(శారద శివపురపు)
ఈ రోజున సిటీస్ లో స్థలాల కొరత. పైగా స్థలాలు ఉన్నా కొనడానికి బోలెడు డబ్బు కావాలి. ఉన్నా ఊరవతలికి పోవాలి. అందుకనే అందరికీ లాభసాటిగా ఫ్లాట్స్ కనిపెట్టి వాటిల్లో ఇరుక్కుపోయాము.
ఎవరి స్థలంలో వారు ఇల్లు కట్టుకుని ఉన్నట్టయితే వారిష్టం వచ్చినట్లు దాన్ని పెట్టుకోవచ్చు, ఉండొచ్చు, కానీ అదే ఫ్లాట్స్ అంటే మరి ఒకరింటి పైన ఒకరి పక్కన ఒకరు ఒకే ఫ్లోర్ లో కనీసం నాలుగు నుంచి ఇంకా ఎక్కువగా కాపురాలుంటున్నపుడు కొన్ని ప్రవర్తనా నియమాలు ఉంటాయి కదా.
సాధారణంగా అన్ని ఫ్లాట్స్ లోనూ ఒక ఎసొసియేషన్ ఉంటుంది అది నిర్ణయించిన నియమాలూ ఉంటాయి. నియమాలంటే ఒకరివల్ల ఒకరికి ఇబ్బంది కలగకూడా ఉండాలంటే పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు. అయితే ఎంత జాగ్రత్తగా ఆలోచించినా తట్టని, తట్టినా రాసుకోలేని నియమాలూ కొన్ని ఉంటాయి. అలా అని వాటివల్ల ఇబ్బందులుండవా అంటే ఉంటాయి. అవి ఎలాంటివంటే చెప్తాను చూడండి.
అసలీ ఫ్లాట్స్ కట్టటం అనేది ఇప్పుడు ఫ్లాట్స్ తప్ప ఇంకేమీ ఎక్కువ కనబడని అన్ని పెద్ద సిటీస్ లో ముప్ఫై నలభై ఏళ్ళ ముందునించే మొదలైంది. అంతవరకూ సొంత ఇళ్ళలో ఉన్న మాకు మొట్ట మొదటిసారి ఫ్లాట్ లో ఉండటం అంటే ఎంటో అర్ధమయ్యింది, మేము ముచ్చటగా చాలా కష్టపడి వీలయినన్ని అప్పులుచేసి కొన్న ఫ్లాట్ లోనే. గృహప్రవేశం అయ్యాకా మూణ్ణిద్రలైనా చెయ్యాలంటే వెళ్ళిఉన్నాము.
ఇక మొదటిరాత్రి (ఆ మొదటి రాత్రికి వెళ్ళకండి హా హా ) తెల్లవారు ఝామున నాల్గింటికి ఎవరో భయపెట్టినట్టు లేచి కూర్చున్నాము. ఎందుకో తెలుసా మా పైన ఉన్న దంపతులు ఇద్దరూ ఈ సీ ఐ ఎల్ లో పని చేస్తారు. ఇకా వారి పిల్లలు అప్పుడప్పుడే మొదలైన కోచింగ్ సెంటర్ల బారిన పడ్డ మొదటి బాచుల్లో పిల్లలనుకుంటా పాపం. ఇక మొత్తం ఫామిలీ చేసిన హడావిడి ఇంతా అంతా కాదనుకోండి. కుకర్ విజిల్స్, గ్రైండర్ తిప్పుళ్ళు బాత్రూంస్లో తిప్పే నల్లా నీళ్ళ చప్పుళ్ళు సామాన్లు అటూ ఇటూ జరిపేసి బర బర ఊడ్చి సర్దేసి ఆరున్నరా ప్రాంతంలో శాంతించారు. పదకొండులోపు పడుకోలేము ఆరింటిలోపు లేవలేని మాకు ఈ ఇంట్లో ఉండలేమని అర్ధమైంది. అక్కడ ఉన్నది ఆ మూడు రోజులే.
Like this post? Share it with friends!
