ఆంధ్రప్రదేశ్ లో ఆస్తి పన్ను పెంపు ఆలోచనలను ప్రభుత్వం విరమించుకోవాలి రాయలసీమ పోరాట సమితి కన్వీనర్
ఐ ఎన్ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కరోనా లాక్ డౌన్ అనేక కుటుంబాల ఆదాయం పడిపోయినపుడు ఆస్తిపన్ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలు ప్రజలకు ఉపశమనం కల్పించాలని మరింతగా కృంగదీయరాదని ఆయన చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలందరూ ఇంకా కరోనా కష్టకాలంలోనే ఉన్నారు. అంతకు ముందు జిఎస్ టి వల్ల, నోట్ల రద్దు వల్ల కుటుంబాలు, చిన్న చిన్న వ్యాపారాలు చితికి పోయాయి. ఇలాంటపుడు సానుభూతితో నిజానికి వారికి అర్ధ సంవత్సరం ఆస్తి పన్ను మినహాయింపు ఇచ్చి ఆదుకోవాలని ఆయన సూచించారు.
మినహాయింపు ఇవ్వడానికి బదులు, మూలిగే నక్క మీద తాడికాయ పడ్డట్లు పన్నుపెంచాలను కోవడం ఏమాత్రం సబబు కాదని ఆయన అన్నారు. సబ్ రిజిస్ట్రార్ వాల్యుయేషన్ ప్రకారం ఆస్తి పన్నును పెంచాలను కోవడం మానుకోవాలని, అలా కాని పక్షంలో తాను ఉద్యమం చేపడతానని ఆయన అన్నారు.
తిరుపతిలో సుమారు 70 వేల మంది ఆస్తిపన్ను కడుతున్నారు. తద్వారా నగరపాలక సంస్థకు సంవత్సరానికి సుమారు 42 కోట్ల ఆదాయం వస్తుంది! ఆస్తి పన్నును పెంచుతూ తిరుపతి నగరపాలక సంస్థ ఇచ్చిన డ్రాఫ్ట్ (ముసాయిదా) నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలని నవీన్ కుమార్ ఈ రోజు నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష కి ప్రజల తరఫున వినతిపత్రం సమర్పించారు.
ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని నవీన్ కు కమిషనర్ హామీ ఇచ్చారు. తిరుపతి నగర ప్రజలందరూ ఆస్తి పన్ను పెంపుపై తమ అభ్యంతరాలను తెలియజేస్తూ కమీషనర్ గారికి లేఖలు రాయడం, నేరుగా కలిసి విజ్ఞప్తి చేయడం చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వీడియోలో మరిన్ని వివరాలు: