(తెలుగు కవిత్వంలో పరాయీకరణ బహుముఖ రూప పరిశీలన)
(పిళ్లా కుమారస్వామి)
మనిషి మట్టి పరిమళాన్ని కోల్పోయాడు
ప్రాణ పరిమళాన్ని కోల్పోయిన
ఒట్టి కాగితం పువ్వు మనిషి
– మల్లెల నరసింహమూర్తి (మట్టి గొంతుక)
ఇలా మనిషి కోల్పోయిన సహజ స్వభావాన్ని కవులు గుర్తించినంతగా ఎవరూ గుర్తించ లేకపోయారు. మనిషి తన సహజ స్వభావాల్ని కోల్పోవడం పరాయీకరణ. ఇది ప్రపంచీకరణ ప్రారంభమయ్యాక ప్రస్ఫుటంగా కనిపించింది.
ప్రపంచీకరణ ప్రారంభంలో అర్థం కాక అయోమయంలో నున్న కవులు, కళాకారులు, రచయితలు ప్రపంచీకరణ సునామీ తరువాత పరాయీకరణను బాగా గుర్తించారు. తమ రచనల్లో ఒక నోస్టాల్జియాతో, ఒక ఆవేదనతో, ఆక్రందనతో మనిషి కోల్పోయిన దాన్ని వ్యక్తీకరించారు.
పరాయీకరణ భావనను మొట్టమొదట ప్రవేశపెట్టిన వ్యక్తి హెగెల్. మానవుడు తన పరిణామ క్రమంలో ప్రకృతి నుంచి తాను ఏర్పరచుకున్న ఆధ్యాత్మిక భావాల నుంచి వేరుపడడం మొదలైనప్పటి నుంచి మనిషి పరాయీకరణ ప్రారంభమైందని హెగెల్ భావించాడు.
హెగెల్ తరువాత పరాయీకరణ భావనను ఒక ఖచ్చితమైన పద్ధతిలో వాస్తవిక దృష్టితో చెప్పిన వాడు మార్క్స్. మనిషి తన శ్రమను తన జీవనం కోసం అమ్ముకుంటాడు. ఇది అనివార్యమైంది.
అంతేకాక పెట్టుబడిదారుని ఉత్పత్తి పెంచేందుకు తన శ్రమను పూర్తిగా ధారపోస్తాడు. అయితే తాను ఉత్పత్తి చేసే వస్తువుపై అతనికి ఎలాంటి అధికారం ఉండదు. పైగా దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి,
అవకాశం అతనికి ఉండదు. ఆ వస్తువును తయారు చేయటం అతడు బుద్ధి పూర్వకంగా చేస్తున్న పని కాదు. కేవలం యాంత్రికం. ముఖ్యంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో ఈ పరిణామం అనివార్యమవుతుంది.
ఈ నేపథ్యంలో మనిషి (శ్రామికుడు) ప్రకృతి నుంచి తన నుంచి తన వర్గీయుల నుంచి పూర్తిగా వేరుపడి పోతాడు. ఒక ప్రాణమున్న వస్తువుగా మారిపోతాడు. మనిషన్న వాడు అతనిలో మాయమై పోతాడు. ఇదీ మార్క్స్ పరాయీకరణ భావనకు ప్రవేశపెట్టిన విధానం. పరాయీకరణను కవిత్వీకరిస్తాడు కవి ఇలా….
పరాయీకరణంటే ఆరక్షరాల పొడి పదం కానేకాదు/ మన ప్రేమలు, మన అనురాగాలు, మన పెనవేసుకున్న ముప్పిరితాడు/ ఆత్మీయతల్ని మనకు మనం తెంపేసుకోవడమే/ వ్యక్తులమైన మనం వస్తువులోకి రూపాంతరం చెందుతున్నాం.
మార్క్స్ చెప్పిన భావనలు ప్రస్తుతం మన కళ్లెదుట ఆవిష్కృతమవుతోంది. చాలామంది కవులు పరాయీకరణను బాగా గుర్తించారు. విభిన్న కోణాల్లో దీన్ని ఆవిష్కరించారు.