నిజానికి ఆ తరవాత కొన్ని ఫ్లాట్స్ చూసాకా కొంత రోత పుట్టిన మాట వాస్తవం. ప్రతీ ఫ్లాట్ ముందూ కుప్పలు కుప్పలు చెప్పులు ఇంట్లో ఎంతమందుంటారో అని అనుకునేపని లేదు, ఇద్దరు ముగ్గురే ఉన్నా అన్నేసి చెప్పులుంటాయి. అందులోనూ వాడని వాటినీ, తెగిపోయిన, అరిగిపోయిన , అలాగే దుమ్ము కొట్టుకు పోయిన వాటినీ అక్కడ నుంచి తియ్యక పోతే మరి గుడి ముందు ఉండే చెప్పుల సీనే నయం కదా. దిష్టిపిడతలా దుమ్ము కొట్టుకు పోయిన చెప్పుల స్తాండూ/డబ్బా పిల్లలు తొక్కే మూడు చక్రాల సైకిలు నుంచి, పెద్ద పిల్లలు తొక్కే సైకిళ్ళ వరకూ నిజానికి ఇంట్లో పెట్టుకోలేని చాలా వస్తువుల్ని మనం ఇక్కడ పెట్టి మర్చిపోయినట్లు నటిస్తాము. ఇక చిన్న చిన్న అంటే తక్కువ ఫ్లోర్స్ ఉన్న ఎపార్ట్మెంట్స్ అయితే పరవాలేదు కాని పెద్ద పెద్ద వాటిల్లో లిఫ్ట్ లాబీ ముందు స్టైర్ కేస్ కి అడ్డంగా పెట్టే వీటివల్ల కొన్ని కొన్ని ఎక్సిడెంట్స్ అయినప్పుడు తొక్కిసలాటయిపోతుంది మెట్లు ఫ్రీ గా వాడే పరిస్తితి లేక. ఇప్పటికి మనం ఎన్నో రకాల దుర్ఘటనలు చూసాము. అవికూడా కేవలం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం వల్ల. వాటి గురించిన చర్చ ఆ దుర్ఘటనలు జరిగినప్పుడు చేసి తరవాత కన్వీనియంట్‌గా మర్చిపోతాము. మరకలాగే మరపు కూడా మంచిదే కొన్ని సందర్భాల్లో కాని ఇలాంటి సందర్భాల్లో అది ప్రాణాంతకం కూడా కావచ్చు.
చిన్న బడ్జెట్ ఫ్లాట్స్ లో ఉండే ప్రజలకి ఇంటి బయట ఏంబియెన్స్ గురించి పెద్దగా పట్టింపు ఉండదు ఎందుకంటే వాళ్ళకు పట్టించుకోవల్సిన ముఖ్యమైన వేరే సమస్యలు కొల్లలు కాబట్టి. సొంతిల్లయితే ఇంటి బయట ప్రహరీ గోడ నుంచీ రోడ్డు వరకూ ఉండే స్థలంలో కూడా అందంగా గడ్డిపెంచి మొక్కలు పెట్టే, ఇంటి బయట ఏంబియెన్స్ కూడా కావాల్సిన వాళ్ళ గురించి ఈ గోలంతా.
ఏదో మేము మొట్ట మొదట చిన్న వయసులో కొనుక్కున్న మా ఫ్లాట్ పుట్టింటికీ అత్తింటికీ దూరమని సరిపెట్టుకుని చాలా ఏళ్ళు అద్దె ఇళ్ళల్లో అవస్థలు పడ్డామనుకోండి. నిజానికి ఎక్కడున్నా తెలవారు ఝామునే ఈ దంపుడు చప్పుళ్ళకి లేవక తప్పింది కాదు నాకు. అదేంటో గాని మా ఇంటిపైన ఉండేవాళ్ళందరూ, రోటి పచ్చళ్ళు, చాయ్ మసలాలు, కూరల్లో కొబ్బరి దంచితేనే గాని వంట చెయ్యరు మరి. మేము కొనుక్కున్న ఫ్లాట్ నుంచి తప్పించుకున్నా తరవాత దొరికిపోయాను. ఏమీ చెప్పలేక, భరించలేకా, ప్రతిరోజూ నిద్రచెడి అల్లాడి పోయాను. పిల్లి పరిగెత్తినా లేచి కూర్చునే నా నిద్రకీ ఈ చప్పుళ్ళకీ అవినాభావ సంబంధం ఉందనుకుంటా.
