ఉద్యోగ సంఘాల నాయకులకు నమస్కారములు…
కరోనా తగ్గుముఖం పట్టింది. అధికార పార్టీ ర్యాలీలు జరుగుతున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోంది. ఉద్యోగులు పనిచేస్తున్నారు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు రాని కరోనా ఉద్యోగ సంఘాల నేతలకు ఎన్నికలు అంటూనే వచ్చిందా? ఊరందరిది ఒక దారియైతే ఉలిపి కట్టేది మరో దారి అన్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రజలు, ఉద్యోగుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వ్యహరిస్తున్నారు, అనిమాజీ టిడిపి మంత్రి కెఎస్ జవహర్ ఉద్యోగ సంఘాలకు రాసిన బహిరంగ లేఖలోపేర్కొన్నారు. ఇంకా ఏమిరాశారంటే…ఉద్యోగుల ప్రయోజనాల కోసం పని చేయాల్సిన ఉద్యోగ సంఘాలు ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయడం అత్యంత బాధాకరం.రాజ్యాంగబద్ధ సంస్థలైన హైకోర్టు ఆదేశాలను, రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను దిక్కరిస్తూ ఉద్యోగ సంఘాల నేతలు పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామనడం తీవ్ర అభ్యంతరకరం. హైకోర్టు తీర్పుకు అందరూ కట్టుబడి ఉండాలి.
కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఉద్యోగులందరూ ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వర్తించినప్పుడు నోరెత్తని ఉద్యోగ సంఘాల నేతలు కరోనా తగ్గుముఖం పట్టాక అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ రాజకీయ ప్రకటనలు చేయడం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే.
ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న పీఆర్సీ, మెడికల్ బిల్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర బకాయిలు ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు ఉద్యోగ సంఘాల నేతలు కృషి చేయకుండా రాజ్యాంగ సంస్థల ఆదేశాలు దిక్కరిస్తూ రాజ్యాంగ సంక్షోభం తలెత్తేలా వ్యవహరించడం సరికాదు.
ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రాణదీపం.గ్రామస్వరాజ్యం మహాత్మా గాంధీ సిద్దాంతం కాగా,రాజ్యాంగ పరిరక్షణ,ప్రజాస్వామ్యం,పరిపాలనలో బలహీనవర్గాలకు భాగస్వామ్యం అంబేద్కర్ సిద్దాంతం అన్న విషయాన్ని ఉద్యోగ సంఘాలు గుర్తుంచుకోవాలి. గాంధీజీ ,అంబేద్కర్ సిద్దాంతాలకు ఆదర్శాలకు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకమా సమాధానం చెప్పాలి? రాజ్యాంగం గొప్పదా, రాజ్యాంగం ప్రసాదించిన పదవులు గొప్పవా అంటే…రాజ్యాంగమే గొప్పదని చెబుతాం.
హైకోర్టు తీర్పుకు అందరూ కట్టుబడి ఉండాలి. 151 అంతస్తుల భవనం కూడా రాజ్యంగం అనే పునాది మీద ఆధారపడి ఉంది. కరోనా తగ్గుముఖం పట్టింది. అధికార పార్టీ ర్యాలీలు జరుగుతున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతోంది. ఉద్యోగులు పనిచేస్తున్నారు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు రాని కరోనా ఉద్యోగ సంఘాల నేతలకు ఎన్నికలు అంటే వచ్చిందా? ఊరందరిది ఒక దారియైతే ఉలిపి కట్టేది మరో దారి అన్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రజలు, ఉద్యోగుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వ్యహరిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగితే స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల,పట్టణాల అభివృద్ధికి పాటుపడతారు. ఉద్యోగ సంఘాల నేతలు తమ స్వర్థం వీడి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగస్వాములై తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి
కె.ఎస్. జవహర్
మాజీ మంత్రి
(ఇది మాజీ మంత్రి కెెఎస్ జవహర్ (టిడపి) ఉద్యోగ సంఘాలకు రాసిన బహిరంగ లేఖ)