ఇద్దరు కలెక్టర్లు, ఒక ఎస్ పితో కలిసి మొత్తం తొమ్మది మంది అధికారులను ఎన్నికల విధులనుంచి తప్పించాలని, వారిని వేరే బాధ్యతలకు బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ చీఫ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.
ఈ మేరకు ఆయన ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు.
ఇందులో గుంటూరు,చిత్తూరు కలెక్లర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ, శ్రీకాళహస్తి, పలమనేరు డిస్పీలున్నారు. మిగిలిన వారు సిఐలు.
వారిని వెంటనే బదిలీ చేయాలని ఆయన కోరారు. నిజానికి వీరిని బదిలీ చేయాలని గతంలోనే కమిషన్ లేఖ రాసింది.అపుడు కమిషనర్ లేఖను ప్రభుత్వం గౌరవించే స్థితిలో లేదు. గతంలో రాసిన లేఖ ను కూడా ఆయన తాజా లేఖలో ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఎన్నికలను నిర్వహిస్తున్నందున, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈ అధికారులను బదిలీ చేయడం అవసరమని ఆయన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది.
2020 మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల సమయంలో కొంత మంది అధికారులను బదిలీ చేయాలని కమిషన్ చేసిన సిఫార్సులను రాష్ట్రప్రభుత్వం అమలుచేయలేదు. దీనితో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 22న స్వయంగా వారిని బదిలీ చేయాలని మళ్లీ సిఫార్సు చేసింది. వాళ్లు అవసరం లేదని కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళని ఎన్నికల విధులనుంచి తప్పించారు.
ఈ ఉత్తర్వులను అమలుచేయాల్సిన బాధ్యత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మీద ఉంది.