సుమారు ముప్పై ఏళ్ళ తరవాత ఎంతో ఇష్టపడి గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనుక్కున్నాము. పదో పదిహేనో అంతస్థులొ ఉండి అక్కడినుంచి కింద నడిచే వాళ్ళనీ రోడ్డు మీద వెళ్ళే కార్లనీ అవీ చూడటంలో ఓ ఠీవీ, దర్పం ఉంటాయి చూశారూ, భలే ఉంటుంది మొదట్లో.
24 ఆవర్స్ సెక్యూరిటి, పవర్ బేకప్, ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్, జాగింగ్ ట్రాక్, లాండ్స్కేప్డ్ గార్డెన్స్ అన్నీ బాగుంటాయి. అక్కడ ఉండే వాళ్ళందరికీ పెద్ద పెద్ద కార్లుంటాయి. అందమైన పెంపుడు కుక్కలూ వాటిని బయటకి తీస్కెళ్ళే డాగ్ వాకర్లూ లాంటి అన్ని హంగులూ ఉంటాయి. కానీ వందల కాపురాలు జీవించే ఈ సమాజంలో పాటించాల్సిన నియమాలు ఎన్నున్నప్పటికీ కొన్ని సర్ధుకుపోలేని ఇబ్బందులుంటాయి. మన వంటింట్లోకి గుప్పుమనే రొయ్యల కూర వాసన లాగా.
ఎలాగంటారా, చిన్నప్పుడు ఎవరి వంటింట్లో నైనా వంట పొయ్యి పైన చిమ్నీ చూసి ఎరుగుదుమా? కానీ ఇప్పటి ఫ్లాట్స్‌లోని వంటిళ్ళలో చిమ్నీ లేనిదే పని నడవదు, ఆ వంటింటికి కావలిసినంత గాలీ, వెలుతురూ ఉండవు కాబట్టి. నిజానికి ఈ చిమ్నీలు మన పొయ్యి పొగల్నీ, సెగల్నీ బయటికి పంపడం ఏమోగానీ, పైనిళ్ళ వాళ్ళు వండే రొయ్యల కూర కంపుని మాత్రం ఇల్లంతా నింపేస్తాయి. ఈ సమస్య మరి నాదేనో అందరిదీనో నాకు తెలియదు. మాంసాహారులందరూ కూడా చేపల వాసన ఇష్టపడరు, మరి మాలాంటి శాఖాహారుల బాధ ఏంచెప్పమంటారు.
ఓ ఎండాకాలమ్ ఆవకాయ పెట్టినపుడు, మాగాయ కోసం కొన్ని ముక్కలు నానబెట్టి మా వంటింటి బాల్కనీలో ఎండబెట్టాను. మధ్యలో ఓసారి అలా పరిస్థితి ఏంటో అని వెళ్ళి చూతును కదా, బాల్కనీ లోకి నీళ్ళు టప టపామని పడుతున్నాయి. ఇదేమ్ అకాల వర్షం చెప్మా అనుకుంటే ఎండ దంచేస్తోంది. ఈ వర్షం పైన వాళ్ళు కురిపిస్తున్నది. పైకి వెళ్ళి చెప్తే ఆవిడ శుభ్రంగా డోర్మాట్స్ ఉతికి ఆరేసింది బాల్కనీ రైలింగ్ మీద. ఎంతైనా డోర్మాట్స్ కదా మురికినీళ్ళు కారుతున్నాయి. అలా మొదటిసారి నా మాగాయ పెట్టకుండానే మురిగిపోయింది.