భూస్వామిక సమాజంలో మనిషి మనుగడంతా పరస్పరాధీనతలో గడచింది. భూమిని దున్నాలంటే పలుగూ, పార, నాగలి, పశువులు ఇలా అనేక పనిముట్లు అవసరమయ్యేవి. ఇవన్నీ ఒక వ్యక్తి స్వతంతంగాచేయగలిగే పనులు కావు. దాంతో పాటు ఉత్పత్తి శ్రమించే మనిషి మనుగడకు అవసరమయ్యేది. ఉత్పత్తిలో భాగస్వామ్యం, ఉత్పాదన అవసరం మనిషిని పరాయీకరణకు గురిచేసేది కాదు. సమాజంలో మనిషి పాత్ర రైతుగానో, కూలీగానో, చేతివృత్తి కార్మికునిగానో, రాజుగానో ఉండేది. శ్రామికుల మధ్య సంబంధం పేడిన తాడులాగా బలంగా ఉండేది.
నూతన ఆవిష్కరణలతో యంత్రాల వినియోగం పెరిగింది. ఉత్పత్తి పెంచడానికి ఉపయోగపడింది. శ్రమ దోపిడీని తీవ్రతరం చేయడం తద్వారా పెట్టుబడిదారుడు తన లాభాలను పెంచుకోవడానికి ఇవన్నీ దోహదం చేశాయి. యాంత్రీకరణ పెరిగాక మనుషుల మధ్య వస్తువుల
మార్పిడి, అవసరం బాగా తగ్గిపోయింది. పారిశ్రామిక విప్లవం తరువాత మనిషి యంత్రాల మధ్య బందీ అయ్యాడు. మనిషి కూడా ఒక జీవమున్న యంత్రం లాగా మార్చబడినాడు.
యాంత్రికత మానవ సంబంధాల్ని పటాపంచలు చేస్తోందన్న విషయాన్ని గుర్తించిన కవి గేరా ఇలా చెబుతాడు తన కవితలో.
మందలో తిరుగుతున్నా / అందరికీ దూరం చేస్తున్న యాంత్రికత/ ఒక నిర్లిప్తత/ ఒక స్థబ్దత(గోగ్రహణం).
మనుషుల మధ్య ఏర్పడిన అగాధాల్ని గుర్తించిన కవి హృదయం తల్లడిల్లి పోతోంది.
వేదనాభరితంగా, ఆక్రోశం గా ఇలా చెబుతాడు కవి కె. శివారెడ్డి.
ఇద్దర్ని కలిపే ఒక అద్భుత శక్తి స్పర్శ
ఇద్దరు కలవకుంటే ఏముందిక్కడ ఎడారి తప్ప
– (అజేయం)
పై విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కార్ల పరిశ్రమను తీసుకుందాం. ఒక కారును ఒక వ్యక్తి స్వతంత్రంగా తయారు చేయలేడు. ఒక విడిభాగాన్ని మాత్రమే తయారు చేయగలడు. దాంతో ఆ వ్యక్తికి తాను కారును చేశానన్న తృప్తి, ఆనందం మిగలదు. ఆశ్రామికుడు లేకుండా, ఆ విడిభాగం లేకుండా కారు తయారు కాజాలదు. కాని కారు నిర్మాణంలో పూర్తి బాధ్యత అతనిది లేదు. పైగా ఆ వస్తువును తాను వినియోగించలేడు. దాంతో అతను పరాయీకరణకు గురవుతాడు. అదే మధ్య యుగాలలోనైతే ఒక చేతి వృత్తిదారుని చేతిలో ఒక వస్తువు పూర్తిగా తయారయ్యేది. ఆ వస్తువుతో
అతనికి పూర్తి సంబందం ఉండేది.తాను ఆవస్తువును చేశానన్న తృప్తి అతనికి మిగిలేది. ఆ వస్తువుతో అతని సంబంధం పూర్తిగా అతని శ్రమకు, మేధకు సంబంధించినది. మానవుని శక్తియుక్తులు, ఉత్పాదనలు తమ సహజ స్వభావాన్ని కోల్పోవడమే పరాయీకరణ.
