(భూమన్, ప్రొఫెసర్ కుసుమకుమారి)
పాండవుల బండ అనేది తిరుపతి కి 25 కిమీ దూరాన, చంద్రగిరి సమీపాన ఉన్న అందమయిన కొండ ప్రాంతం. ఇక్కడ క్రీపూ 1500-2000 నాడు కట్టిన రాక్షస గూడు(మెగాలిత్) ఉంది. దీనినే ఇక్కడి ప్రజలు పాండవుల గుట్ట అని కూడా అంటారు. చంద్రగిరికి దక్షిణాన డోర్నకంబాల రోడ్డులో మల్లయ్య పల్లె ఉంది. ఈ పల్లెకు పడమట నాలుగు కిలో మీటర్ల దూరాన, ఈ పాండవుల బండ ఉంది.ఈ బండ కింద, ఆ కాలపు నాటి చిత్రాలున్నాయి. ఆ గ్రామం నుంచి 4 కిమీ పొడవునా పచ్చటి తోటల మధ్య, తర్వాత అడవి మార్గాన మనం ప్రయాణం చేయాలి.ఈ మార్గంలో ట్రెకింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. దారి పొడీతా ఉన్న పచ్చటి వాతావరణం, పక్షుల కిలకిలా రావాలు, అపుడపుడు బిగ్గరగా వినిపించే నెమలి అరుపులు గొప్ప అనుభూతి. ఒక్కొక్క సారి జింకలూ కనిపిస్తాయి.
ఈ బండకింది చిత్ర లిపి చదవడం, అర్థం చేసుకోవడం నాలాంటి వాడికి సాధ్యం కాదు. ఎవరైనా పురాతత్వ శాస్త్రవేత్త చేయాల్సిన పని. ఈ చిత్ర కళ ను చదవగలిగితే ఆనాటి ప్రజా జీవనం ఎలా ఉంది, సంస్కృతి ఎలా ఉంది అనేది అర్థమవుతుంది.
ప్రకృతికి ఆస్వాదించేందుకు ఇలా అపుడపుడు ఇలా అడవుల్లోకి వెళ్లడం వల్ల ఆహ్లాదం తో పాటు మరొక ప్రయోజనం. అది మన పూర్వీకుల జీవితం గురించి తెలుసుకోవడం. ఏ అడవికి వెళ్లినా ఇలా మన పూర్వీకులు వదలిన ఆనవాళ్లు కనిపిస్తాయి. అంటే ఇలాంటి యాత్రల వల్ల మానసికోల్లాసమే కాదు, మేధో వికాసం కూడా కలుగుతుంది.
గుట్టమీద చాలా సేపు గడిపి వచ్చేటపుడు వేరే మార్గం గుండా వచ్చాం. అదొక అనుభవం. రెండు దారులు గుండా మన ట్రెక్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇలా మన సమీపాన ఉన్నకొండలను గుట్టలనే మనం ఎంచుకోవచ్చు.
కరోనా కాలంలో నేను దాదాపు 60 ట్రెక్స్ చేశాను. కొన్ని ప్రదేశాలను రెండుసార్లుకూడా చూశాను. వెళ్లిన ప్రతిసారి నాకు ఏదో ఒక వింత కనిపిస్తూ వచ్చింది. ఒక్కసారి ఆ ప్రాంతాల్లో మేకల కాపరులు, మేకలు మందలు కనిపిస్తాయి. ఈ అటవీ వాతావరణంలో ఆ మంద మధ్య నిలబడుకోవడం, మేకల కాపరులతో మాట్లాడటం కూడా వినోదమూ విజ్ఞానమూ కల్గిసాయి. వీళ్ల తో మాట్లాడితే ఆ కొండల అడవుల గురించి ఎంత సమాచారమిస్తారో. మాకు వాళ్లే, ‘సార్ అక్కడ కొండ ఉంది. ఇక్కడ లోయ ఉంది, ఇంకోచోట మడుగు ఉంది అని కొత్త ప్రదేశాల గురించి చెబుతారు. అక్కడి వెళ్లేందుకు వాళ్లు వేసుకున్న దారుల గురించి చెబుతారు. వాళ్లకున్న లోకల్ నాలెడ్జ్ మనకు పుస్తకాల్లో దొరకదు. వాళ్ల గైడెన్స్ తో అనేక కొండలను, ప్రకృతి రమణీయ ప్రదేశాలను నేను సందర్శించాను. ఇలా నేను రకరకాల మార్గాల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం శేషాచలం కొండలతో కలపి, తిరుపతి, చంద్రగిరి చుట్టుపక్కల మూడు నాలుగు వందల దాకా చిన్న, పెద్ద ప్రదేశాలున్నాయని కనుక్కున్నాను. టూర్లకి మనం ఎక్కడికో పోనవసరం లేదు, మన కనుచూపు మేరలోనే మనకు తెలియని ప్రకృతి విశేషాలున్నాయి. వాటిని శోధించే చూపుండాలి, అంతే.. ప్రభుత్వమూ వాటిని గుర్తించి వాటి సమాచారం అందిస్తే, మన పర్యాటక రంగం వర్ధిల్లుతుంది.