జనాల చేతిలోకి సాఫ్ట్వేర్ బూమ్ వల్లో ఇంకోదానివల్లో చేతిలోకి డబ్బు వచ్చింది. చేతిలో దండిగా డబ్బు ఉండేసరికి, పాశ్చాత్య నాగరికతని గుడ్డిగా అనుకరిస్తామ్ కానీ వారు పాటించే సభ్యతని మాత్రం అనుసరించలేము. లిఫ్ట్ ఎక్కినప్పుడు రకరకాల పెర్ఫ్యూమ్స్ గుప్పుమంటాయి, కానీ మన బాల్కనీ లొకి ఎవరు విసిరేస్తారో తెలియని సిగరెట్టు పీకలుంటాయి. వేయించిన పల్లీలు చెరిగి పారేస్తారు, మన బాల్కనీలో తొక్కల వర్షం. పోనీ పల్లీలు పడ్డా బాగుండనిపిస్తుంది. ఆ మధ్య పైనింటి పిల్లకి స్కూల్ నించి రాగానే తినడానికి వాళ్ళమ్మ పాపం చాలా కష్టపడి అన్నిరకాల పళ్ళ ముక్కలూ మొలకలూ వేసిన సలాడ్ పెట్టింది కానీ అవి తినడం ఇష్టంలేని ఆ పిల్ల బాల్కనీలో కొచ్చి చంచాడు చంచాడు చొప్పున మొత్తం కిందకి విసిరేసింది. ఇంటర్‌కామ్‌లో చెబితే మొదట ఒప్పుకోలేదు కానీ ఈరోజు నువు పెట్టింది ఇదే కదా అంటే ఇక తప్పలేదు. చాలా బాల్కనీల్లోకి చపాతీలు, బ్రెడ్ ముక్కలూ, ఆఖరికి పాలూ కూడా పోసేస్తుంటారు పిల్లలు, అవి చెత్త బుట్టలో వేసినా పెద్దలు పట్టేస్తారని. ఇలా ఏదో పిల్లలు తెలియక చేసే పనులంటే సర్దుకోవచ్చు కానీ పెద్దలు చేసేవే ఎక్కువ ఉంటాయి.
ఒక్కో సారి లిఫ్ట్స్లోముచ్చటగా పెంచుకునే బొచ్చు కుక్కపిల్లలో లేక చంటిపిల్లలో సుసు చేసేస్తారు, కానీ సంబంధించినవారు దాన్ని శుభ్రం చెయ్యడం తమపని కాదన్నట్టుంటారు. అందంగా పెంచిన లాన్స్ లో కుక్కలు, పిల్లులు వాటి అవసరాలు తీర్చుకుంటాయి, వాటి తప్పులేదు వాటికేం తెలుసు? కానీ చూసుకోకుండా వాటిని తొక్కిన వారి అవస్థ గురించి ఆలోచించరు వాటి పెంచుకునేవాళ్ళు. ప్రతి హక్కుకి ఒక బాధ్యత ఉంటుంది.
ఈ మధ్య అయితే ఫ్లాట్స్ లో ఉండేవారికి ఈ కుక్కల్ని పెంచుకునే వారి వల్ల ఇంకో ఇబ్బంది వచ్చి పడింది. ఏ కారణంగానైనా ఇంట్లోని వారంతా బయటికి వెళ్ళాల్సివచ్చినపుడు, ఆ కుక్కల్ని ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వాటికి తిండి పెట్టే సదుపాయం ఏదో చేసినా వాటికి రోజంతా వంటరిగా ఉండటం అలవాటులేక వాటి యజమానుల మీద బెంగ పెట్టుకుని రోజంతా ఏడుస్తుంటాయి. వాటితోపాటు వాటి చుట్టూ ఉండేవారు కూడా ఏడవాల్సిందే ఊరెళ్ళినవాళ్ళు తిరిగి వచ్చేవరకూ. ఇప్పుడు ఇలాంటప్పుడు కుక్కల్ని చూసుకోవడానికి డాగ్ కేర్ సెంటర్స్ ఉన్నాయి కానీ అవి చార్జెస్ బాగా తోముతాయి. వాళ్ళు ఆ చార్జెస్ తప్పించుంటారుగానీ మనం పాపం ఆ కుక్కల ఏడుపుకి దొరికిపోతాం పగలూ రాత్రీనూ. అసలు ఊళ్ళోనే ఉన్నా కొన్ని కుక్కలు బాల్కనీల్లో తెగ మొరుగుతుంటాయి పగలూ రాత్రీ అని లేకుండా. నిజానికి ఇది పెంచుకునేవాళ్ళకీ అవస్థే అయినా సరే వాటిని ఆపే ప్రయత్నం ఎన్ని ఫిర్యాదులు చేసినా చెవిటివాడికి శంఖం ఊదినట్లే. నిజంగానే వీళ్ళు చెవిటి వాళ్ళు ఎలాంటి మొరుగుడుకైనా.
