(డాక్టర్ . జతిన్ కుమార్)
కోవిడ్ 19 ని వ్యాక్సిన్ల ద్వారా అరికట్టగలమనే ఒక ఆశను రేకెత్తిస్తూ 2021 కొత్త సంవత్సరం ఆరంభమయ్యింది. అయితే 2020 లో కోవిడ్ ప్రభావంతో ప్రపంచమంతా ఆర్ధిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. అభివృద్ధి పధకాలు ఆగిపోయాయి. పేదరికాన్ని తరిమి కొడతామన్న అంచనాలు తల్ల క్రిందులయ్యాయి. ప్రపంచమంతా బీదరికం అనూహ్యంగా పెరిగి పోయింది. వరల్డ్ బ్యాంక్ బ్లాగులు ఈ విషయం విశదీకరిస్తూ ఎప్పటికప్పుడు సవరించిన గణాంకాలు ప్రచురిస్తున్నాయి. వీటి ఆధారంగా ప్రపంచ బీదరికం పై మనం ఒక అవగాహనకు రావచ్చు.
2020 అక్టోబర్లో, గ్లోబల్ ఎకనామిక్ ప్రోస్పెక్ట్ లు (GEP)ఆధారం గా, 8.8 నుండి 11.5 కోట్ల మంది ప్రజలు దుర్భర దారిద్ర్యం లోకి నెట్టి వేయబడతారని అంచనా వేశారు. అయితే 2021 జనవరి లెక్కల ఆధారం గా చూస్తే 11.9 నుండి 12.4 కోట్ల మంది దుర్భర దారిద్ర్యం లోకి దిగజారీ పోయారని అంటున్నారు. కరోనా లేని సాధారణ కాలం లోని బీదల సంఖ్యకు, కరోనా పరిస్థితిలో పెరిగిన బీదల సంఖ్యకు మధ్య గల వ్యత్యాసం పరిగణించి ఈ సంఖ్యను చెబుతున్నారు గానీ ఇది మొత్తం బీదల సంఖ్య కాదు. కరోనా కాలంలో అధికంగా పెరిగిన బీదల సంఖ్యనే ఇది సూచిస్తుంది. మరో విధంగా చూస్తే అంతకు ముందు ఒక స్థాయి జీవితం గడుపుతున్న వాళ్ళు ఎంతమంది కొత్తగా నిరుపేదలు గా మారిపోయినదీ ఈ సంఖ్యలు చెబుతాయి.
జనవరి 2020 అంచనాలు, జనవరి 2021 అంచనాల మధ్య గల భేదం పేదరికం లో వృద్ధిని వ్యక్తం చేస్తాయి. ఇంటింటి సర్వే ల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాలు వేస్తున్నారు. అయితే ఇండియా లాంటి పెద్ద దేశానికి సంబంధించిన తాజా సమాచారం లభ్యం కావటం లేదు . అందువల్ల గతంలోని సమాచారం ఆధారంగా ఉజ్జాయింపు లెక్కలతో ప్రస్తుత పరిస్థితిని అంచనా వేశారు . అంటే ఈ సంఖ్యలు క్షేత్ర స్థాయి పరిస్థితిని కచ్చితంగా ప్రతిబింబించటం లేదు. వాస్తవంలో ఇంకా ఎక్కువమందే, బీదలు నిరుపేదలుగాను, అనేకమంది ఇతరులు కొత్తగా పేదలుగాను మారిపోయారని ప్రాంతీయ సర్వే లు చెబుతున్నాయి.
“2020 లో పెరిగిన పేదరికం స్థాయి గతం లో ఎన్నడూ చూడనిది” అని మాత్రం ఈ గణాంకాలు నిర్ద్వంద్వంగా తేల్చి చెబుతున్నాయి. కోవిడ్ కు ముందు మూడు దశాబ్దాల కాలంలో ఇంత స్థాయి లో బీదరికం పెరిగినది ఆసియా ఆర్ధిక సంక్షోభ కాలంలో మాత్రమే.