యాంత్రీకరణ పెట్టుబడిదారి విధానానికి ఒక చోదకశక్తి. పెట్టుబడి పెరగాలంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు రావాలి. లాభాలు రావాలంటే ఎక్కువ ఉత్పత్తి, ఎక్కువ అమ్మకం జరగాలి. ఉత్పత్తినిపెంచడానికి కొత్త యంత్రాల ఆవిష్కరణ పెరిగింది. అమ్మకాలు పెరగడానికి సరిహద్దుల్లేని ప్రపంచం
కావాలి. ప్రపంచీకరణ దీనికి తోడ్పడింది. వస్తువులు ఎంతగా వినియోగించబడితే అంతగా పెట్టుబడిదారీ విధానం తన మనుగడను సాగించగలదు. అందుకే వినియోగ వస్తువుల మాయాజాలం సృష్టించింది.
వినిమయ వస్తులవుల పట్ల ఆకర్షణ, అవసరం ప్రజల్లో కల్పించాలి. ఇదంతా జరగాలంటే ఒక భావజాలం ప్రజల్లో ఏర్పడాలి.
భావజాలం అంటే ప్రపంచాన్ని గురించి భావన. ఇది కళలు, చట్టాలు, ఆర్థిక కార్యకలాపాల్లో అంతర్గతంగా పనిచేస్తూ ఉంటుంది. ఇది వ్యక్తుల పైన, సమాజంపైన ప్రభావితం చేస్తూ ఉంటుంది.
భూస్వామిక భావజాలం పూర్తిగా అంతరించాలంటే పెట్టుబడిదారీ భావజాలం పెరగాలి. పెట్టుబడి దారీ విధానానికి పునాది వస్తువినియోగం విస్తృతం కావడం మీద ఆధారపడింది. ఎప్పుడో పరలోకంలో లభించే సౌకర్యాలను ఇక్కడే పొందే అవకాశాన్ని చెబుతుంది. నీది నువ్వు చూసుకోమని చెబుతుంది.
వ్యక్తిగత పురోగమనం ప్రధానమని చెబుతుంది. ఈ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మూడు మార్గాలను ఎంచుకున్నారు. మొదటగా ఇలాంటి భావాల్ని సులభంగా తీసుకెళ్లడానికి టీవీ సీరియళ్ళు, ప్రకటనలు మొదలైన ప్రసార మాధ్యమాలను ఉపయోగిస్తున్నారు. రెండోది పాలకుల ద్వారా ఈ భావాలు సత్యమని ప్రకటింపచేస్తుంటారు. మూడోది రకరకాల పథకాలతో ఎరవేయడం.
భావాలు ప్రజల్ని మార్చుతాయి. ఆచరణకు పురికొల్పుతాయి. పాలకవర్గాల భావజాలం ప్రజల భావజాలంగా చలామణిలో ఉంటుంది. దీన్ని మార్క్స్ గుర్తించారు. భావజాలాన్ని చలామణిలో ఉంచగలిగే అద్భుత సాధనం మీడియా.
వినిమయ సంస్కృతి ప్రబలంగా పెరిగే కొద్ది ప్రజల్లో పరాయీకరణ సహజం. ప్రతిది సరుకుగా మారి కొనటం, అమ్మటం సాధ్యమయ్యేచోట పరాయీకరణ సర్వత్రా ఉంటుంది. శ్రామికుల శ్రమ ఒక సరుకుగా మారిపోతుంది. ఈ వ్యవస్థలో శ్రామికులు సమిష్టిగా పనిచేస్తూ పరాయీకరణకు గురయ్యే విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని చేధించడానికి శ్రామికులు సమిష్టిగా పోరాడి సమాజాన్ని మొత్తంగా ఈ దుర్గతి నుంచి రక్షిస్తారని మార్క్స్ భావించాడు. కాని ప్రస్తుతం శ్రామిక వర్గం ఈ వినియోగవస్తువుల మాయాజాలంలో చిక్కుకుపోయారు. దీన్నుంచి బయట పడేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది శ్రామిక వర్గం.
మనదేశంలో ఈ సంస్కృతి పెరగడానికి దోహదపడిన అంశం ప్రపంచీకరణ. ఈ ప్రపంచీకరణ పెట్టుబడిదారీ దేశాల లాభాల దురాశ ఫలితంగా ఏర్పడింది. ప్రపంచీకరణ అంటే ఏమిటి? అనే వాళ్ళు బహుకొద్దిమంది మాత్రమే. దీన్ని విశదం చేస్తున్నాడు ఎండ్లూరి సుధాకర్ తన కవితలో ఇలా.
ప్రపంచీకరణ అంటే ఏమిటి? ఎక్కడుంది?