ఇంకొన్ని ఫిర్యాదు కూడా చెయ్యలేని సమస్యలున్నాయి. ఫ్లాట్స్ లో మనకు సంతోషమైనా కోపమైనా ఇంట్లో విందులైనా ఏవైనా కాస్త మన పక్కవాళ్ళని దృష్టిలో పెట్టుకునే చేసుకోవాలి. కొందరు భార్యా భర్తలకో, పిల్లలు పెద్దలకో కొన్ని గొడవలుంటాయనుకోండి, అవన్నీ పక్కవారికి తలనొప్పవుకుండా చూసుకోవాలి. ఈమాత్రం ఇంగితం లేనివాళ్ళు పొద్దున్నే ప్రశాంతంగా టీ తాగే సమయంలోనో, రాత్రి నిద్రపోవాలనుకున్నప్పుడో గాభరా పెట్టేస్తుంటారు.పైగా వాళ్ళ ఘర్షణల్లో మనం తల దూర్చనూ లేము, అలా అని కంప్లైంట్ కూడా చెయ్యలేము సున్నితమైన విషయాలు కాబట్టి.
పండగలనీ, చుట్టాలనీ, పార్టీలనీ, బాల్కనీల్లో చేరి మందు కొట్టేసి అర్ధరాత్రిళ్ళు పెద్ద పెద్దగా మాట్లాడుతూ జోకులేసుకుని నవ్వేస్తూ వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తుంటారేమోగానీ, అటుపక్కా, ఇటుపక్కా వాళ్ళకి మాత్రం ఇలాంటివి బాగా ఇబ్బందిగా ఉంటాయి.
అసలు ఈ వ్యాసం రాయడానికి ప్రేరణ ఒకటుంది. ఇంతకుముందు రాసిన ఇబ్బందు లన్నిటికన్నా వేరైనది, బహుసా నాలాటి కొందరు పుణ్యాత్ములకి గాని ప్రాప్తించనదీనూ. మా పైన ఫ్లాట్ లో ఒక చక్కని అందమైన భరత నాట్యం డాన్సర్ ఉంటుంది. నిజానికి చాలా చక్కని నృత్యం చేస్తుంది. కానీ రోజూ ఆవిడ చేసే ప్రాక్టీసు మాత్రం మా ప్రాణాని కొస్తుంది. ఆ సమయంలో మా టీవీ లో శబ్దాలు మాకు వినపడవు. అంతేగాదండోయ్, బయట మబ్బుగా ఉన్నరోజుల్లో చాలా సార్లు నేను ఉరుముతోందని పొరబడ్డాను కూడానూ. అంత భయానకంగా ఉంటుంది ఆ అదురుడు. అది మా తలలపై భస్మాసుర పాదం మోపుతున్నట్టుంటుంది. ఇక కరోనా కారణంగా ఇంట్లోంచి పనిచేస్తున్న చాలా మంది ఆమెపై కంప్లైంట్స్ చేసారు. అబ్బే ఏమీ ప్రయోజనం లేదు. ఎవరెంత మొత్తుకున్నా ఆమె నృత్యం ఆగదు. ఆ టైంలో ఫోన్ చేస్తే ఎత్తదు, కాలింగ్ బెల్ కొట్టినా తలుపు తియ్యదు. ఇంత మొండి వాళ్ళని ఎవరేంచెయ్యగలరు చెప్పండి.
ఇలా ఇంకా ఇంకా రాస్తూనే పోవచ్చు ఫ్లాట్స్ లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అందరూ సహజీవనం చెయ్యాలంటే, కేవలం డబ్బులో, హోదాలో కాదు, ఇతరులకి ఇబ్బంది కలిగే విధంగా మన రోజువారీ ప్రవర్తనని కొంచం మార్చుకోవాల్సిన అవసరం ఉందని అందరూ తెలుసుకోవాలి.
