీసుకునేందుకు పలు చర్యలు ప్రారంభించారని తెలిపారు.
“నామినేషన్లు వేయాలనుకునే వారిని గుర్తించి భయపెట్టడం, డబ్బు ఆశచూపడం, కాంట్రాక్టర్లకు ఆగివున్న బిల్లులు ఇప్పించడం లాంటివి చేస్తున్నారు. అలా కాదని ఎదరు తిరిగిన వారపై పోలీసుల అండతో లోబరచుకునేందుకుప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం అందిందది. మంత్రులు, ఎమ్మెల్యేలు వెనక వుండి అక్రమ వ్యవహారాలు నడిపిస్తున్నారు,” అని ఆయన అన్నారు.
ఇలాంటి అప్రజాస్వామిక, ధౌర్జన్యకర చర్యలకు పాల్పడేవారికి కొమ్మకాసే అధికారులు, పోలీసులు తగిన మూల్యం చెల్లించక తప్పదనిఆయన చెప్పారు. గత ఎన్నికల్లో తప్పుచేసిన అధికారులకు ఇదే పరిస్థితి ఎదురయిందని అన్నారు. ప్రజలు కూడా ఇలాంటి ప్రయత్నాలకు బెదరకుండా నిస్వార్థంగా సేవ చేసే అభ్యర్థులను స్వేచ్ఛగా ఎన్నుకోవాలని అన్నారు.