ఢిల్లీలో ఈ రోజు ప్రశాంతంగా సాగాల్సిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ అదుపు తప్పింది. ఢిల్లీ యుద్ధభూమిని తలపించింది. చాలా చోట్ల ట్రాక్టర్ ర్యాలీకి వచ్చిన రైతులు బ్యారికేడ్లను చేధించి నగరంలోకి వచ్చే ప్రయత్నం చేశారు. రైతులు రిపబ్లిక్ పరేడ్ జరుగుతున్న సెంట్రల్ ఢిల్లీ వైపు వెళ్లకుండా నివారించేందుకు పోలీసుల బాష్ప వాయువు ప్రయోగించారు లాఠీచార్జ్ చేశారు. అనేక చోట్ల పోలీసులకు, రైతులకు ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల మధ్యనే వందలాది మంది రైతులు నగరం నడి బొడ్డున ఉన్న ఐటివో (ITO) దాటుకుని ఎర్రకోటను సమీపించారు. జాతీయ పతాకం పక్కనే రైతు జండా, శిక్కు జండా ఎగరేశారు. ఇంతవరకు స్వాతంత్య్రానంతరం ఏ రాజకీయ పార్టీ చేయని పని చేశారు. ఎర్రకోట సమీపాన రెపరెపలాడుతున్న జాతీయ పతాకానికి పక్కనే ఉన్న జండా స్తంభం ఎక్కి ఈ జండా ఎగరేశారు. ఇది రైతు జండా కాదని, ఒక మత పరమైన జండా అని తేలింది. రైతు ట్రాక్టర్ రాలీ లోకి ఇతర శక్తులు ప్రవేశించాయి అని రాలీ కి ఒక నాయకుడు అయిన ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ అన్నారు. మొత్తం పరిణామాల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రకోట అనేది కేవలం జాతీయ పతాక ఆవిషకరణకు మాత్రమే కేటాయించిన ప్రదేశం అని, అక్కడ ఒక మాట పతాకం ఎగరేయడం తప్పు అని ఆయన అన్నారు. దానికి తాను బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు.
ఎర్రకోట మీద జండా ఎగరేయడమనేదానికి చాలా లోతైన రాజకీయార్థం ఉంది. అధికార మార్పిడికి అది మారుపేరుగా చెబుతుంటారు. ఇలాంటి పనిని సునాయాసంగా పంజాబ్ హర్యానా రైతులు చేశారు. ఎర్రకోట పై ఎర్రజెండా ఎగరేయాలన్నది కమ్యూనిస్టుల కల. అది నెరవేరలేదు గాని, జాతీయ జండా కానీ జండా ఈ రోజు మొత్తానికి ఎర్రకోట ఎక్కింది. ఇది చాలా తీవ్ర మయిన విషయం.
రైతుల ర్యాలీ ఎర్రకోట దారిలో ఉన్న ఐటివో దగ్గిరకు రాగానే అదుపు తప్పింది. చాలా మంది రైతులు ఆగ్రహంతో పోలీసులను తరిమేయడం జరిగింది. కొంతమంది ట్రాక్టర్లతో పోలీసులను వెంటబడి తరిమి తరిమి కొట్టేందుకు ప్రయత్నించడం వీడియోలలో కనిపించింది. అంతకు ముందు నగరంలో అనేక చోట్ల ర్యాలీ మీద పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఆగ్రహంతో రైతులు ఈ దాడికి పూనుకున్నారని చెబుతున్నారు.
ఢిల్లీ లో నిన్న కొన్ని చోట్ల పోలీసులు ట్రాక్టర్ ర్యాలీ మీద లాఠీ చార్జి చేశారు. బాష్ప వాయు గోళాలు ప్రయోగించారు. అనుమతించిన రూట్లలో కాకుండా ఇతర మార్గాలలో రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసుల లాఠీ చార్జ్ చేయవలసి వచ్చిందనేది పోలీసుల కథనం.
ఈ రోజు నగరంలోని అనేక ప్రాంతాలలో రైతుల ర్యాలీ అదుపు తప్పింది. రాజ్ పథ్ లో రిపబ్లిక్ డే పరేడ్ ముగిశాకే నగరంలోకి, కొన్నిమార్గాల గుండా మాత్రమే ప్రవేశించి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించేందుకు పోలీసులు రైతులకు అనుమతి నిచ్చారు.
అయితే, రైతులు ఈ ఆంక్షలను ఖాతరు చేయకుండా సెంట్రల్ ఢిల్లీలోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేయడంతో ఈ రోజు గందరగోళం నెలకొంది.
ముఖ్యంగా ఐటివొ జంక్షన్ యుద్ధభూమిని తలపించింది.
ఇది ఇలా ఉంటే అక్షర్ ధామ్ దగ్గిర కొంతమంది నిహాంగ్ శిక్కులు పోలీసులతో ఘర్షణకు దిగారు.
ఢిల్లీ పశ్చిమాన ఉన్న నంగ్లాయ్ చౌక్, ముబారక్ చౌక్ వద్ద రైతులు సిమెంట్ బారికేడ్లను ధ్వంసంచేసి నగరంలోకి ప్రవేశించాలనుకోవడంతో గొడవ జరిగింది. రైతులను చెదర గొట్టేందుకు పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించారు. లాఠీ చార్జ్ చేశారు.
ఘర్షణలు పెద్ద ఎత్తున జరగడంతో సింఘూ బార్డర్, ఘాజీ పూర్ బార్డర్, నంగ్లాయ్ చౌక్, ముబారక్ చౌక్ ప్రాంతాల్లో ప్రభుత్వం ఇంటర్ నెట్ బంద్ చేసింది.