ఏదీ చూపించమని నా అమెరికా మిత్రుడడిగాడు.
నిండు గోదారి పక్కన
నీళ్ల పొట్లాలమ్ముకుంటున్న పనిబాలున్ని చూపించాను.
కొబ్బరి బోండాలమ్ముకుంటూ కోకోకోలా తాగుతున్న కోనసీమ కొబ్బరి వ్యాపారిని చూపించాను.
పెరుగు, పాలు అమ్మాక పెప్సీ సేవిస్తూ సెల్లు మాట్లాడుతున్న చల్లనమ్మను చూపించాను.
(ప్రపంచీకరణ)
ప్రపంచీకరణ మనిషి పరాయీకరణ కావడానికి ఇతోధికంగా దోహదం చేస్తోంది. కానీ మొదట్లో ప్రపంచీకరణ వల్ల చాలా మేలు కలిగిందని చాలామంది మేధావులు భావించారు. ముఖ్యంగా రైల్వే రిజర్వేషన్, టెలిఫోన్ సౌకర్యాలు, బ్యాంకుల లావాదేవీలు సులభతరం కావడం మొదలైనవన్నీ చూసి ప్రపంచీకరణ వల్లనే ఇలా జరిగిందని సంబరపడ్డారు. తదనంతర పరిణామాల్లో అందరూ కలవరపడ్డారు. పల్లెలు ధ్వంసమయ్యాయి. చేతివృత్తులు అదృశ్యమయ్యాయి. మనిషి మనిషికి మధ్య సంబంధాలు క్షీణించాయి. కలసి మాట్లాడు కోవడం కరువైంది.
పల్లెకన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
తల్లీ బందీయై పోయిందో కనిపించని కుట్రల…
అంటూ గోరేటి వెంకన్న ప్రపంచీకరణానంతర పరిణామాలను తన పాటలో వ్యక్తీకరించారు. పల్లెకున్న తనదైన సంస్కృతిని విధ్వంసం చేసింది.
ఒక జాతిని లొంగదీసుకోవడానికి వారి సంస్కృతి పరాయీకరించబడాలి. నగరీకరణ, వ్యాపారం, మార్కెట్ స్వేచ్చ, దేశీయ సంస్కృతిని
పెనుమార్పులకు గురిచేశాయి. సంస్కృతిలో మార్పులకు బదులు మొత్తం ప్రపంచదేశాల సంస్కృతిని ఏకం చేయడానికి పెట్టుబడిదారీ వినిమయ సంస్కృతి కృషి చేసింది.ఇదంతా పడమటి గాలి పనే.
లాటిన్ అమెరికన్ గాలి మనల్ని నిద్రలేపింది. పోరుబాట పట్టించింది. తన దారిన తాను పోయే తత్వం, పక్క మనిషి పట్ల మానవతా దృష్టి లోపించడం కేవలం ఈ వ్యవస్థలో ఒక లక్షణం. అందుకేనేమో నాళేశ్వరం శంకరం ఇలా తన కవితలో చెబుతాడీ విషయాన్ని.
ఇప్పుడు ఎవరిలోనైనా ఆత్మ ఉంటే కదా! కొనుక్కోవడానికి మనుషులు దొరికేది, ఇప్పుడు మనుష్యుల మధ్యన మమకారముంటేకదా , దానికి అస్థిత్వ సంపద అలవడేది.
– (ఒక విపత్కర పరిస్థితి – ఒక అంతర్మధనం)
మనిషి తన మనుగడకోసం శ్రమను అమ్ము కుంటాడు. తన శ్రమ కేవలం అమ్ముకోవడానికి, తన అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగ పడుతుంది. కానీ తన శ్రమచే తయారైన వస్తువు తన ఆధీనంలో ఉండదు. పైగా పూర్తిగా తన శ్రమతో ఆ వస్తువు తయారు కాజాలదు. దాంతో మనిషి
సమూహం నుంచి వేరుపడి ఒంటరి అవుతాడు. ఇలా ఒక జంతు స్థాయిలోకి కుదించబడుతాడు.