మనం ఎంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నామన్నదానికంటే మనం ఎంత సంస్కారవంతంగా ప్రవర్తిస్తూ ఇతరులకి అక్కడ జీవించడాన్ని ఎంత సులభతరం చేస్తున్నామన్నది ముఖ్యం. ఈ రకంగా వ్యక్తిత్వాభివృద్ధి డబ్బుతో పాటుగా రావడం వల్ల ఒకే చోట ఉండే వాళ్ళు ఒకరిమీద ఒకరు నిందలూ ఆరోపణలూ లేకుండా గౌరవించుకుంటూ, అభిమానించుకుంటూ ఉండొచ్చుకదా.
(శారద శివపురపు. రచయిత్రి, కవయిత్రి, వాటర్ కలర్ పెయింటింగ్స్ వేస్తారు. భారతీయ రచయిత్రుల మీద పుస్తకం రాశారు. బెంగుళూరులో స్థిరపడ్డారు)
The problems mentioned by you in the article are real facts.We buy an apt.spending huge amount and suffer there with the misbehaviour of other residents.Hope someday all the residents will understand these types of problems and try to lead a peaceful life without disturbing others.
Thank you 😊
రచయిత్రి శారద గారి ఫాట్ల పాట్లు చదువుతూంటే నాకూ ఎదురైన కొన్ని చేదు అనుభవాలు కళ్ళముందు ప్రత్యక్షమయాయి. మా ఫ్లాట్ గుమ్మానికీ పక్కవాళ్ళ గుమ్మానికి మథ్యలో మహాఅయితే మూడు అడుగుల దూరం వుంటుంది. అంతే. ఆ పక్కంటి వాళ్ళకి విజిటర్స్ వచ్చినా, ఏదైనా కొరియర్ వచ్చినా మా తలుపులు బాదేసేవాళ్ళు..ఎవరా అని మా ఆవిడ పరుగెత్తికెళ్ళి తలుపు తెరిస్తే ఎదురుగా తెలియని మొహాలు. ఎవరు కావాలని అడిగితే పక్కింటి వాళ్ళపేరు చెప్పడం , వాళ్ళ ఫ్లాట్ చూపించి మా ఆవిడ వంటింట్లోకి వెళ్ళే సరికి స్టవ్ మీదున్న పాలు పొంగి పోవడమో, కూర మాడి తగలడటమో జరిగేది. ఇంక ఇలా లాభంలేదని నేను మా ముందుగుమ్మానికి నా నేమ్ ప్లేట్ తగిలించిన తరువాత కాస్త రిలీఫ్ వచ్చింది. కానీ ఇంకో బెడద కూడా మాకు ఎదురయ్యేది.
ఆ పక్కింటి ఆవిడ వాళ్ళింట్లో ఏమి చేసుకున్నా మా తలుపులు బద్దలుకొట్టి చూడమ్మా ఇది చాలా అద్భుతమైన వంటకం. ప్రత్యేకంగా తయారుచేసాను. రుచి చూస్తే వదిలిపెట్టవు , ఆ ప్లేటు తరువాత తీసుకుంటాలే అనేసి చక్కాపోయేది. అంటే, ఆ ప్లేటు లో మళ్ళీ ఏదో ఒకటి పెట్టకుండా కాళీ ప్లేటు ఇవ్వలేము కదా? ఒకసారి ఏమి ఇవ్వాలో తెలియక నేను ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న జీడిపప్పు పాకం ఇంత అచ్చు మా ఆవిడ దానం చేసింది. నా ప్రాణం వుసూరు మంది. ఫ్లాటుల్లో వుంటే ఇలాంటి పాట్లు తప్పవు. కొంతమంది వస్తే చస్తే కదలరు.వాళ్ళకి టైమూపాడూ వుంఢదు. మనకి ఆకలి మండిపోతూవుంటుంది.ఎప్పుడు కదులుతారా అని చూస్తూవుంటాం. ఇలాంటివి పాట్లు ఈ ఫ్లాటుల్లో తప్పవు. ఎన్నైనా ఇలాంటివి రాసుకుంటూ పోవచ్చు!
Yes Surya Mohan garu. We can write so much more and these problems are so very different for different flat dwellers.
Very nice article madam. You wrote extremely well.You narrated woes of apartment dwellers in simple words in a superb manner. Each sentence of your article reflects the reality. Everyone who lives in any apartment should follow certain etiquette. Kudos madam. Keep it up.
Thanks so much JR Prasad garu for your kind encouraging words.