ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ప్రకటించిన జగన్ కు మోరల్ సపోర్ట్ ఈ రోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి వచ్చింది.
కలకత్తాల నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతి సందర్భంగా మాట్లాడుతూ దేశానికి నాలుగు రొటేటింగ్ రాజధానులుండాలని ఆమె అభిప్రాయపడ్డారు. పార్లమెంటు సమావేశాలు అన్ని రాజధానులలో నిర్వహించాలని కూడా ఆమె చెప్పారు. దేశానికి ఉత్తరాన రాజధాని ఉన్నట్లే పడమట, తూర్పున, దక్షిణాను కూడా రాజధానులు అవసరమని ఆమె పేర్కొన్నారు.
బ్రిటిష్ కాలంలో చాలా రోజుల దేశానికి కలకత్తా రాజధానిగా ఉన్నవిషయాన్ని ఆమె గుర్తు చేశారు. కలకత్తా రాజధానిగా ఆరోజు ఇంగ్లీష్ వాళ్లు దేశాన్నంతా పరిపాలించారు. ఇపుడు ఇంత విశాల భారతావనికి ఒకే ఒక్క రాజధాని ఉండాలన్న ఆలోచన మంచిదికాదని చెబుతూ దేశం నలుమూలలా నాలుగు రాజధానులు ఉండాలని ఈ అంశాన్ని ఎంపిలు పార్లమెంటు లో లెవనెత్తాలని అన్నారు. ఒక నాయకుడు, ఒక దేశం… వంటి ఆలోచనలు మంచిది కాదని కూడా ఆమె వ్యాఖ్యానించారు.
ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ లాంటిదే. అమరావతి రాజధాని స్థానంలో జగన్ మూడు రాజధానులు ప్రకటించారు. అమరావతిని శాసన రాజధాని గా ఉంచి, విశాఖను పాలనా పర రాజధానిగా మార్చేందుకు పూనుకున్నారు. రాయలసీమలోని కర్నూలును ఆయన న్యాయ సంబంధ రాజధానిగా ప్రకటించి, హైకోర్టును తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ విషయం కోర్టు లో ఉన్నందున మూడు రాజధానుల పథకం ముందుకుసాగలేదు.
ఇపుడు మమతాబెనర్జీ సరిగ్గా ఇలాంటి డిమాండ్ నే చేస్తూ కలకత్తాను ఒక రాజధాని చేయాలన్నారు.
అంతకు ముందు ఆమె నేతాజీ గౌరవార్థం జరిగిన ఏడు కిలో మీటర్ల పాదయాత్రలో పాల్గొన్నారు.
కేంద్రం నేతాజీ జయంతిని నేషనల్ హాలిడే గా ప్రకటించకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నేతాజీ జన్మదినం జనవరి 23 దేశ్ నాయక్ దినంగా పాటించాలని చెబుతూ నేతాజీ ఏర్పాటుచేసిన ప్రణాళిక సంఘాన్ని కేంద్రం రద్దు చేయడాన్ని కూడా ఆమె తప్పుపట్టారు.