అప్పుడు 1997 లో 1.80 కోట్ల మంది, 1998 లో 4.70 కోట్ల మంది కొత్తగా పేదరికం లోకి జారిపోయారని లెక్క గట్టారు. ఆ తరువాత 20 సంవత్సరాలలో జరిగిన ఆర్ధిక అభివృద్ధి వల్ల వారిలో చాలామంది పేదరికం కోరల నుండి అంతో ఇంతో బయట పడ్డారు అని ప్రపంచ బ్యాంక్ అంటోంది. కానీ “కోవిడ్ 19 మళ్ళీ ఈ ఆర్ధిక అభివృద్ధిని తిరోగమింప జేసింది, 8.8 నుండి 9.3 కోట్ల మంది ప్రజలను అత్యంత పేదలుగా దిగజార్చి వేసింది. బహుశా కోవిడ్ లేక పోయినట్లయితే ఈ సంఖ్య మూడు కోట్ల మందికే పరిమితమయ్యేది” అని వారు అంటున్నారు.
కానీ కోవిడ్ వల్ల పేదల సంఖ్య 12- 12.4 కోట్లకు చేరుకుంది. వీరిలో దాదాపు 60% మంది దక్షిణ ఆసియా లో (ఇండియా కూడా వుంది) నివసిస్తున్న వారే. రోజుకి 1.90 డాలర్ల ఆదాయపు రేఖ కంటే దిగువన వున్నవారిని చూస్తే బీదల సంఖ్య ఈ విధంగా పెరిగింది . అయితే 3.20 డాలర్ల ఆదాయ రేఖను ప్రామాణికం గా తీసుకుంటే 17.5 నుండి 22.8 కోట్ల మంది కొత్తగా బీదరికం పరిధిలోకి వస్తారు. రోజుకు 5.50 డాలర్లకు ఎగువన ఆదాయం ఉన్న వారిని చూస్తే వారిలో బీదలుగా మారిన వారి సంఖ్య స్వల్పంగానే ఉంది.
అంటే కోవిడ్ కాలంలో అల్ప ఆదాయ వర్గాలు ఆర్ధికంగా నికృష్ట పరిస్థితిలోకి జారిపోయాయి, మధ్య తరగతి వారి ఆదాయం మీద కొద్దిగా ప్రభావం ఉంది. కానీ ఉన్నత తరగతి వారి ఆదాయం అంతగా పడిపోలేదని స్పష్టమవుతోంది.
వ్యాక్సిన్ అంధుబాటు లోకి వచ్చి, కోవిడ్ ను అరికట్టినా, 2021 లో ఈ ఆర్ధిక తిరోగమనాన్ని ఆపివేయగలమన్న భరోసా ఏమీ లేదు. సరి గదా 2021 లో 14.3 నుండి 16.3 కోట్ల మంది ప్రజలు బీదరికం ఊబిలో చిక్కుకు పోయే అవకాశమే ఉన్నది. ఈ స్థితి తాత్కాలికం గాదు, దీర్ఘ కాలం కొనసాగబోతున్నదని కూడా ప్రపంచ బ్యాంక్ అంచనాలు తెలియ జేస్తున్నాయి.
బీదరికాన్ని పారదోలటానికి తాము దశాబ్దాలుగా చేస్తున్న కృషికి కరోనా పాండమిక్ అత్యంత తీవ్ర విఘాతం కలిగించిందని, పెట్టుబడిదారీ ప్రపంచం కలవర పడుతున్నది. నింద మొత్తం కరొన మీదికి నెట్టి , తమ పాపాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నది. వీరు చూపించే పరిష్కారాల ద్వారా బీదరికం సమసిపోదు గదా, ఆర్ధిక అసమానతలు మరీ విస్తరించనున్నాయి.
ఆధునిక చరిత్రలో ఆర్ధిక వ్యవస్థల ను ఇంత భయంకరంగా ప్రభావితం చేసి, తీవ్రమైన పేదరికాన్ని పెంచిన మరో సంక్షోభాన్ని ఉదాహరించలేము. మానవాళికి ఉమ్మడి ముప్పుగా పరిణమించిన ఈ దుస్థితిని మానవాళి ఉమ్మడిగానే పరిష్కరించుకోవలసి ఉంది. సంక్షోభ జలాలో చేపలు పట్టుకుని, తమ ప్రయోజనాలు నెరవేర్చుకునే పెట్టుబడిదారీ దేశాల పద్ధతులకు చెల్లు చీటి పెట్టి , అత్యధిక శాతం గ ఉన్న బీద ప్రజలకు ఉపయోగపడే పధకాలు రూపొందించి , అమలు చేసి, వారి ఆదాయాలను పెంచవలసిన ఆగత్యాన్ని ఈ గణాంకాలు ముందుకు తెస్తున్నాయి.
(డాక్టర్ జతిన్ కుమార్, వృత్తి రీత్యా వైద్యుడు. హైదరాబాద్ )