అంటే తన ఆలోచన శక్తిని కోల్పోతాడన్నమాట. అదే సమయంలో డబ్బు సమాజంపై ఆధిపత్యం వహిస్తుంది. అది దేనినైనా కొనగల శక్తిగా
తయారవుతుంది. డబ్బుకున్న లక్షణాలన్ని డబ్బుగల వ్యక్తికి సంక్రమిస్తాయి. సంపన్నుడు ఒక డబ్బు శక్తిగా మారిపోతాడు. ఒక మనిషి వ్యక్తిత్వం అతనికున్న డబ్బు మీద ఆధారపడి ఉంటుంది. డబ్బున్నకురూపి ఒక సౌందర్యవతిని కొనుక్కో గలడు. అంటే డబ్బు కురూపి లక్షణాన్ని తీసి వేసిందన్నమాట. అలాగే డబ్బున్న కుంటివాడు ఒక విమానాన్నే కొనగలడు. ఎందుకంటే డబ్బు అవిటితనాన్ని తీసివేసింది కనుక. డబ్బున్న దుర్మార్గునికి, అవినీతి పరునికి గౌరవ మర్యాదలు అందుతాయి. ఎందుకంటే డబ్బు చాలా మంచిది కాబట్టి, అది ఉన్న మనిషి కూడా చాలా మంచి వాడుగా చలామణి అవుతాడు. డబ్బు విలువే మనిషి విలువ.
పరాయీకరణ నుంచి మనిషి బయట పడే ప్రయత్నంలో డబ్బును ఆశ్రయిస్తాడు. సంపద పెంచుకోవడం ద్వారా తన ఒంటరి తనాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు. డబ్బుంటే చాలు అన్నీ వస్తాయనే భ్రమ ఏర్పడుతుంది. అందుకే బిల్‌గేట్స్, టాటాబిర్లాలు, వారెన్ బఫెట్స్ ఆదర్శవంతులుయ్యారు.
జీవితాల్ని త్యాగాల్ని చేసిన పొట్టి శ్రీరాములు, గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, కా॥ సుందరయ్య, వీరేశలింగం పంతులు లాంటి వారు వెనుక వరుసలోకి వెళ్లిపోయారు. కవయిత్రి డా॥ జె.అనూరాధ
తన కవితలో ఈ విషయాన్ని ప్రకటించిందిలా.
భార్య కడుపులో పెరిగే పిండం /మరో బిల్‌గేట్స్ కావాలని సంకల్పం/ కాబోయే అమ్మానాన్నలకి ఈ తలపే సగం బలం.
(కంచె మేసినచేను)
పరాయీకరణలోంచి మనిషి బయటపడటానికి శతవిధాల పోరాడతాడు. ఊపిరి సలపని ఒంటరితనాన్ని ఏవగించుకుంటాడు. మనిషి ఉక్కిరిబిక్కిరిలోంచి బయటపడేందుకు నిరంతరం తపన పడతాడు. అంతర్మథనం చెందుతాడు. కవి కారం శంకర్ దీన్ని గుర్తిస్తాడు. తన కవితలో ఇలా…
నా కలల లాంతరు వెలుగులో /కాసింత ప్రేమను పంచే ఆత్మీయుడి కోసం / మనుషుల్ని ప్రేమించే మనిషి కోసం / వెతుక్కుంటున్నాను.
– (జారవిడుచుకున్న స్వప్నాల కోసం)
మరో కవి సుంకిరెడ్డి నారాయణరెడ్డి మనిషి చేసే నిరంతర పోరాటం తన్నుతాను విముక్తం కోసమేనంటాడు. అతని నిరంతాన్వేషణ కలసి పాడాల్సిన గీతం కోసమని చెబుతాడు తన కవితలో
ఇలా…
శత్రువు ఉనికిని చెప్పే చూపుకోసం/ విచ్చుకపోని పదం కోసం / సేదగుండెను చేరే వాక్యం
కోసం / లక్ష్యాన్ని ఛేదించే బాణం కోసం/ అన్వేషించక తప్పదు / పరాయి పంచన బంధించబడిన
మనల్ని మనమే విడిపించుకోక తప్పదు. (పరాయీకరణ)
వ్యాపారాత్మక సమాజంలో మనిషి ఎందుకు ఒంటరి అవుతాడో రెండు శతాబ్దాల క్రితమే కార్ల్ మార్క్స్ పై వన్నీ చెప్పడం గమనార్హం.
__ పిళ్లా కుమారస్వామి,9490122229